logo

అనాథ దివ్యాంగుల సేవకే అంకితం

చెన్నై లోని వేలూరుకు చెందిన సుబ్రహ్మణ్యం యుక్త వయస్సులో మద్యం, సిగిరేట్లకు బానిసయ్యాడు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లడంతో అక్కడికి వెళ్లారు.

Published : 02 Dec 2022 03:00 IST

వృద్ధాప్యంలోనూ వంట వండి పెడుతూ..
కొయ్య బొమ్మల తయారీలో దిట్ట

తాను చేసిన కళారూపాన్ని చూపిస్తున్న సుబ్రహ్మణ్యం

ఓ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమంలో చికిత్స పొందిన ఆ యువకుడు అక్కడి దివ్యాంగులైన అనాథలను చూసి చలించి పోయాడు. వారి సేవకే  తన జీవితాన్ని అంకితం చేశాడు. వయస్సు మీద పడినా వారికి వంట చేసి పెడుతూ జీవనం సాగిస్తూ తనకు వచ్చి కళతో ఉచితంగా కొయ్య బొమ్మలు తయారీ చేస్తూ పలువురికి అందిస్తున్నారు. అతనే యర్రగొండపాలెంలోని అనాథ ఆశ్రమంలో ఉంటున్న 72 ఏళ్ల సుబ్రహ్మణ్యం. వంటకు సేకరించిన కొయ్యలతో వివిధ కళా రూపాలను తయారు చేస్తూ  అందరిని ఆకట్టుకుంటున్నారు.

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే : చెన్నై లోని వేలూరుకు చెందిన సుబ్రహ్మణ్యం యుక్త వయస్సులో మద్యం, సిగిరేట్లకు బానిసయ్యాడు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లడంతో అక్కడికి వెళ్లారు. ఒక రోజు ఓ టీ దుకాణం వద్ద సిగరెట్‌ కాలుస్తుండగా నిప్పు ఒంటిపై పడి దుస్తులు అంటుకుని ఓళ్లంతా కాలిపోయింది. ఒంటి నిండా గాయాలతో ఉండగా ఓ సిస్టర్‌ ఆయన పరిస్థితిని చూసి ఒక ఫాదర్‌ వద్దకు తీసుకెళ్లి చర్చి ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమంలో చికిత్సలు అందించింది. ఆ ఆశ్రమంలో ఉండే వారంతా అనాథలు, దివ్యాంగులు. కోలుకున్న ఆయన అక్కడ ఉండే మానసిక దివ్యాంగులకు సేవ చేయాలని సంకల్పించాడు. అప్పటి నుంచే వారికి సేవలు చూస్తే ఉండిపోయాడు.

యువకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్‌లో ఒకరోజు కొయ్యబొమ్మలు తయారు చేసే వ్యక్తిని చూసి అతని పనితీరు గమనించి మొదట సారిగా కొడవలితో ఒక చర్చి బొమ్మను తయారు చేశారు. అక్కడ నుంచి కొయ్య బొమ్మల తయారీలో ప్రావీణ్యం సంపాదించారు.  సాయిబాబా బొమ్మలతో పాటు వివిధ బొమ్మలు తయారు చేసి ఇచ్చేవాడు. మూడేళ్ల కిందట హైదరాబాద్‌ నుంచి వై.పాలెంలోని సన్‌జో సేవాలయానికి వచ్చారు. ఇక్కడ ఉండే 20 మంది మానసిక వికలాంగులకు వంట చేసి పెట్టి వారికి సేవ చేస్తున్నారు.

ఇదే నాకు తృప్తి

అనాథ, మానసిక వికలాంగుల ఆకలి తీర్చడం లోనే నాకు సంతృప్తి ఉంది. ఊపిరి ఉన్నంత వరకు వీరికి సేవ చేస్తాను. ఆశ్రమాన్ని సందర్శించేందుకు వచ్చే దాతలకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఇళ్లలో జరుపుకొనే శుభకార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను వృథాగా పడేయకుండా అనాథలకు అందించి వారి ఆకలి తీర్చమని కోరుతున్నా. బొమ్మ తయారు చేయడం నాకు సరదా అంతే.

సుబ్రహ్మణ్యం


ఆకట్టుకునేలా..

  పావురం

ఈ వృద్ధుడు ఒక పక్క దివ్యాంగులకు సేవ చేస్తూ ఆకట్టుకునే కొమ్మ బొమ్మలను తయారు చేయడం విశేషం.  వంట వండి దివ్యాంగులంతా తిన్న తరువాత తినే ఈయన ఖాళీ సమయాల్లో  ఇళ్లలో ఉండే టీవీ, ఫ్రిజ్‌, టేబుల్‌ పై  ఆకర్షణగా ఉంచే పక్షులు, చేపలు, పడవలు తయారు చేస్తుంటారు. తాను చూసింది అచ్చుగుద్దినట్లుగా బొమ్మను తయారు చేయడం ఈ వృద్ధుడి ప్రత్యేకత.  క్రిస్‌మస్‌ వేళలో క్రీస్తు, మేరీ మాత, చర్చి బొమ్మలు రూపొందిస్తుంటారు. ఇంటి ముందు ద్వారబంధాలను అలంకరించే అందమైన రూపాలను చెక్కు అందిస్తుంటారు. ఇవన్నీ ఎవరైనా కోరితే ఉచితంగా తయారు చేసి ఇస్తుంటారు. ఆశ్రమంలో దివ్యాంగులకు సాయం చేసేందుకు వచ్చే దాతలు ఈయన కళా రూపాలను చూసి అభినందిస్తున్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని