logo

తిరుగు ప్రయాణం.. పెనుభారం

ఒంగోలు నుంచి నిత్యం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు వంటి ప్రాంతాలకు పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి. రాష్ట్రంలో 970 ట్రావెల్స్‌ బస్సులకు అనుమతులు ఉన్నాయి. వీటిలో సుమారు 250కి పైగా జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తాయని అంచనా.

Published : 18 Jan 2022 02:39 IST

 ఇష్టారాజ్యంగా ప్రైవేట్‌ బస్సుల టికెట్‌ ధరలు 
 ఆర్టీసీ సైతం వడ్డింపు


ఒంగోలులో ఓ ప్రైవేట్‌ బస్సు ఎక్కుతున్న కుటుంబం

సంక్రాంతి పండగ ఆనందం ట్రావెల్స్‌ నిర్వాహకుల తీరుతో ఆవిరైపోతుంది. ఉత్సాహంగా తిరుగుప్రయాణమైన వారికి బస్సుల టి·కెట్ల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఈ పర్వదినానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు జిల్లాలోని తమ స్వస్థలాలకు విచ్చేశారు. అనేకమంది ఆదివారం రాత్రి నుంచే తిరుగు ప్రయాణమయ్యారు. 

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు నుంచి నిత్యం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు వంటి ప్రాంతాలకు పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి. రాష్ట్రంలో 970 ట్రావెల్స్‌ బస్సులకు అనుమతులు ఉన్నాయి. వీటిలో సుమారు 250కి పైగా జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తాయని అంచనా. వీటితో పాటు ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు, కనిగిరి ప్రాంతాల నుంచి నిత్యం 60-70 బస్సులు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి.
బాబోయ్‌ ఆ ధరలు
ట్రావెల్స్‌ పేరిట ప్రయాణిస్తున్న బస్సుల్లో ఎక్కువగా కాంట్రాక్టు కేరియర్లుగా అనుమతి పొందినవే. ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు ప్రయాణికులను తరలించేలా అనుమతులు పొందుతారు. ఎక్కువమంది నిబంధనలు ఉల్లంఘించి వాటిని స్టేజి కేరియర్లుగా తిప్పుతున్నారు. ప్రత్యేక కౌంటర్లు తెరిచి టికెట్లు సైతం విక్రయిస్తున్నారు. సంక్రాంతి, దసరా వంటి పండగల సమయాల్లో ధరలు దోపిడీనే. ఉదాహరణకు ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఏసీ బస్సులో సాధారణ రోజుల్లో సీటుకు టికెట్‌ ధర రూ.600-700 ఉంది. బెర్తు రూ.900, రూ.వెయ్యి ఉంటుంది. ఆర్టీసీలో ఈ ధర రూ.600-770. ఈ సీజన్‌లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రావెల్స్‌ బస్సులు సీటుకు రూ.1000, బెర్తు రూ.1,400 నుంచి రూ.1,800 దాకా వసూలు చేస్తున్నాయి. బెంగళూరు, విశాఖపట్నం వంటి దూరప్రాంతాలకు ఈ వ్యత్యాసం మరింతగా ఉంటోంది. ఆర్టీసీ సైతం సాధారణ రోజుల్లో కంటే 50 శాతం అధికంగా ధరలు వసూలు చేస్తోంది. కొందరు ప్రయాణికులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సుల ద్వారా సాధారణ ఛార్జీలతో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. 
జాగ్రత్తలు ఎక్కడ?
ప్రస్తుతం కొవిడ్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్‌ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇవేవీ కొన్ని యాజమాన్యాలకు పట్టడం లేదు. బస్సులను శానిటైజ్‌ చేస్తున్నారా లేదా అనేది పరిశీలించేవారు సైతం లేరు. బస్సు సీటింగ్‌ సామర్థ్యంలో సగం వరకే అనుమతించాలనే నిబంధనలు అమలుకాలేదు. చివరకు క్యాబిన్లలోనూ ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

 ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ రద్దీగా కనిపిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం సోమవారం సాయంత్రం, రాత్రి  అధికసంఖ్యలో ప్రయాణికులు ఇక్కడకు చేరుకున్నారు. -ఈనాడు, ఒంగోలు

410 బస్సుల్లో తనిఖీలు
జిల్లా రవాణా శాఖ అధికారులు ఈ నెల ఏడో తేదీ నుంచి జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన వివరాల ప్రకారం 410 బస్సులను పరిశీలించారు. వివిధ ఉల్లంఘనల కింద 52 బస్సులపై కేసులు నమోదు చేశారు. మార్కాపురంలో ఓ ట్రావెల్స్‌ బస్సును ఇటీవల తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఇది ఈశాన్యరాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన బస్సు. ఎటువంటి పత్రాలు లేకుండానే తిరుగుతుంది. దీంతో ఈ ఒక్కదానికే రూ.1.32 లక్షల జరిమానా విధించారు. మిగిలిన 51 బస్సులకు అధికారులు విధించింది రూ.81వేలు. అంటే ఒక్కొక్క బస్సుకు సగటున పడింది ఎంతో తెలుసా? కేవలం రూ.1,588. మరోవైపు తమ జేబులు గుల్లవుతున్నాయని, టికెట్ల దందాకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని