logo

రాయగడ మీదుగా వందేభారత్‌?

రాయగడ మీదుగా ప్రతిష్ఠాత్మక వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడవనుందా అంటే అవునన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.

Published : 16 Apr 2024 03:59 IST

దుర్గు - విశాఖ మధ్య నడిపే అవకాశాలు

వందే భారత్‌ రైలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ మీదుగా ప్రతిష్ఠాత్మక వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడవనుందా అంటే అవునన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌ - ఏపీ (దుర్గు - విశాఖ) రాష్ట్రాల మధ్య దీనిని నడిపేందుకు రైల్వే అధికారులు ప్రతిపాదించినట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల అనంతరం దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేగనక జరిగితే ఈ మూడు రాష్ట్రల ప్రజలతోపాటు ఏపీ రాష్ట్రంతో అనుబంధమున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తెలుగు వాళ్లకు ఎంతగానో ఉపయోగపడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 565 కి.మీ. పొడవున్న దుర్గు - విశాఖ మధ్య కేవలం 8 గంటల 30 నిమిషాలలో ప్రయాణించే వీలుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దుర్గులో ఉదయం 6 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. విశాఖలో మధ్యాహ్నం 3.15కి తిరిగి బయలుదేరి రాత్రి 11.50కు దుర్గు చేరుకుంటుందని చెబుతున్నారు. వందేభారత్‌తో దుర్గు-విశాఖ మధ్య స్టాపేజీలను 11కి కుదించే వీలుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతుండడం గమనార్హం.

ఈ స్టేషన్లలో నిలుపుదల

దుర్గు - విశాఖ మధ్య నడవనున్న ఈ రైలు రాయిపూర్‌, లఖోవి, మహాసముంద్‌, ఖారియర్‌ రోడ్‌, కంటాబంజి, టిట్లాగఢ్‌, కెసింగ, సింగ్‌పూర్‌ రోడ్‌, రాయగడ, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లలో నిలిపే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. రాయగడను రైల్వే డివిజన్‌  ప్రకటించి, దీనికి సంబంధించి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వందేభారత్‌ రాకతో ఈ మార్గంలో ప్రయాణికులకు మంచి ప్రయోజనముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై వాల్తేరు డివిజన్‌ ఓ రైల్వే ఉన్నతాధికారిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదన్నారు. డివిజన్‌ పరిధిలో ఈ రైలు ప్రయాణానికి సంబంధించి లైన్‌ క్లియరెన్స్‌ సమాచారం ముందుగా ఇవ్వాల్సి ఉంటుందని, అలాంటిదేమి తమకు ఇంతవరకు చేరలేదని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని