logo

బెదిరించడం.. కండువా కప్పడమే వారి పని

‘‘ పది రూపాయలు ఇచ్చి వైకాపా కండువా కప్పి ఆ పార్టీలోకి వచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సమయముంది.

Published : 03 Dec 2022 05:04 IST

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల విమర్శ

సమస్యలు తెలుసుకుంటున్న జనార్దన్‌, పార్టీ నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘‘ పది రూపాయలు ఇచ్చి వైకాపా కండువా కప్పి ఆ పార్టీలోకి వచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సమయముంది. ఆ పార్టీ నుంచి తెదేపాలోకి ముఖ్య నాయకులు ఎవరెవరు వస్తారో మీరే చూస్తారు.. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడికి ఉదయం నుంచీ ఒకటే పని.. బెదిరించడం, ఎవరో ఒకరికి పార్టీ కండువా కప్పడం’’ అంటూ మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ విమర్శించారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టిన ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని బలరాం కాలనీలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులెవరూ బ్యాంకు రుణం కట్టవద్దని.. తెదేపా అధికారంలోకి రాగానే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులను మోసగించి వారి పేరు మీద రుణం తీసుకుని వడ్డీలు కట్టించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఆరు నెలల క్రితం నగదు చెల్లించినవారివి కనీసం పనులన్నా జరుగుతుంటే నమ్మకం ఉండేదన్నారు.     రూ.2 లక్షల చొప్పున రుణం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలను జగన్‌మోహన్‌రెడ్డి అవినీతికి మళ్లించారని ఆరోపించారు. గతంలో టిడ్కో ఇళ్లను ఎవరికైతే కేటాయించామో..వారందరికీ ఇస్తామన్నారు. ఇది దొంగ ప్రభుత్వమని, ఆ మనుషులు చెప్పే మాటలు నమ్మవద్దని సూచించారు. నగరంలో అభివృద్ధి పనులు తెదేపా హయాంలో జరిగినవేనన్నారు.. ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి ప్రజా సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, వైవీ సుబ్బారావు, కొఠారి నాగేశ్వరరావు, గుర్రాల రాజ్‌విమల్‌, ఎద్దు శశికాంత్‌ భూషణ్‌, కె.కుసుమకుమారి, రావుల పద్మజ, నాళం నరసమ్మ, టి.అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని