logo

మావయ్యా.. మాగోడు వినవేమయ్యా!

మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు.

Updated : 24 Apr 2024 05:54 IST

మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్రాలకు భవనాలు నిర్మించేందుకు నిధులు క్చేటాయించారు. చాలా చోట్ల పనులు ప్రారంభించారు. ఇంతలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గుత్తేదారుల బిల్లుల గురించి పట్టించుకోకపోవడంతో వారు నిర్మాణాలు వదిలేశారు. దీంతో చాలా చోట్ల అద్దె కొంపలే దిక్కయ్యాయి.

- న్యూస్‌టుడే, బొబ్బిలి, గ్రామీణం, బాడంగి, రామభద్రపురం, గంట్యాడ, గ్రామీణం


విద్యుత్తు లేక ఉక్కపోత

 బాడంగి, న్యూస్‌టుడే: బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాలకు సంబంధించి అంగన్‌వాడీ ప్రాజెక్టు బాడంగి మండల కేంద్రంలో ఉంది. దాదాపు 225 కేంద్రాలు ఉండగా.. 59 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఎరుకుపాకలు కేంద్రంలో విద్యుత్‌ సౌకర్యం లేదు. వేసవి నేపథ్యంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో వంట, పిల్లల చదువు ఒకే గదిలో కొనసాగించాల్సి దుస్థితి.


 కూలేందుకు సిద్ధం

గœంట్యాడ, న్యూస్‌టుడే: లక్కిడాం, కొర్లాం చెరుకుకాట అంగన్‌వాడీ కేంద్రాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో మరుగుదొడ్లు, వంట గదులు ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఉన్న ఒక్క గదిలోనే వంట, ఆటలు, చదువు సాగుతున్నాయి. పెంకుల ఇళ్లు కావడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు.


సగంలో ఆగిపోయాయ్‌..

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: కొన్నేళ్ల క్రితం పిరిడిలో మూడు అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేశారు. ఒక్క దానికి మాత్రమే స్లాబ్‌ వరకు పనులు జరిగాయి. మిగిలిన రెండు నాలుగు అడుగుల ఎత్తు గోడలకే పరిమితం అయ్యాయి. కొత్తపెంటకు సుమారు ఏడేళ్ల క్రితం భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా చాలకపోవడంతో స్లాబ్‌ వేశారు. గచ్చులు, తలుపులు, విద్యుత్తు ఇతర పనులు వదిలేశారు. దీంతో పంచాయతీ భవనంలో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.


  అద్దె కొంపల్లోనే..

బొబ్బిలి పట్టణంలో 104 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఎరుకులవీధి కేంద్రం మినహా మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పిల్లలు 3,063 మంది, గర్భిణులు 379, బాలింతలు 335, తల్లులు 714 మంది ఉన్నారు. పట్టణంలోని రామన్నదొరవలస అంగన్‌వాడీ కేంద్రం అద్దె ఇంటిలో నిర్వహిస్తున్నారు. పుల్లేరువలస గ్రామ పిల్లలను ఇందులో విలీనం చేశారు. వారు అప్పుడప్పుడు మాత్రమే కేంద్రానికి వస్తున్నారు. మంగళవారం కేంద్రంలో ఏడుగురు మాత్రమే భోజనాలు చేయడం కనిపించింది. రోజూ 15 మంది వస్తారని, ఈ రోజే తగ్గారని కార్యకర్త పద్మ తెలిపారు.


శిథిలమైన రేకుల షెడ్డులో..

రామభద్రపురô, న్యూస్‌టుడే: రామభద్రపురం శ్రీరామ్‌నగర్‌ కాలనీలో అంగన్‌వాడీ-1 కేంద్రం శిథిలమైన రేకుల షెడ్డులో గత 10 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. సొంత భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోవడంతో లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు. రేకుల కింద వేడితో చిన్నారులు ఉండేందుకు అలమటిస్తున్నారు.


వంట.. చదువు అక్కడే

గœంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సిరిపురం అంగన్‌వాడీ కేంద్రానికి ఒక్క గది మాత్రమే ఉంది. అక్కడే వంటలు, చిన్నారుల ఆటలు, సామగ్రి నిల్వ చేస్తున్నారు. ఈ కేంద్రం విద్యుత్తు బిల్లును గత కొన్ని నెలలుగా పంచాయతీ కట్టకపోవడంతే కనెక్షన్‌ తీసేశారు. దీంతో పిల్లలు ఉక్కపోతలోనే ఉంటున్నారు. అంతేకాదు పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. లోపలి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. అధికారుల దృష్టిలో ఉంచామని, త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయని ఐసీడీఎస్‌ పీవో ఉమాభారతి ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని