logo

సమస్యలకు సొమ్ముల్లేవు కానీ.. విహార యాత్రకు!

ఒంగోలు నగరంలో వందలాది సమస్యలు పేరుకున్నాయి. అనేక కాలనీల్లో కనీస మౌలిక వసతులు కరవు. రహదారులు దుర్భరం.. కాలువల పరిస్థితి చెప్పనవసరమే లేదు. నిధుల సమస్యతో ఏవీ పరిష్కారం కావడంలేదు.

Published : 08 Feb 2023 03:01 IST

20 నుంచి ఇతర రాష్ట్రాలకు అధికార పార్టీ కార్పొరేటర్లు
రూ.39 లక్షల కేటాయింపు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలో వందలాది సమస్యలు పేరుకున్నాయి. అనేక కాలనీల్లో కనీస మౌలిక వసతులు కరవు. రహదారులు దుర్భరం.. కాలువల పరిస్థితి చెప్పనవసరమే లేదు. నిధుల సమస్యతో ఏవీ పరిష్కారం కావడంలేదు. ఇలాంటి తరుణంలో ఒంగోలు కార్పొరేటర్లు లక్షలాది రూపాయల కార్పొరేషన్‌ సొమ్ముతో అధ్యయన యాత్రకు సన్నద్ధమవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు గతంలోనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినప్పటికి మెజార్టీ సభ్యుల మద్దతుతో ఆమోదముద్రను వైకాపా సభ్యులు వేయించుకున్నారు.   ప్రతిపాదనలను ముందుగా కలెక్టర్‌కు పంపగా ఈ అంశంపై డీఎంఏ అనుమతి తీసుకోవాలని తెలపడంతో.. తిరిగి దస్త్రాన్ని డీఎంఏకి పంపించి ఆమోదం పొందారు. ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు యాత్రకు వచ్చేది లేదని తేల్చిచెప్పగా అధికార పార్టీలోని మెజార్టీ కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, ఇద్దరు అధికారులు మొత్తం 49 మందితో ఈ నెల 20న పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మేయర్‌కు వ్యక్తిగత పనులు ఉండటంతో వెళ్లాలా? లేదా అనేది నిర్ణయించుకోలేదని సమాచారం. పర్యటన ఖర్చు కింద నగరపాలక సంస్థ రూ.39 లక్షలు కేటాయించింది.

బిల్లులూ చెల్లించలేని పరిస్థితి

ఒంగోలు నగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రస్తుతం చేసిన అభివృద్ధి పనులకు గాను గుత్తేదారులకు దాదాపు రూ.10 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. పొరుగు సేవల ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. నగరంలో చెత్త సేకరణకు వినియోగిస్తున్న పుష్‌కాట్స్‌ మరమ్మతులకు వచ్చినా బాగు చేయించలేకపోతున్నారు. దోమలతో అల్లాడుతున్న తరుణంలో మరో ఫాగింగ్‌ మిషన్‌ కొనుగోలుచేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నా నిధుల సమస్య వెన్నాడుతుంది. పన్నులు సక్రమంగా వసూలు కావడంలేదు. ఆదాయం లేక అమరజీవి కాంప్లెక్స్‌లో అర్ధంతరంగా నిర్మాణం నిలిచిపోయిన దుకాణాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రతిపాదించారు. శివారు కాలనీల్లో రోడ్లు, కాలువలు లేవు.

ఎక్కడెక్కడికి వెళ్తారంటే..

ఈనెల 20 నుంచి పదిరోజులపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు పర్యటిస్తారు. 20న హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి విమానంలో దిల్లీ చేరుకుంటారు. నైనిటాల్‌, హరిద్వార్‌, రిషికేష్‌, ముస్సోరి, చండీఘర్‌, తాజ్‌మహల్‌, జైపూర్‌ సందర్శిస్తారు. చండీఘర్‌, దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లకు వెళ్లి అక్కడి పారిశుద్ధ్య పనుల తీరుపై తెలుసుకుంటారు. వినోదం కలిగించే అహ్లాదకరమైన ప్రదేశాలను తిలకించడంతోపాటు మున్సిపల్‌ పరిపాలన పరమైన అంశాలపై అధ్యయనం చేసేలా పర్యటన ఏర్పాటు చేసినట్లు మేయర్‌ సుజాత తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని