icon icon icon
icon icon icon

చిత్తూరుపై పట్టు బిగించిన తెదేపా

చిత్తూరు జిల్లాలోని నీవా నదీతీరంలో రాజకీయ సంగ్రామం రసవత్తరంగా మారింది.

Updated : 06 May 2024 15:08 IST

లోక్‌సభతో పాటు పలు అసెంబ్లీ స్థానాల్లో పెరిగిన బలం
అధికార పార్టీ అక్రమాలు.. 
దౌర్జన్యాలపై ప్రజల్లో వ్యతిరేకత
ఇసుక దందా.. భూ ఆక్రమణల్లో 
వైకాపా ప్రజాప్రతినిధుల ప్రమేయం
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
చిత్తూరు నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

చిత్తూరు జిల్లాలోని నీవా నదీతీరంలో రాజకీయ సంగ్రామం రసవత్తరంగా మారింది. మొదటి నుంచి కాంగ్రెస్, వైకాపాలకు మద్దతుగా నిలుస్తున్న చిత్తూరు లోక్‌సభ (ఎస్సీ) రిజర్వుడు నియోజకవర్గ ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా? వైకాపా చేతికి వెళ్లిన స్థానాన్ని తెదేపా తిరిగి దక్కించుకోనుందా అంటే అవుననే అంటున్నారు ఇక్కడి ప్రజలు. గడచిన ఐదేళ్లలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతల అరాచకాలు.. ఇసుక దందా.. భూ ఆక్రమణలు.. ప్రతిపక్ష నాయకులను కేసులతో వేధించడం, వారిపై దాడుల్లాంటి ఘటనలు ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకున్నాయి. తమ నిరసనను ఓట్ల రూపంలో తెలపాలని నిర్ణయానికి వచ్చారు. లోక్‌సభ పరిధిలోని నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి పర్యటించినప్పుడు ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు స్పష్టంగా కనిపించింది. మనసులో మాట చెప్పడానికే గతంలో భయపడే ఓటరు.. ఇప్పుడు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. ఐదేళ్ల జగన్‌ ప్రభుత్వ పాలనలో తమకు ఎదురైన ఇబ్బందులను కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు. కుప్పం, నగరి, పలమనేరు నియోజకవర్గాల్లో తెదేపాకు పూర్తి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. చంద్రగిరి, చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరులో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.

భిన్న తీర్పులే ఇక్కడ ప్రత్యేకం

చిత్తూరు లోక్‌సభ స్థానానికి బలమైన అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావును తెదేపా ఎన్నికల బరిలో నిలిపింది. వైకాపా తరఫున సిటింగ్‌ ఎంపీ రెడ్డెప్ప మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్సీలకు రిజర్వు చేసిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో.. 2009, 2014లో తెదేపా గెలిచింది. జిల్లాలోని ప్రత్యేక పరిస్థితులు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయావకాశాల్లో కీలకం కానున్నాయి. మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో వేరేపార్టీ గెలిచినా, లోక్‌సభ నుంచి తెదేపా గెలుపొందడం ఇక్కడ ప్రత్యేకత. చంద్రబాబుకు కుప్పంలో వచ్చే మెజారిటీ ఎంపీ అభ్యర్థి విజయావకాశాలను మెరుగుపరిచే వాతావరణం ఉంది. 2009 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నగరి, పలమనేరు, కుప్పం.. 2014లో చిత్తూరు, కుప్పం అసెంబ్లీ స్థానాలనే తెదేపా గెలుచుకుంది. కానీ ఆ రెండు ఎన్నికల్లో ఎంపీ స్థానం తెదేపా ఖాతాలో పడింది.

కుప్పంలో మెజారిటీపైనే దృష్టి

తెదేపా అభ్యర్థి చంద్రబాబు గెలుపు నల్లేరుపై నడక కానుంది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా పార్టీశ్రేణులు పనిచేస్తున్నాయి. కుప్పం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వరుసగా ఏడుసార్లు చంద్రబాబునే విజయం వరించింది. వైకాపా తరఫున ఎమ్మెల్సీ భరత్‌ను పార్టీ బరిలో నిలిపింది. ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకతే చంద్రబాబుకు భారీ మెజారిటీ తెచ్చిపెడుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. క్వారీల నుంచి అనధికారిక వసూళ్లు చేసినట్లు, ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులతో వేధించినట్లు భరత్‌పై ఉన్న ఆరోపణలు ఎన్నికల్లో ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలకు నిధులు విడుదలైనా.. పనులు జరగకుండా మంత్రి పెద్దిరెడ్డి అడ్డుపడటం వైకాపాకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.

చెవిరెడ్డి దందాలతో.. ‘సన్‌’కు స్ట్రోక్‌ తప్పదా?

చంద్రగిరి నుంచి తెదేపా తరఫున పులివర్తి వెంకట మణిప్రసాద్‌ (నాని).. వైకాపా తరఫున సిటింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీచేయడంతో ఏర్పడిన ఓట్ల చీలికతో చెవిరెడ్డి మంచి మెజారిటీ సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగారు. ఆయన అక్కడే దృష్టిపెట్టడంతో.. నియోజకవర్గంలో వ్యవహారాలను ఆయన కుమారుడు చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. తిరుచానూరు మాజీ సర్పంచ్‌ సీఆర్‌ రాజన్, డాలర్స్‌ దివాకర్‌రెడ్డి, బడి సుధాయాదవ్, పాకాల జడ్పీటీసీ సభ్యురాలు పద్మజారెడ్డి భర్త బాబురెడ్డి (చెవిరెడ్డి ముఖ్య అనుచరుడు), మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు మునిపల్లి సుధీర్‌రెడ్డి వంటి బలమైన నేతలు తెదేపాలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. చెవిరెడ్డి అనుచరుల దందాలు.. దౌర్జన్యాలు.. సెటిల్‌మెంట్లు వైకాపాకు ప్రతికూలంగా మారతాయని చెబుతున్నారు. మఠం భూములను దౌర్జన్యంగా ఆక్రమించినట్లు చెవిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి నియోజకవర్గంలో భూ మాఫియా, మైనింగ్, ఇసుక అక్రమ రవాణా వ్యవహారాలను ప్రోత్సహించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఎన్నికలు ఏకపక్షంగా జరిగే వాతావరణం లేదు. చెవిరెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకతతో ఈసారి ఎన్నికల్లో మోహిత్‌రెడ్డి గెలుపు అంత సులువు కాదన్నది ప్రజల అభిప్రాయం. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడటం.. వైకాపా నుంచి బలమైన నాయకులు పార్టీలో చేరడం ప్రస్తుత ఎన్నికల్లో తెదేపాకు కలిసొచ్చే అంశాలు.

నగరిలో రోజాకు కష్టమే

ఇక్కడ తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌కు సానుకూలత పెరిగింది. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో వైకాపా తరఫున రోజా స్వల్ప ఆధిక్యతతో గెలిచి, మూడోసారి బరిలో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆమె దృష్టిపెట్టకపోగా.. ఆమె సోదరులు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. వడమాలపేట దగ్గర ఏపీఐఐసీ కోసం భూములను అధికధరకు సేకరించడం ద్వారా రూ.10 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలతో పాటు.. అక్రమ క్వారీల నిర్వహణకు సహకరించినట్లు, విలువైన భూములను దౌర్జన్యంగా తక్కువ ధరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుల నుంచి.. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల వరకు అన్నింటి భర్తీలోనూ వసూళ్లకు పాల్పడటాన్ని ప్రజలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రోజాను వ్యతిరేకిస్తూ నగరి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు పలువురు సర్పంచులు, ఐదు మండలాల వైకాపా ఇన్‌ఛార్జిలు రాజీనామా చేశారు. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి సైతం గుడ్‌బై చెప్పేశారు.

జీడీ నెల్లూరులో విజయంపై ఇరువురిలోనూ ధీమా

జిల్లాలోని రెండో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం గంగాధర నెల్లూరులో మరోసారి వైకాపా, తెదేపా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇక్కడినుంచి ఎవరు గెలిచినా స్పల్ప ఆధిక్యతతో గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో వైకాపా తరఫున గెలుపొందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ఆయన కుమార్తె కృపాలక్ష్మి, తెదేపా తరఫున వీఎం థామస్‌ తలపడుతున్నారు. వైకాపాకు బలమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన జీడీ నెల్లూరులో.. మారిన రాజకీయ పరిణామాలతో తెదేపా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. నియోజకవర్గానికి ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యే నారాయణస్వామి విఫలం కావడం.. ప్రతిపక్ష, సొంత పార్టీ వారిని అక్రమ కేసులతో వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రభావం ఆయన కుమార్తె విజయావకాశాలపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

చిత్తూరు బరిలో.. ఇద్దరూ కొత్తవాళ్లే

చిత్తూరు నియోజకవర్గంలో తెదేపా తరఫున గురజాల జగన్మోహన్, వైకాపా తరఫున విజయానందరెడ్డి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరూ మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగడం.. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ ఉత్కంఠభరితంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, మనోహర్‌ తెదేపాలో చేరడం అదనపు బలాన్ని తెచ్చింది. సిటింగ్‌ వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థి) సహకారం తెదేపా అభ్యర్థికి కలిసిరానుంది. ఎర్రచందనం అక్రమ రవాణా.. కల్తీ మద్యం కేసుల్లో వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి నిందితుడు. తనపై 12 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. అలాంటి అభ్యర్థికి వైకాపా టికెట్‌ కట్టబెట్టడంపై ఓటర్లలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇళ్ల పట్టాల పంపిణీలో అనుచరుల వసూళ్లు.. లాటరీ టికెట్ల పేరుతో మాయాజాలం వంటి ఆరోపణలున్నాయి. వైకాపా అభ్యర్థికి ఇవన్నీ ప్రతికూల అంశాలు.

పలమనేరుపై మళ్లీ తెదేపా పట్టు

తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి పట్ల నియోజకవర్గ ప్రజల్లో మొగ్గు కనిపిస్తోంది. వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే వెంకటేగౌడ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముస్లిం, ఎస్సీ సామాజికవర్గాల్లో తెదేపాపై సానుకూలత కనిపిస్తోంది. ఎమ్మెల్యే వెంకటేగౌడ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న  అభిప్రాయం ఓటర్లలో ఉంది. పలు మండలాల్లో బలమైన ఓటుబ్యాంకు ఉన్న స్థానిక నేతలను దూరం చేసుకోవడం ఎన్నికల్లో ఆయనకు ప్రతికూల ఫలితాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఇసుక దందాలో ప్రమేయం.. కర్ణాటకలోని క్వారీని బలవంతంగా లాక్కున్న ఆరోపణలతో న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడం వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి సోదరుడు, పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కరరెడ్డి తెదేపాలో చేరడం ఆ పార్టీకి కలిసొస్తుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.

పూతలపట్టులో హోరాహోరీ

2009లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో తెదేపా రెండుసార్లు స్వల్ప తేడాతో ఓటమి చెందింది. ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మురళీమోహన్, వైకాపా అభ్యర్థి సునీల్‌కుమార్‌ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గ సిటింగ్‌ ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. ఆయన వైకాపా ఓట్లకే గండికొట్టే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చీల్చే ఓట్లు తమకు విజయావకాశాలను తెచ్చి పెడతాయని తెదేపా భావిస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img