logo

హలో చీపురుపల్లి.. బై బై బొత్స

ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Published : 10 May 2024 03:23 IST

ఎన్నికల్లో బొత్స కుటుంబాన్ని ఓడించాలి
ఉత్తరాంధ్రలో బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

గరివిడి, చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘చీపురుపల్లిలో జన సునామీని చూస్తున్నా.. యువత హుషారుగా ఉంది. ఎటూ చూసినా.. నా ఆడబిడ్డలే కనిపిస్తున్నారు.. రాణీ రుద్రమదేవీలా గర్జిస్తున్నారు.. మంచి ఊపు ఉంది.. అది రోజురోజుకూ మరింత పెరుగుతోంది.. మీ ఉత్సాహం చూస్తుంటే ఎమ్మెల్యేగా కిమిడి కళావెంకట్రావు, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు ఖాయమని తేలిపోయింది. గెలిపిస్తామని అంతా గట్టిగా చప్పట్లు కొట్టండి.. మంత్రి బొత్స సత్యనారాయణ గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి. రేపటి నుంచి ఎక్కడా తిరగకూడదు.. తెదేపాకు ఉత్తరాంధ్ర కంచుకోట. ఇక్కడ బీసీలు ఎక్కువ. అందుకే తెదేపా హయాంలో బీసీ నేతలైన కళా వెంకట్రావు, ఎర్రన్నాయుడుకు మంచి అవకాశాలు ఇచ్చాం. వైకాపా హయాంలో పెద్ద నాయకుడిగా చెప్పుకొంటున్న బొత్స సత్యనారాయణ బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి తథ్యం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మీకు సీట్లిస్తే దోచుకున్నా.. మాట్లాడరా

పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. తమ్ముడు అప్పలనర్సయ్య ఎమ్మెల్యే.. మేనల్లుడు చిన్న శ్రీను జడ్పీ ఛైర్మన్‌.. మరొకరు బడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యే.. భార్య ఝాన్సీలక్ష్మి విశాఖ ఎంపీ అభ్యర్థి. ఏం.. తమ్ముళ్లు.. ఉత్తరాంధ్రలో ఇంకెవరూ సమర్థులు లేరా.. ఇలాంటి బొత్స మనకు అవసరమా.. మీరంతా ఆలోచించాలి. వారిని ఓడించాలి.]

ధాన్యాన్ని దోచుకున్నారు

ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టాన్ని దోచుకున్నారు. ధాన్యం కొనుగోలులో జిల్లా రైతులను దగా చేశారు. క్వింటాకు అదనంగా 7 నుంచి 10 కిలోలు రైతుల నుంచి తీసుకొని జేబు నింపుకొన్నారు. ఈ దోపిడీలో బొత్స అనుయాయుల పాత్ర ఉంది.

బొత్సా రేపొక రోజుంది.. గుర్తుపెట్టుకో

  • జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విసినిగిరి శ్రీనివాసరావు కారుపై వైకాపా గుండాలు దాడి చేయడంపై సభలో స్పందించిన చంద్రబాబు బొత్స రేపొక రోజుంది.. గుర్తుపెట్టుకో.. ఎవరైతే నా కార్యకర్తల జోలికి వచ్చారో.. వారి సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ఎవరూ అధైర్యపడొద్దు. ముందుకు వెళ్లండి.. అవసరమైతే సైకిల్‌తో తొక్కేయండి.. నేను చూసుకుంటా.. 
  • ఎండొచ్చినా.. వానొచ్చినా.. ఓటేయడానికి అంతా ముందుకు రండి.. మీరు ఆ రోజు ఉదయం నిద్ర లేచాక దేవుడ్ని ప్రార్థిస్తారు. అలాగే మనందరి కోసం అంతా కలిసి దేవుడి వద్ద సంకల్పం చేయండి. అంతా కలిసి ముందుకు వచ్చి ఓటేయాలంటూ కోరడంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో ఉత్సాహపరిచారు.
  • ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో అంతా కలిసి ఫ్యాన్‌కు ఉరేయాలి. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగాలని పిలుపునిచ్చారు.
  • ఎండకు భయపడి ఇంట్లో ఉంటే గొడ్డలి ఇంటికి వస్తుంది.. జాగ్రత్త పడండి. ఆ గొడ్డలి ఇంటికి రాకుండా ఫ్యాను రెక్కలు ముక్కలు చేయండి.
  • వివేకం సినిమాను అందరూ చూడండి.. ఈ సినిమా చూడని వారికి చూడమని చెప్పండి.
  • ఇది 80వ సభ. ఎక్కడకు వెళ్లినా ఇదే ఉత్సాహం. సభకు కొంచెం ఆలస్యంగా వచ్చాను. క్షమించాలని చీపురుపల్లి ప్రజలను బాబు కోరారు.

నాగార్జున భవిష్యత్తు నేను చూసుకుంటా..

తెదేపా చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న నాగార్జునకు కొన్ని అనివార్య కారణాలతో టికెట్‌ ఇవ్వలేకపోయాం. పొత్తు ధర్మంలో భాగంగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించాల్సి వచ్చింది. అదే కుటుంబానికి చెందిన కళా వెంకట్రావు సీనియర్‌ నేత. బొత్సను ఎదుర్కొనే సమర్థుడిగా ఇక్కడ నుంచి పోటీకి దించాం. నాగార్జున భవిష్యత్తు బాధ్యత నాది. ఆయనపై అభిమానం ఉన్న మీరంతా కళాను గెలిపించాలి. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులంతా ఒక్కటై కలిసి పనిచేయాలి. నెల్లిమర్ల జనసేనకు, ఎచ్చెర్ల భాజపాకు ఇచ్చాం. ఎన్డీయే అభ్యర్థులందరినీ గెలిపించండి. జనసేన బరిలో లేనిచోట స్వతంత్రులను బరిలోకి దించి గాజు గ్లాసు గుర్తు వచ్చేలా కుట్రలు పన్నారు. అంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లండి. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, చీపురుపల్లి నియోజకవర్గ పూర్వపు బాధ్యుడు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, నియోజకవర్గ జనసేన బాధ్యుడు విసినిగిరి శ్రీనివాసరావు, భాజపా నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌వీఎల్‌ఎన్‌.రాజు, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తోటపల్లిని పూర్తి చేస్తా..ఆర్‌ఈసీఎస్‌ను పునరుద్ధరిస్తా

తోటపల్లి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి చేసి చీపురుపల్లి నియోజకవర్గానికి పూర్తి ఆయకట్టుకు సాగునీరిందిస్తాం. వైకాపా పాలనలో గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థను నిస్తేజంగా మార్చారు. మా ప్రభుత్వం రాగానే ఆర్‌ఈసీఎస్‌ను పునరుద్ధరించి వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తాం. జిల్లాలో కార్మికుల ఉపాధికి అలంబనగా నిలిచిన ఫెర్రో అల్లాయీస్‌ పరిశ్రమలకు గతంలో తెదేపా ప్రభుత్వం ఎంతో ఊతమిచ్చింది. వైకాపా అధికారంలోకి వచ్చాక గడ్డు స్థితిలో పడిన ఈ పరిశ్రమలను అన్ని విధాలా ఆదుకొని కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చూస్తాం. మరిన్ని కంపెనీలను ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం’ అని చంద్రబాబు భరోసానిచ్చారు.


చీపురుపల్లి అభివృద్ధికి పాటుపడతా

- కిమిడి కళా వెంకట్రావు, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి

ఈ ప్రభుత్వం పూర్తిగా తోటపల్లిని నిర్లక్ష్యం చేసింది. పంటలు పండక పోవడంతో రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తోటపల్లిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం. ఈ ప్రాంతంలో ఫెర్రో పరిశ్రమల మూతతో కార్మికులు ఉపాధి పోయింది. నన్ను గెలిపిస్తే ప్రజారుణం తీర్చుకుంటాను. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తాను.


మీ నమ్మకాన్ని వమ్ము చేయను

- కలిశెట్టి అప్పలనాయుడు, కూటమి ఎంపీ అభ్యర్థి

ఎంపీగా ఏ నమ్మకంతో గెలిపిస్తారో.. అదే నమ్మకంతో మీ అందరి మనసులను దోచుకుంటానని మాటిస్తున్నా. పార్లమెంటరీ అభివృద్ధికి కృషి చేస్తాను. ప్రతి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటాను. గ్రామాల్లో అదరణ లభిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ వస్తుందని మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. ఎంపీగా అన్నివర్గాల ప్రజలకూ మేలు జరిగేలా పనిచేస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని