logo

లక్ష్య సాధనలో పరుగులు

జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్‌ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి.

Published : 29 Mar 2024 05:20 IST

మార్కెట్‌ ఫీజు వసూళ్లలో ముందంజ
జిల్లా వ్యవసాయోత్పత్తుల విక్రయాలు ఆశాజనకం

మానిక్‌బండార్‌ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్‌ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడటంతో మార్కెటింగ్‌ శాఖ ఆయా కమిటీలకు నిర్దేశించిన లక్ష్యాలు దాటి పరుగులు పెడుతున్నాయి. ఒక్క నిజామాబాద్‌ యార్డు కాస్తా వెనుకంజలో ఉన్నప్పటికీ ఈ నెలాఖరుకు అది కూడా దాటే అవకాశాలున్నాయి. ఈ నెలలోనే పసుపు విక్రయాలు 2 లక్షల క్వింటాళ్ల వరకు ఉండటంతో ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.

పది శాతానికి పైగానే..

మార్కెటింగ్‌ శాఖ గతేడాది మార్కెట్ల వారీగా వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఏడాదికి లక్ష్యాలు నిర్దేశిస్తుంది. అందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు రూ.17.95 కోట్లు ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఫిబ్రవరి నెలాఖరుకే రూ. 18.77 కోట్లు దాటిపోయింది. దాదాపు నాలుగున్నర శాతం అదనంగా చేరింది. ఈ నెలలో పసుపు క్రయవిక్రయాలు ఎక్కువగా ఉండటంతో మరో రూ.3 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తయితే 10 శాతం అదనంగానే వసూళ్లు జరిగే వీలుంది. బోధన్‌, ఆర్మూర్‌, వర్ని, కమ్మర్‌పల్లి, కోటగిరి, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీల్లో గణనీయంగా వసూళ్లు అయ్యాయి. అయితే మొత్తం వసూళ్లలో నిజామాబాద్‌ కమిటీదే 70 శాతం మేర ఉండడం గమనార్హం.

ధాన్యం కొనుగోళ్లతో మరో రూ. 20 కోట్లు

నిజామాబాద్‌, బోధన్‌, వర్ని మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో మూడేసి తనిఖీ కేంద్రాలు (చెక్‌పోస్టులు), ఆర్మూర్‌, కమ్మర్‌పల్లి, కోటగిరి, వేల్పూర్‌ కమిటీలకు రెండేసి తనిఖీ కేంద్రాలున్నాయి. మొత్తంగా జిల్లాలో 17 చెక్‌పోస్టుల ద్వారా వ్యవసాయోత్పత్తుల విక్రయాలపై పకడ్బందీగా పర్యవేక్షణ చేయడంతో అనుకున్న లక్ష్యాలు సాధించారు. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఏటా రెండు సీజన్లకు కలిపి సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సొసైటీలు, మెప్మా, ఐడీసీఎంఎస్‌ సంస్థలు కొనుగోలు చేస్తే వాటి ద్వారా కూడా మార్కెటింగ్‌ శాఖకు ఫీజు వసూలవుతుంది. దీనిని నేరుగా వచ్చే ఆదాయంగా లక్ష్యాల్లో పొందుపరచడం లేదు. ఇదో రూ.20 కోట్ల వరకు ఏటా వచ్చే వీలుంది. మొత్తంగా మార్కెటింగ్‌ శాఖకు రూ.40 కోట్ల ఆదాయం సమకూరుస్తున్నారు.


ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

జిల్లాలో అన్నీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఈ ఏడాది నిర్దేశించిన వసూళ్ల లక్ష్యాలు సాధించాయి. ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బందితో సమీక్షించి, పర్యవేక్షించడం ద్వారా సఫలీకృతమయ్యాం. ఇందులో నిజామాబాద్‌ యార్డుదే ప్రధాన భూమిక. పసుపు విక్రయాలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ మార్కెట్‌ లక్ష్యం ఈ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. 

గంగుబాయి, జిల్లా మార్కెటింగ్‌ అధికారిణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని