logo

హోదా పెంచారు.. భర్తీ మరిచారు

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల స్థాయి పెంచారు తప్ప తదనుగుణంగా వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. కీలకమైన వైద్యసేవల కోసం అటు ఒంగోలు లేదా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. వైద్యవిధాన పరిషత్‌

Published : 25 May 2022 06:29 IST

 వైద్యనిపుణులు లేని సీహెచ్‌సీలు 
 సాధారణ సేవలతో సరి


పునాదులకే పరిమితమైన గిద్దలూరు ఆసుపత్రి భవన నిర్మాణం

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల స్థాయి పెంచారు తప్ప తదనుగుణంగా వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. కీలకమైన వైద్యసేవల కోసం అటు ఒంగోలు లేదా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ దుస్థితి ఎక్కువగా ఉంది. - న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

వైద్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీచేయడంలో జరుగుతున్న జాప్యంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ వేలకు వేలు బిల్లులు చెల్లించలేక అల్లాడుతున్నారు. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని మార్కాపురం జిల్లా ఆసుపత్రి, ఇతర ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో నిపుణులను(స్పెషలిస్టులు) నియమించి మెరుగైన వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. హోదాలు పెంచి వసతులు కల్పించినా కీలకమైన వైద్యులు లేని పరిస్థితి. ప్రస్తుతం 80 శాతం ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల పల్లె నిద్రకు వెళ్లిన సమయంలో జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కంభం ఆసుపత్రిని పరిశీలించారు. సేవలు సక్రమంగా అందడంలేదని.. ప్రధానంగా గైనకాలజిస్ట్, జనరల్‌ మెడిసిన్, మత్తు వైద్యుల కొరత ఉందని ఆయన దృష్టికి వచ్చింది. 
సిజేరియన్లు కష్టమే
జిల్లాలో వైద్యవిధాన పరిషత్‌ కింద 12 ఆసుపత్రులున్నాయి. చీమకుర్తి, ఒంగోలు మాతా శిశువైద్యశాల మినహా అన్ని చోట్ల గైనకాలజిస్టుల కొరత ఉంది. ఇటీవల యర్రగొండపాలెం ఆసుపత్రికి పురిటినొప్పులతో రాత్రిపూట వచ్చిన గర్భిణికి సిజేరియన్‌ చేయాల్సి వచ్చింది. తొలి ప్రసవం కావడం, మత్తు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మార్కాపురం వెళ్లాలని వైద్యులు సూచించారు. వ్యయ ప్రయాసలకోర్చి అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. 
* గిద్దలూరు ఆసుపత్రిలో గతంలో 50 పడకలు ఉండగా రెండేళ్ల క్రితం 100 పడకలకు పెంచారు. పాత భవనం స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. బిల్లులు సరిగా రాకపోవడంతో నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఇంతవరకు పునాదులు దాటలేదు. పేరుకు వంద పడకలు ఉన్నా ప్రస్తుతం పాత భవనంలో 15 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. సిజేరియన్‌ చేసిన మహిళలకు సైతం సమస్య నెలకొంది. వసతి లేక ఇతర శస్త్రచికిత్సలు చేయడంలేదు. ఫిజియోథెరపీ విభాగం ఉన్నా నిరుపయోగమే.
* కనిగిరి ఆసుపత్రిని 30 నుంచి 50 పడకల స్థాయికి పెంచారు. అక్కడ 11 మందికి గాను అయిదుగురు వైద్యులే ఉన్నారు. పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు.


మాతా శిశువైద్యశాలలో నిరీక్షణ

జిల్లా కేంద్రంలోనూ అరకొరగానే...
ఒంగోలు మాతా శిశువైద్యశాలలో డిప్యూటేషన్‌పై ఇతర ఆసుపత్రుల నుంచి వైద్యులను నియమించారు. వారు ఎంతకాలం కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియన్‌ పోస్టులు ప్రధానంగా అవసరం. ఈఎన్‌టీ, డెంటల్, ఆప్తమాలజీ, ఫిజియోథెరపి వైద్యుల కొరత ఉంది. కిందిస్థాయి సిబ్బందిని ఇటీవల ఒప్పంద పద్ధతిలో తీసుకున్నందున కొంతమేరకు సమస్య తీరింది. 

ఇటీవల కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆసుపత్రుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు కోరగా వైద్యవిధాన పరిషత్‌ సమన్వయకర్త డాక్టర్‌ ఎస్‌.ఉష అందజేశారు. వాటిని భర్తీ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని