logo

వెలుగు వీవోఏ ఆత్మహత్య

ఉరి వేసుకుని మహిళా వీవోఏ అనమలశెట్టి శ్రీలక్ష్మి(31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధి శివరాజ్‌నగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Updated : 28 Nov 2022 05:34 IST

శ్రీలక్ష్మి (పాత చిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: ఉరి వేసుకుని మహిళా వీవోఏ అనమలశెట్టి శ్రీలక్ష్మి(31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధి శివరాజ్‌నగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పని ఒత్తిడా... ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న విషయాలు తెలియరాలేదు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అనమలశెట్టి సురేష్‌కు ఒంగోలుకు చెందిన శ్రీలక్ష్మితో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 11, 9 సంవత్సరాల వయసున్న కుమారులున్నారు. దర్శి వెలుగు కార్యాలయంలో శ్రీలక్ష్మి వీవోఏగా విధులు నిర్వర్తిస్తుండగా, సురేష్‌ స్థానికంగా కూల్‌డ్రింక్స్‌ దుకాణం నడుపుతున్నారు. శనివారం కార్యాలయంలో మీటింగ్‌ అనంతరం ఇంటికి వచ్చిన ఆమె అసహనంగా ఉన్నారని, విశ్రాంతి కోసం గదిలోకి వెళ్లారని ఆమె అత్త రత్తమ్మ చెబుతున్నారు. ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి పిలవగా సమాధానం రాకపోవడంతో భర్త సురేష్‌కు సమాచారం ఇచ్చారన్నారు. ఆయన వచ్చి తలుపులు తెరిచి చూడగా ఉరికి వేలాడుతోందని తెలిపారు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్త ఫిర్యాదు మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే ఆమె ధైర్యవంతురాలని, పని ఒత్తిడికి ఇబ్బంది పడేది కాదని సహోద్యోగులు చెబుతున్నారు. రెండు నెలలుగా మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతోందన్నారు. ఆమె ఆత్మహత్య వెనుక కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉన్నాయి.

యువకుడి బలవన్మరణం: కంభం: ఉరి వేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కందులాపురం పంచాయతీ కందులాపురం కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలియజేసిన వివరాల మేరకు.. కాలనీకి చెందిన ఉప్పు వెంకటరమణ (23) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లోని ఫంకాకు ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. వెంకటరమణకు తండ్రి తిరుపతయ్య, అక్కా, చెల్లి ఉన్నారు.


చెట్టును ఢీకొట్టిన కారు... యువతి మృతి

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కనుమళ్ల ఎస్సీ కాలనీలో చర్చి వద్ద ఆదివారం రాత్రి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో యువతి మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. 108 సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కందుకూరు సుల్తాన్‌ మొహిద్దీన్‌నగర్‌కు చెందిన పల్లా మహేష్‌, కందుకూరులోని మార్కెట్‌ కూడలి సమీపంలో నివసించే వర్షిణి(24) కారులో వెళుతున్నారు. అనుకోకుండా వాహనం అదుపు తప్పి రహదారి పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ముందుగా వారిని కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో  ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వర్షిణి మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫిరోజఫాతిమా తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని