logo

రథయాత్రలోగా కారిడార్‌ పనులు

పూరీ శ్రీజగన్నాథ్‌ కారిడార్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రథయాత్రలోగా నిర్మాణాలు పూర్తవుతాయన్న అంచనా ఉంది.

Published : 30 Jan 2023 02:17 IST

శ్రీక్షేత్రం ఆవరణలో కారిడార్‌ పనులు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీజగన్నాథ్‌ కారిడార్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రథయాత్రలోగా నిర్మాణాలు పూర్తవుతాయన్న అంచనా ఉంది. రూ.వెయ్యికోట్ల వ్యయంతో 2019లో ప్రారంభమైన నిర్మాణాలకు కొవిడ్‌ మహమ్మారి అంతరాయం కలిగించింది. దీంతో నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉన్నా ఈ పనులకు నిధుల కొరత రానీయబోమని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒడిశా వంతెనల నిర్మాణాల కార్పొరేషన్‌ (ఓబీసీసీ) పర్యవేక్షణలో టాటా కన్‌స్ట్రక్షన్‌ గ్రూపు కారిడార్‌ పనులు చేపట్టింది.

మహాప్రస్థానం పనులు పూర్తి

కారిడార్‌ పనుల్లో శ్రీసేతు, ఒబడా ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాల్లో మహాప్రస్థానం పనులు పూర్తయ్యాయి. ఇది వినియోగంలోకి వచ్చింది. ఒకేసారి 28 పార్థివ దేహాల దహన సంస్కారాలు జరుగుతున్నాయి. స్వర్గద్వార తీరానికి చేరువలోని రుద్రభూమిని విస్తరించారు. దహన సంస్కారాలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. మృతదేహాలకు పూరీలో అంత్యక్రియలు చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్న నమ్మకం ఉంది. దీంతో దూర ప్రాంతాల నుంచి పార్థివ దేహాలను తీసుకొస్తున్నారు.

రుద్రభూమి

వినియోగంలోకి యాత్రి నివాస్‌లు

భక్తుల సౌకర్యార్థం నీలాద్రి భక్త నివాస్‌, జగన్నాథ్‌ భక్త నివాస్‌ నిర్మించారు. ఇది వినియోగంలోకి వచ్చాయి. రథయాత్ర నుంచి స్వల్ప ధరలకు యాత్రికులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. శ్రీక్షేత్రం ఆవరణలో ఆధునిక తరహా మరుగు దొడ్లు, విశ్రాంతి గదులు, లాన్‌ ఫౌంటెయిన్‌, తదితర నిర్మాణాలు జరిగాయి.

యుద్ధప్రాతిపదికన రహదారుల పనులు

కారిడార్‌ పనుల్లో కీలకమైన ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ మార్గాల నిర్మాణంతో శ్రీక్షేత్ర ఆవరణలో భక్తుల రద్దీని నియంత్రించొచ్చు. దర్శనాలు సులువుగా జరుగుతాయి. సింహ (తూర్పు), ఉత్తర, పశ్చిమ, దక్షిణ ద్వారాలతో ఇన్నర్‌ రోడ్‌ అనుసంధానిస్తారు. మేఘానథ ప్రహరీకి ఎదురుగా మరో ప్రహరీ పనులూ ప్రారంభించారు.

త్వరలో బహుళ అంతస్థుల కాంప్లెక్స్‌ పనులు

కారిడార్‌ పనుల్లో భాగంగా బొడొదండోలో వ్యాపారుల దుకాణాలు, ఇళ్లు తొలగించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ చెల్లించిన యంత్రాంగం కలెక్టరేట్‌కి చేరువలో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించి గదులు చిన్న వ్యాపారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. దిగువ కార్లు, చిన్న వాహనాల పార్కింగ్‌, పైన మరో మూడంతస్థుల్లో మార్కెట్‌ ఆవరణ ఉంటుంది. ఈ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.


సీఎస్‌ సందర్శన

5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తరచూ పూరీ వచ్చి పనుల ప్రగతి పరిశీలిస్తున్నారు. సీఎం కూడా తరచూ సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సురేష్‌ మహాపాత్ర్‌ శనివారం సాయంత్రం పూరీ వచ్చారు. ఆదివారం ఉదయం కలెక్టరు సమర్థవర్మ, ఇతర అధికారులతో కలసి మహాప్రస్థానం, కారిడార్‌ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పురుషోత్తముని కృపతో అవరోధాలు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని, మూడునెలల్లో పూర్తవుతాయన్న అంచనా ఉందని చెప్పారు. రథయాత్ర నాటికల్లా భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. బొడొదండోలో శాశ్వత బారికేడింగ్‌, వరుసక్రమంలో దర్శనాలు, మార్గమధ్యంలో చలివేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ఆనందబజారులో భక్తులు ప్రసాదాలు ఆరగించడానికి ప్రత్యేక సౌకర్యాలు సమకూర్చనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని