logo

మిగిలింది అప్పులు.. కన్నీరు

వరుణుడు కరుణించ లేదు.. భూగర్భంలో నీటి చెమ్మ జాడ కానరావడం లేదు.. వందల అడుగు లోతు బోరు తవ్వినా గంగమ్మ కరుణించడం లేదు.. అందిన కాడికి అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప పంటేమో కాపు దశలో కళ్లెదుటే ఎండుముఖం పట్టింది.

Published : 01 Feb 2023 01:50 IST

మిర్చి సాగుపై కరవు ప్రభావం
కాపు దశలో వదిలేసిన వైనం

నీరు లేక చేతికి అందకుండా పోతున్న ఓ మిర్చి తోట

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: వరుణుడు కరుణించ లేదు.. భూగర్భంలో నీటి చెమ్మ జాడ కానరావడం లేదు.. వందల అడుగు లోతు బోరు తవ్వినా గంగమ్మ కరుణించడం లేదు.. అందిన కాడికి అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప పంటేమో కాపు దశలో కళ్లెదుటే ఎండుముఖం పట్టింది. ఈ పరిస్థితులతో కర్షకులు కంట తడి పెడుతున్నారు. ఇదీ త్రిపురాంతకం మండలంలోని మెట్ట ప్రాంతాలైన రామసముద్రం, దువ్వలి గ్రామాల్లో దయనీయ పరిస్థితి.

లారీలు.. ట్రాక్టర్‌ ట్యాంకర్లతో తడులు...: సాగర్‌ ఆయకట్టుకు ఎగువన 1,300 ఎకరాల్లో రైతులు ఈ ఏడాది మిరప సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో బోరు బావులు ఒట్టిపోయాయి. కాపు దశలోని మిర్చి ఎండుముఖం పడుతుండటంతో రామసముద్రం, దువ్వలి గ్రామాలకు చెందిన రైతులు 22 లారీలు, 65 ట్రాక్టర్ల ట్యాంకర్లతో 15 రోజుల పాటు నీటి తడులు అందించారు. ఒక్కో లారీ ట్యాంకర్‌ రూ.5 వేలు, ట్రాక్టర్‌కు రూ.700 చొప్పున చెల్లించారు. లారీల ట్యాంకర్లతో 110 ట్రిప్పులు, ట్రాక్టర్ల ట్యాంకర్లతో 325 ట్రిప్పుల మేర రోజూ రవాణా చేశారు. ఇందుకుగాను రూ.7.60 లక్షల వరకు వెచ్చించారు.

ఆనందం.. 15 రోజుల్లోనే ఆవిరి...: డిసెంబరు 10 నుంచి అయిదు రోజుల పాటు మాండౌస్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెంది బోరు బావుల నుంచి నీరు రావడంతో రైతులు ఎంతగానో సంతోషించారు. అయితే ఆ ఆనందం 15 రోజుల్లోనే ఆవిరైంది. బోరు బావులు అధిక సంఖ్యలో ఎండిపోయాయి. ఆశ చావని కొందరు రైతులు ట్యాంకర్లతో నీటి తడులు అందిస్తున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడులు వెచ్చించినప్పటికీ పంట చేతికి అందడం కష్టంగా మారింది. చేసేదేమీ లేక కొందరు కాపు దశలో పొలాలను వదిలేశారు. పెట్టిన పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.


నీటి తడులకే రూ. లక్షలు

పదెకరాల్లో ఈ ఏడాది మిరప సాగు చేశాను. రూ.12 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాను. కాపు, కోత దశలో అయిదు బోరు బావులు ఒట్టిపోయాయి. ట్యాంకరు ద్వారా తడులకు రూ.లక్షా ఇరవై వేలు వెచ్చించాను. దీనికి తోడు నల్లి కూడా ఆశించడంతో పంట వదిలేశాను. ఇప్పుడు పొలం అమ్మినా అప్పు తీరే పరిస్థితి కనిపించడం లేదు.

జిల్లెళ్ల వెంకటరెడ్డి, రైతు, దువ్వలి


కూలీల ఖర్చుకే ఆదాయం సరి...

నాలుగున్నర ఎకరాల్లో మిరప నాటాను. కాపు దశలో నీటి తడులు అందక ఎండిపోతుండటంతో రూ.2 లక్షలు వెచ్చించి రెండు బోరు బావులు తవ్వించినా నీరు పడలేదు. రెండు ఎకరాలకు రూ.30 వేలు వెచ్చించి నీటి తడులు అందించా. ఇప్పటి వరకు రూ.6 లక్షల పెట్టుబడిగా పెడితే రూ.60 వేల ఆదాయం వచ్చింది. ఆ మొత్తం కూలీలకు సరిపోయింది.

చిలకల రవీంద్రరెడ్డి, రైతు, రామసముద్రం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని