logo

గవర్నరుగా రఘుబర్‌ దాస్

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా అగ్రనేత రఘుబర్‌ దాస్‌ ఒడిశా 26వ గవర్నరుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌ అధికార వర్గాలు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. 1955 మే 3న జంషెడ్‌పూర్‌ (ఝార్ఖండ్‌)లో జన్మించిన ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

Published : 20 Oct 2023 05:33 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా అగ్రనేత రఘుబర్‌ దాస్‌ ఒడిశా 26వ గవర్నరుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌ అధికార వర్గాలు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. 1955 మే 3న జంషెడ్‌పూర్‌ (ఝార్ఖండ్‌)లో జన్మించిన ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో జనతా పార్టీలో ఉన్న ఆయన 1980లో భాజపాలో చేరారు. 1995 నుంచి అయిదుసార్లు జంషెడ్‌పూర్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో ఝార్ఖండ్‌ ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన ఆయన 2014-19లో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం భాజపా కేంద్ర శాఖ ఉపాధ్యక్షునిగా ఉన్న ఆయనకు గవర్నరు పదవి వరించింది. బీఎస్సీ, బీఎల్‌ చదివిన దాస్‌ రాజకీయాల్లోకి రాక ముందు జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌ రోలింగ్‌ మిల్‌లో పనిచేశారు.

ప్రజల హృదయాల్లో నిలిచిన గణేశీలాల్‌

రాజ్యాంగ పరిధిలో ఉన్న గవర్నర్లు రాజ్‌భవన్‌లకే పరిమితంగా ఉంటారని, ప్రజలకు దూరంగా ఉంటారన్న వాదనలకు భిన్నంగా ఆచార్య గణేశీలాల్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మీయునిగా నిరూపించుకున్నారు. 2018 మే 25న గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీ కాలం (అయిదేళ్లు) ఈ ఏడాది మే 29న ముగిసింది. తర్వాత కేంద్రం వ్యవధి పొడిగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన హరియాణావాసి. ప్రముఖ వర్సిటీల్లో ఆచార్యునిగా గతంలో విధులు నిర్వహించారు. ఆరెస్సెస్‌తో సన్నిహిత సంబంధాలున్న ఆయన హరియాణ ఏబీవీపీ అధ్యక్షునిగా, కేంద్ర భాజపా క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా విధులు నిర్వహించారు. 1976 ఎమర్జన్సీలో కొన్నాళ్లు కారాగారంలో ఉన్నారు. సిర్సా అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎన్నికైన ఆయన మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఒడిశాలో గణేశీలాల్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్‌భవన్‌కే పరిమితం కాకుండా ప్రజల మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కులపతి (ఛాన్స్‌లర్‌) హోదాలో విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు సందర్శించి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లో ఒడియా భాష నేర్చుకున్న ఆయన జగన్నాథుని ప్రియభక్తునిగా ముద్రపడ్డారు. సంగీత, సాహిత్య రంగాల్లో ప్రావీణ్యం గల ఆయన తన పదవీ కాలంలో వివాదాల జోలికి వెళ్లలేదు. అధికార, విపక్షాల నాయకులందరి మన్ననలు అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని