logo

ఏమైంది.. సీతంపేట ఊటీ

సీతంపేట ఐటీడీఏ కేంద్రానికి దగ్గరలో ఉన్న జగతిపల్లి పర్యాటకానికి అనుకూల ప్రాంతం. ఇక్కడున్న ఘాట్‌ రహదారి సమీపంలో ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఊటీ మాదిరి నిర్మాణాలు చేపట్టేందుకు ‘హిల్‌ రిసార్ట్సు’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.

Published : 12 May 2022 06:41 IST

కొత్త ప్రభుత్వంలో లేని కదలిక

మధ్యలోనే నిలిచిన నిర్మాణాలు

ఆశయం: సీతంపేట మన్యం ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మార్చేందుకు అప్పట్లో తెదేపా ప్రభుత్వం ‘జగతిపల్లి హిల్‌ రిసార్ట్సు’ ప్రాజెక్టు చేపట్టింది. నిధులు కూడా ఇవ్వడంతో పనులు ఊపందుకున్నాయి.

ఆవిరి: ఎన్నికల కోడ్‌ అమలు.. అనంతరం కొత్త ప్రభుత్వం రాకతో అక్కడ ఎలాంటి కదలికలూ లేకపోవడంతో పనులు రద్దు చేశారో.. కొనసాగుతాయో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కేంద్రానికి దగ్గరలో ఉన్న జగతిపల్లి పర్యాటకానికి అనుకూల ప్రాంతం. ఇక్కడున్న ఘాట్‌ రహదారి సమీపంలో ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఊటీ మాదిరి నిర్మాణాలు చేపట్టేందుకు ‘హిల్‌ రిసార్ట్సు’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ మేరకు మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేశారు. కాటేజీలతో పాటు మినీ కాన్ఫెరెన్సు భవనం, మినీ థియేటర్‌, చిన్నపిల్లల ఆట స్థలాలు, రెస్టారెంట్లు, క్యాంపు ఫైర్‌ నిర్వహణకు సౌకర్యాలు, పెద్ద ఈతకొలను, యాంపీ థియేటర్‌, మరుగుదొడ్లు, పార్కింగ్‌, ఎంట్రన్స్‌ ఆర్చ్‌, వ్యూ పాయింట్‌ తదితర నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.27 కోట్లు కాగా అంతే మొత్తాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసింది.

సగం సగమే

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో సాయితేజ ఇంజినీరింగ్‌ వర్క్సు వారికి పనులు అప్పగించారు. మొదటి విడతలో రూ.7 కోట్లతో టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. 2019 చివరిలో పనులు ప్రారంభం కాగా ఎర్త్‌వర్క్స్‌, పునాది, పిల్లర్ల స్థాయి వరకు పనులు జరిగాయి. అనంతరం ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆగిన పనుల్లో నేటికీ కదలికలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా అటువైపు చూడలేదు. నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో గుత్తేదారు సగం పనులు చేసి వదిలేశారు.

మాస్టర్‌ ప్లాన్‌​​​​​​​

రోప్‌వేకు ప్రతిపాదనలు

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏటా పునఃఅంచనాలు వేస్తున్నారు. ఈక్రమంలో నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. అడ్వాన్స్‌ కింద అప్పట్లో రూ.7 కోట్ల నిధులు మంజూరు కావడంతో కొన్ని పనులు జరిపించాం. బిల్లులు కాకపోవడం, ఇతరత్రా సమస్యలతో గుత్తేదారు మధ్యలోనే ఆపేశారు. రోప్‌వే ఏర్పాటుకు ఇటీవల అనుమతులు కోరుతూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. మంజూరయ్యేందుకు అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. - మదన్‌మోహన్‌, ఏఈ, పర్యాటక శాఖ

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. కొన్ని రోజుల క్రితం పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మన్యంలో పర్యటించిన సమయంలో ప్రాజెక్టు గురించి వివరించాం. ఈ మేరకు వారు పరిశీలించే అవకాశం ఉంది. మరోసారి విన్నవిస్తాం. - బి.నవ్య, పీవో, ఐటీడీఏ, సీతంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని