logo

పశువుల పథకానికి మంగళం!‌

పాడి రైతులెవరూ ప్రీమియం చెల్లించకుండానే చనిపోయిన పశువులకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 10 Jun 2023 06:10 IST

ఉచిత నష్ట పరిహారానికి నిరీక్షణ
అమల్లోకి ప్రీమియం చెల్లిస్తేనే బీమా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పాడి రైతులెవరూ ప్రీమియం చెల్లించకుండానే చనిపోయిన పశువులకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2019 సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ పశు నష్ట పరిహార పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయినా ప్రారంభం నుంచే లబ్ధిదారులు పరిహారం కోసం నెలల తరబడి నిరీక్షించారు. ఈ క్రమంలో క్లెయిమ్‌లు అధికంగా రావడంతో తాజాగా ప్రభుత్వం ఆ పథకాన్నే నిలిపేసింది. పాత పథకం కింద లబ్ధిదారులకు ఇంకా నగదు చెల్లించాల్సి ఉంది. ఇక నుంచి రైతు భాగస్వామ్యంతో ప్రీమియం చెల్లించేలా పశు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

* బియ్యం కార్డు లేకుంటే భారం...: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పాడి పెంపకంపై ఎక్కువగా ఆధార పడుతున్నారు. పశు సంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 6,71,812 గేదెలు; 56,332 ఆవులు; 15,67,122 గొర్రెలు, 4,17,589 మేకలున్నాయి. వర్షాలు, వరదలు, పిడుగులు, విద్యుత్తు, రోడ్డు ప్రమాదాల కారణంగా పశువులతో పాటు, గొర్రెలు, మేకలు మరణిస్తుంటాయి. ఒక్కోసారి వ్యాధులు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. తద్వారా బీమా చేయించకుంటే పోషకులకు ఎంతో మేలు చేకూరుతుంది. వీటి వయసు, ఇతర నిబంధనలతో పథకం అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. బియ్యం కార్డు కలిగిన వారికి తక్కువ.. లేనివారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పశువులకు ఒకేసారి మూడేళ్ల కాల పరిమితితో బీమా చేస్తుండగా.. మేకలు, గొర్రెలకు ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితితో చేయించుకోవచ్చు. జిల్లాలో యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నూతన బీమా పథకం కింద పశు పోషకులు ప్రీమియం చెల్లించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పశు సహాయకులు అవగాహన కల్పిస్తున్నారు.

* పాత బకాయిలు ఇస్తారో లేదో...: 2022 జనవరి నెల నుంచి సుమారు 3,600 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్ల మేర పశు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంది. పథకం రద్దయినా సదరు బకాయిలను ఇంతవరకు చెల్లించలేదు. అసలు ఇస్తారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. దీంతో పశు పోషకుల్లో ఆందోళన నెలకొంది. పథకం ప్రారంభం నుంచి 2021 డిసెంబర్‌ వరకు సుమారు రూ.17 కోట్ల మేర బకాయిలు చెల్లించారు. అందుకు కూడా ఏడాది పైనే నిరీక్షించారు. మిగతా లబ్ధిదారులు క్లెయిమ్‌ చేసుకుని నగదు జమ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని