logo

విఠలాపురం సర్పంచిపై ఏం చర్యలు తీసుకున్నారు?

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించినందుకు గాను చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పట్టింది.

Published : 01 Feb 2023 01:50 IST

పంచాయతీరాజ్‌ అధికారులకు హైకోర్టు ప్రశ్న

ఈనాడు, అమరావతి: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించినందుకు గాను చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పట్టింది. ఆ మొత్తాన్ని పనిచేసిన వ్యక్తికి కాకుండా తన బంధువులకు ఓ ప్రజా ప్రతినిధి అందించారు. ఇందుకు కారణమైన తాళ్లూరు మండలం విఠలాపురం సర్పంచి ఎం.ఇంద్రసేనారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రమేష్‌బాబు అనే వ్యక్తి గ్రామ పంచాయతీ ఖాతా కింద ఉపాధి పనులు చేపట్టారు. అందుకుగాను పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. ఈ క్రమంలో మిగిలిన బకాయిలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రమేశ్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. పిటిషనర్‌కు మిగిలిన బిల్లుల సొమ్ము చెల్లించాలని 2021 నవంబర్‌లో ఉత్తర్వులిచ్చారు. అవి అమలు కాకుండటంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని రమేశ్‌బాబు హైకోర్టులో దాఖలు చేశారు. మంగళవారం నాటి విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తన వాదనలు వినిపించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. నిధులు మంజూరు చేశామని, సర్పంచి వాటిని దుర్వినియోగం చేసినట్టు తెలిపారు. అనంతరం న్యాయమూర్తి దేవానంద్‌ స్పందిస్తూ.. దుర్వినియోగం చేశారని మీరే చెబుతున్నప్పుడు ఆ సర్పంచిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని