logo

Adimulapu Suresh: మా మంత్రి కనిపించడం లేదు.. కలకలం రేపిన వాల్‌పోస్టర్లు

పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కనిపించడం లేదంటూ  యర్రగొండపాలెంలో వెలసిన గోడపత్రికలు కలకలం రేపుతున్నాయి.

Updated : 11 Mar 2024 07:03 IST

మంత్రి సురేష్‌ ఎక్కడంటూ వెలిసిన గోడపత్రిక

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కనిపించడం లేదంటూ  యర్రగొండపాలెంలో వెలసిన గోడపత్రికలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం వై.పాలెం ప్రధాన రహదారిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా ఉండే ఆర్టీసీ బస్‌ స్టాప్‌ గోడకు వీటిని అంటించారు. గోడపత్రికలో ఆదిమూలపు సురేష్‌,  పేరు, వయస్సు పేర్కొంటూ.. మేము ఓట్లు వేసి గెలిపించిన ఈయన కనిపించటం లేదంటూ వ్యంగ్యంగా రాశారు. మరికొన్ని గోడ పత్రికలు కింద పడి కనిపించాయి.  దీంతో వచ్చే పోయే ప్రజలు వాటిని చదువుతూ వెళుతున్నారు. వైకాపా అధిష్ఠానం మంత్రి సురేష్‌ను వై.పాలెం నుంచి కొండపి పంపించిన తరువాత ఆయన యర్రగొండపాలెం ప్రాంతానికి రాలేదు. ఈ మధ్య సీఎం రాకకు సంబంధించి ఏర్పాట్లు కోసం జిల్లా కలెక్టర్‌తో ఆయన వై.పాలెం కనిపించారు. అంతే తప్ప ఆయన వై.పాలం రాలేదు. వైకాపాలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు ఆ పార్టీలోని వారే పేర్కొంటున్నారు. మంత్రి స్థాయిలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా నమ్మిన కార్యకర్తలను నట్టేటముంచారనే అపవాదు ఆయన మూట గట్టుకున్నారు. అంతేకాక వైకాపా అధిష్టానం తాటిపర్తి చంద్రశేఖర్‌ను ఇక్కడ సమన్వయకర్తగా నియమించడంతో ఆయన జీర్ణించుకోలేక పోయారని, దీంతో చంద్రశేఖర్‌  సమావేశాలకు వైకాపా నాయకులు కార్యకర్తలు హాజరు కావద్దంటూ ఆదేశాలిచ్చినట్లు మొదట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి వ్యతిరేక వర్గం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోవలోనే మంత్రి  కనిపించ లేదంటూ గోడపత్రికలు వెలువడటం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


తెదేపా, జనసేన ఫ్లెక్సీల ధ్వంసం

బేస్తవారపేట, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అధికారం ఉందనే అహంకారంతో వాటిని చించేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఏ నియోజకవర్గంలో చూసినా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బేస్తవారపేట మండలం చింతలపాలెం సమీపంలోని రహదారి పక్కన కంభానికి చెందిన జనసేన నాయకులు ఏర్పాటు చేసిన సంసిద్ధం ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలు చించేశారు. అదే ప్రాంతంలో కొంతదూరంలో తెదేపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సైతం చించేశారు. పక్కనే ఉన్న వైకాపా ఫ్లెక్సీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు