logo

మీ ఓటు పదిలమేనా..!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్‌ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే.

Published : 29 Mar 2024 04:22 IST

లేకపోతే ఏప్రిల్‌ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు

కొత్తవలస, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్‌ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. ఓటు వేసే రోజు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన తర్వాత లేదని తెలిసి కొందరు లబోదిబోమనడం చూస్తూనే ఉన్నాం. ఓటర్ల జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకుని లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, వివరాల సవరణకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఏడాది జనవరి 22న ఎన్నికల సంఘం 2024 ఓటర్ల జాబితాను ప్రచురించింది.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినా ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నందున 15వ తేదీ వరకు ఓటుహక్కు నమోదు, సవరణకు అవకాశం కల్పించారు. వెంటనే జాబితా తనిఖీ చేసుకుని, లేకుంటే నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు ఫారం-6 స్వీకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాల ప్రచురణ అయిపోయినందున, ఇప్పటి నుంచి ఏప్రిల్‌ 15 వరకూ వచ్చే కొత్త ఓటర్లను అనుబంధం (సప్లిమెంటరీ) జాబితాలో చేరుస్తామని  వివరిస్తున్నారు.

ఉదాసీనత తగదు

జాబితాల పరిశీలనలో ఓటర్లు ఉదాసీనంగా వ్యవహరించకూడదు. తమ ఓటు ఉందా? ఉంటే తమ పోలింగ్‌ బూత్‌లోనే ఉందా? తమ కుటుంబ సభ్యులకు చెందినవన్నీ ఒకే చోట ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. తుది జాబితా విడుదల చేసిన తర్వాత ఆయా పోలింగ్‌ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ తమ పేరు ఉన్నదీ లేనిదీ కూడా చూసుకోవడం లేదు. సాధారణంగా ఓటు ఎక్కడ ఉందో బీఎల్వోలు ఓటర్లకు వివరించాలి. నివాస ప్రాంతానికి సమీప కేంద్రంలోనికి మార్చేలా చూడాలి. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లంతా ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

ఇలా చేయండి

కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతను పరిశీలించి అధికారులు ఓటేసే హక్కును కల్పిస్తారు. దీంతో పాటు చిరునామా మార్చుకోవడానికి అవకాశం ఉంది. దానికి ఫారం-8 అవసరం. గ్రామ/వార్డు సచివాలయం, తహసీల్దార్‌ కార్యాలయంలోని బూత్‌ స్థాయి అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌, హెచ్‌టీటీపీ//సీఈవోఆంధ్రా.నిక్‌.ఇన్‌, హెచ్‌టీటీపీ//ఓటర్స్‌.ఈసీఐ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.


జనవరిలో ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ నియోజకవర్గాల్లో 23,16,599 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో విజయనగరం జిల్లాలో 15,41,001 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,75,598 మంది ఉన్నట్లు చూపించారు. రెండు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికం. విజయనగరం జిల్లాలో 7,80,518 మంది కాగా, పురుషులు 7,60,400 మంది ఉన్నారు. మహిళల ఓట్లు 20,118 అధికంగా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు 3,86,746 మంది కాగా, పురుషులు 3,78,774 మంది ఉన్నారు. ఇక్కడా 7,972 మంది స్త్రీలు అధికంగా నమోదయ్యారు. రెండు జిల్లాల్లో కలిపి మూడో తరం ఓటర్లు 151 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని