logo

పోతురాజు.. గాలికొదిలేశారు!

ఒంగోలు నగరంలో వాన, మురుగు ప్రవాహం సాఫీగా సాగాలంటే పోతురాజుకాలువ కీలకం. ఇది ఆక్రమణలకు తోడు పూడికతో ఉండటం, పనులు అసంపూర్తిగా ఉండటంతో అక్కరకు రాకుండాపోయింది. చిన్నపాటి వర్షం వచ్చినా ఉలిక్కిపడాల్సిన పరిస్థితి. నిర్వహణను ఏళ్లుగా గాలికొదిలేశారు.

Published : 02 Oct 2022 04:37 IST

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

నీటి ప్రవాహానికి వీలులేని రీతిలో పోతురాజు కాలువ

ఒంగోలు నగరంలో వాన, మురుగు ప్రవాహం సాఫీగా సాగాలంటే పోతురాజుకాలువ కీలకం. ఇది ఆక్రమణలకు తోడు పూడికతో ఉండటం, పనులు అసంపూర్తిగా ఉండటంతో అక్కరకు రాకుండాపోయింది. చిన్నపాటి వర్షం వచ్చినా ఉలిక్కిపడాల్సిన పరిస్థితి. నిర్వహణను ఏళ్లుగా గాలికొదిలేశారు. చెత్తాచెదారాలు, వ్యర్థాలతో కాలువ ఉంది. 2015లో తుపాను కారణంగా పోతురాజు పొంగిపొర్లడంతో కాలువకు ఇరువైపులా కాలనీల్లోని ఇళ్లలో ప్రవాహం చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. ఆ ప్రభావం నుంచి బయటపడటానికి పదిరోజులు పట్టింది. శనివారం కురిసిన రికార్డుస్థాయి వర్షానికి మరోసారి వీరు హడలిపోతున్నారు.

రూ.69 కోట్లతో మొదలుపెట్టి..

పేర్నమిట్ట నుంచి విరాట్‌నగర్‌, పాత గుంటూరు రోడ్డు, భరత్‌నగర్‌, బాలినేనినగర్‌ తదితర 37 కాలనీల మీదుగా 7.5 కిలోమీటర్ల విస్తీర్ణం పోతురాజు కాలువ ఉంది. మురుగును తీసుకెళ్లడానికి ఉన్న ఈ కాలువ ఆరంభంలో 150 అడుగులు ఉండేది. కాలక్రమంలో ఆక్రమణలు పెరిగి కొన్ని చోట్ల 40 అడుగులకు కుంచించుకుపోయింది. రాజకీయ కారణాలతో కాలువను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిని ఆధునికీకరించాలని నగరవాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2020లో రూ.69 కోట్లతో పనులు చేపట్టారు. 24 నెలల్లో పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఆరంభించగా టెండరు దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన సంస్థ కొవిడ్‌ కారణంగా పనులు ఆలస్యం చేసింది. 2023 డిసెంబరు లోపు పూర్తిచేయడానికి గడువు పొడిగించారు. ఇటీవల జయప్రకాశ్‌ నగర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న కాంక్రీట్‌ గోడ విరిగిపడింది. కాలువ పనులు పూర్తయ్యేలోపు పూడికతీసి నీరు సాఫీగా వెళ్లేలా చేస్తే కొంతలో కొంత ఉపశమనమని స్థానికులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని