logo

పాత ప్రత్యర్థుల ‘ఢీ’

కొరాపుట్‌ నియోజకవర్గంలో పాత ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యమైంది.

Published : 15 Apr 2024 05:29 IST

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ నియోజకవర్గంలో పాత ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యమైంది. బిజద తరఫున రఘురామ్‌ పడాల్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ కుల్‌దీప్‌, భాజపా నుంచి రఘురామ్‌ మచ్చో బరిలో దిగడంతో ఉత్కంఠ నెలకొంది. కుల్‌దీప్‌, రఘురామ్‌ పడాల్‌లు 2019 ఎన్నికల్లో తలపడగా పడాల్‌ గెలుపొందారు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అయినప్పటికీ రఘురామ్‌ పడాల్‌ ప్రవేశంతో బిజద పుంజుకుంటోంది.

నియోజకవర్గం గత చరిత్ర పరిశీలిస్తే...

కొరాపుట్‌ నియోజకవర్గంలో 1951 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్‌దే ఆధిక్యం. 2000 వరకు ఇది జనరల్‌  నియోజకవర్గం. ఇక్కడ తారాప్రసాద్‌ వాహినీపతి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల విభజనతో ఎస్సీలకు ఈ సీట్‌ కేటాయించిన తర్వాత తొలిసారి బిజద అభ్యర్థి రఘురామ్‌ పడాల్‌ విజయం సాధించారు. 2014లో ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడంతో టికెట్‌ దక్కలేదు. ఆ ఏడాది బిజద అభ్యర్థిగా పోటీచేసిన రఘురామ్‌ మచ్చొ, కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ సగారియా చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో రెండోసారి బిజద రఘురామ్‌ పడాల్‌కు అవకాశం ఇవ్వడంతో, కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ కుల్‌దీప్‌ను ఓడించి విజయ శంఖం పూరించారు. తాజా ఎన్నికల్లో మళ్లీ బిజద సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘురామ్‌కు అవకాశం ఇవ్వగా, ఆయన పాత ప్రత్యర్థులు కృష్ణ (కాంగ్రెస్‌), మచ్చో(భాజపా)లతో తలపడనున్నారు. రఘురామ్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు బిజద విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. భాజపా మాత్రం ఇరు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో కొరాపుట్‌లో గట్టి పోటీ జరగనుందని పరిశీలకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని