logo

ఓటేయాలి.. చైతన్యం చాటాలి

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్‌ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

Published : 29 Mar 2024 05:26 IST

స్వీప్‌ ద్వారా ముమ్మరంగా కార్యక్రమాలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్‌ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓటింగ్‌ శాతానికి మించి మే 13న నిర్వహించే  పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌లో ఎక్కువ మంది ఓటు వేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాలు, పట్టణాలు, నగరం ఇలా అన్నిచోట్ల అవగాహన కార్యక్రమాలు జోరుగా చేపడుతున్నారు.

ఏప్రిల్‌ 15 వరకు అవకాశం

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాల్లో స్వీప్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 15 వరకు నమోదుకు అవకాశం ఉందని వివరిస్తున్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని వివరిస్తున్నారు. నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పురపాలక సంఘాల్లో 5కె పరుగు నిర్వహించారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు, సీనియర్‌ సిటిజన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

తక్కువ పోలింగ్‌ నమోదైన కేంద్రాలపై దృష్టి

అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువగా ఓటింగ్‌ నమోదైన పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించారు. నిజామాబాద్‌ అర్బన్‌లో 289 కేంద్రాలుంటే ఇందులో 21 చోట్ల తక్కువ ఓటింగ్‌ శాతం నమోదైందని అధికారులు గుర్తించారు. ఈ సారి ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. వీటి పరిధిలోని కాలనీ అభివృద్ధి కమిటీలు, అపార్ట్‌మెంట్‌ కమిటీలు, మహిళా సంఘాలు, సీనియర్‌ సిటిజన్లతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే...

2023 నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో అత్యధికంగా 81.29 శాతం, నిజామాబాద్‌ అర్బన్‌లో అతితక్కువగా 61.67 శాతం నమోదైంది. ఆర్మూర్‌లో 76.02, బోధన్‌లో 77.82, నిజామాబాద్‌ గ్రామీణంలో 76.43, బాల్కొండలో 79.72 శాతం పోలింగ్‌ నమోదైంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటింగ్‌ వేశారు. అత్యల్పంగా నమోదైన ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పెరిగేందుకు గోడ రాతలు, కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

విద్యార్థులకు అవగాహన

భవిష్యత్తు ఓటరు ప్రస్తుత విద్యార్థి కావడంతో వారికి ముందుగా అవగాహన కల్పిస్తున్నారు. 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు ఓటరు సంకల్ప పత్రాలు పంపిణీ చేశారు. ఇంటికి తీసుకవెళ్లి తల్లిదండ్రులతో ఓటు వేస్తామని ఆ పత్రంలో రాసి సంతకం చేయించి తిరిగి అధికారులు తీసుకున్నారు. ఇలాంటి పత్రాలను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఇది అన్ని పాఠశాలల్లో చేపట్టారు.

నిజామాబాద్‌ నగరంలో ఓటరు అవగాహనపై
నిర్వహించిన 5కే పరుగులో పాల్గొన్న క్రీడాకారులు

 


బాధ్యతగా భావించాలి

ఓటరు జాబితాలో పేరున్న వారు తప్పక హక్కును వినియోగించుకోవాలి. మే 13వ తేదీన ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయాలి. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి.

సురేష్‌ కుమార్‌, స్వీప్‌, నోడల్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని