logo

ఐఏఎస్‌ల నుంచి అటెండర్ల వరకు...

మూడో విడత కరోనా మహమ్మారి ఉద్ధృతి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, ఉద్యోగులు వైరస్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితులతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

Published : 24 Jan 2022 05:19 IST

కరోనా బారిన ఉద్యోగులు

ఖాళీ అవుతున్న కార్యాలయాలు

కందుకూరు ఉప కలెక్టర్‌ కార్యాలయం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే : మూడో విడత కరోనా మహమ్మారి ఉద్ధృతి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, ఉద్యోగులు వైరస్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితులతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

పరిపాలనపై ప్రభావం...: కందుకూరు ఉప కలెక్టర్‌ అపరాజిత సింగ్‌తో పాటు, అదే కార్యాలయానికి చెందిన 12 మంది ఉద్యోగులు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మిగిలిన వారిలోనూ భయం నెలకొంది. ఈ పరిణామం కందుకూరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది. ఎక్కువ మందికి ఒకేసారి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గత రెండు రోజులుగా ఏదో ఒక పని మీద కార్యాలయానికి వెళ్లినవారు భయపడుతున్నారు.

టంగుటూరు, చీమకుర్తి, మార్టూరు, నాగులుప్పలపాడు, కారంచేడు మండలాల తహసీల్దార్లకూ పాజిటివ్‌గా తేలడంతో హోం ఐసోలేషన్‌ నిమిత్తం సెలవుపై వెళ్లారు. టంగుటూరు తహసీల్దార్‌ చిరంజీవికి కరోనాతో బాధపడుతుండగా.. అక్కడ అదనపు బాధ్యతలు అప్పగించేందుకు ఎవరూ లేరు. డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉండటం ఇందుకు కారణం. దీంతో ఆయన అత్యవసర విభాగాలకు చెందిన దస్త్రాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. సంయుక్త కలెక్టర్‌(గృహ నిర్మాణం) కె.ఎస్‌.విశ్వనాథన్‌, జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో నలుగురు ఉద్యోగులతో పాటు, పర్చూరు, అద్దంకి డీఈలూ వైరస్‌ బారిన పడ్డారు. జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ సీఈవో బి.జాలిరెడ్డితో పాటు, ఎ-విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరెడ్డి, అటెండర్‌ సన్నీ, మరో టైపిస్ట్‌కు కూడా కరోనా సోకింది. సీఈవో సెలవులో ఉండటంతో ఏవో వెంకటేశ్వరరావు అత్యవసర దస్త్రాలను నడుపుతున్నారు. యద్దనపూడి, ఇంకొల్లు ఎంపీడీవోలు శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్‌కు పాజిటివ్‌ రావడంతో జడ్పీకి అధికారిక సమాచారం అందించారు.

ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచే...: జిల్లాలో 56 మండలాలున్నాయి. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు స్థానికుల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో నడుస్తున్న కార్యాలయాలతో పాటు, ఇతర సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఇప్పటికే కరోనా వైరస్‌ సోకింది. ఈ సమాచారం తెలుసుకున్న సదరు ఉద్యోగులు గత వారం రోజులుగా కార్యాలయాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. ఆ తర్వాత రోజూ ఏదో ఒక కార్యాలయంలో మిగతా ఉద్యోగుల్లోనూ కేసులు వెలుగు చూస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా కొన్ని కార్యాలయాల్లో ఇతరులను లోపలికి రానీయడం లేదు. ప్రవేశద్వారం వద్దనే అర్జీలు స్వీకరిస్తున్నారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు.

సేవలకు అంతరాయం...

పాజిటివ్‌ కేసులు నమోదు కావడం.. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందికీ కాంటాక్ట్‌ కేసులు వెలుగు చూస్తుండటం.. ఉద్యోగులు హోం క్వారంటైన్‌లో ఉండటంతో పౌరసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అవసరమైన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ నుంచి పొందాల్సి ఉంటుంది. రబీ సీజన్‌ దృష్ట్యా బ్యాంకులో రుణం లేదా ఇతర అవసరాల నిమిత్తం రెవెన్యూ శాఖ నుంచి 1బీ, అడంగల్‌ కాపీలు అందజేయాల్సి ఉంటుంది. వీటి కోసం రైతులు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కరోనా కేసుల కారణంగా ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడంతో సకాలంలో అందటం లేదు. మరికొందరు ఇప్పటికే మ్యుటేషన్‌, సర్వేలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి వాటి గడువు ముగిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.

కొత్త పాజిటివ్‌ కేసులు 1399...

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం 1399 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య 2215 మందికి పరీక్షలు చేయగా 63.2 పాజిటివిటీ రేటు నమోదైంది. అత్యధికంగా ఒంగోలులో 586, చీరాల 92, చీమకుర్తి 79, కొత్తపట్నం 69 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా 169 కేంద్రాల ద్వారా 18 ఏళ్లు నిండిన వారు 5999, బూస్టర్‌ డోస్‌గా 34,519 మంది టీకా పొందారు.

ఒంగోలు తహసీల్దార్‌ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అర్జీల స్వీకరణకు

ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని