logo

నిండు గర్భిణులకు ‘నడక’ యాతన

కొమరాడ మండలంలోని కొండ శిఖర గ్రామం గుమడంగి. ఇక్కడికి ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేదు. గిరిజనులు ఆరు కిలోమీటర్లు నడిస్తే ఒడిశా రాష్ట్రంలోని వంటామాడకి, 17 కి.మీ వెళ్తే ఆంధ్రాలోని కుంతేసు చేరుకుంటారు.

Published : 29 Mar 2024 04:25 IST

కొమరాడ మండలం గుమడంగి నుంచి బయల్దేరిన గర్భిణులు

పార్వతీపురం, కొమరాడ, న్యూస్‌టుడే: కొమరాడ మండలంలోని కొండ శిఖర గ్రామం గుమడంగి. ఇక్కడికి ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేదు. గిరిజనులు ఆరు కిలోమీటర్లు నడిస్తే ఒడిశా రాష్ట్రంలోని వంటామాడకి, 17 కి.మీ వెళ్తే ఆంధ్రాలోని కుంతేసు చేరుకుంటారు. గురువారం ఆ గ్రామానికి చెందిన గర్భిణులు టి.రాధామణి, టి.జున్ని (ఎనిమిది నెలలు)... ప్రసవానికి సమయం దగ్గర పడటంతో గుమ్మలక్ష్మీపురంలోని గర్భిణుల వసతి గృహంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆరు కిలోమీటర్ల దూరంలోని వంటామాడ వరకు నడిచి వస్తామని, అక్కడికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పంపిస్తే అందులో వసతి గృహానికి చేరుకుంటామని స్థానిక ఏఎన్‌ఎంను కోరారు. ఒడిశా మార్గంలో వాహనం పంపడం సాధ్యం కాదని, ఆంధ్రా సరిహద్దుకు వస్తే సౌకర్యం కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. దీంతో గర్భిణులు, కుటుంబసభ్యులతో కలిసి ఆరు కిలోమీటర్ల దూరంలోని వంటామాడ నడిచి వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో 17 కి.మీ. ప్రయాణించి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని అలమండ చేరారు. తర్వాత తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో గుమ్మలక్ష్మీపురం గర్భిణుల వసతిగృహానికి తరలించారు. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు వద్ద ప్రస్తావించగా.. సరిహద్దుల్లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు తిరిగేందుకు ఒడిశా యంత్రాంగం అడ్డుచెబుతోందన్నారు. మరోసారి అక్కడి ప్రభుత్వంతో చర్చించి గర్భిణులు, రోగులకు అత్యవసర సేవలు అందించే వాహనాలను అడ్డుకోవద్దని కోరతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని