logo

అంబా అని అరిచినా ఆలకించరేం

కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది.

Published : 29 Mar 2024 02:06 IST

పథకాలు తొలగించిన వైకాపా సర్కారు
పోషకుల రాయితీల పైనా వేటు
కష్టకాలంలో పశువులకు గ్రాసమూ లేదు

కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. ఫలితంగా పాడి పరిశ్రమ కుదేలైంది. పశు పోషకులకు అందాల్సిన రాయితీ పథకాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. అందుబాటులో ఉన్న పథకాలకు కూడా నిధులు విడుదల కాలేదు. పాల ఉత్పత్తి పెంపుతో పాటు పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించేలా తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వైకాపా ప్రభుత్వం నిలిపివేయడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, కొత్తపట్నం


గతంలో అమలు చేసిన పథకాలివీ...

  • తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాల ఉత్పత్తి పెంపునకు ఏటా పశు పోషకులకు పాతర గడ్డి(సైలేజ్‌), దాణాతో పాటు, పలు పథకాలు రాయితీపై అందించారు.
  • ఏటా టన్నుల కొద్ది పాతర గడ్డి బేళ్లను నేరుగా గ్రామాల్లోని పశు పోషకులకు అందజేశారు.
  • 75 శాతం రాయితీపై పాతర గడ్డి కిలో రూ.2కే అప్పట్లో సరఫరా చేశారు.
  • పశు దాణా కూడా 75 శాతం రాయితీపై కిలో రూ.4 చొప్పున సరఫరా చేసేవారు.
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల కింద పశువుల సంరక్షణ షెడ్ల నిమిత్తం గోకులం, మినీ గోకులం నిర్మించారు. 2019 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సదరు పథకాన్ని రద్దు చేయడంతో పాటు, చివరి ఏడాది కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు కూడా వైకాపా నిలిపేసింది.
  • ఉపాధి హామీ నిధులతో ఊరూరా పశుగ్రాసం విస్తారంగా సాగు చేయించారు. అధిక సంఖ్యలో రైతులు దీన్ని వినియోగించుకుని వేసవిలో పశుగ్రాసం కొరత ఉన్న అన్ని ప్రాంతాలకు రాయితీపై పచ్చగడ్డి సరఫరా చేసి ఆదాయం పొందారు.
  • వేసవి సీజన్‌లో పొలాలు వెళ్లిన పశువులకు తాగునీటి సమస్య లేకుండా అందుబాటులో ఉన్న చేతి పంపుల వద్ద నీటి తొట్టెలు నిర్మించారు.

అధికారంలోకి వస్తూనే రద్దు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త వాటి సంగతి అటుంచితే అప్పటికే అమలు చేస్తున్న ఆయా పథకాలను పూర్తిగా ఆపేసింది. నిర్మాణాల ఊసే లేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో రాయితీపై దాణామృతం కిలో రూ.3 చొప్పున పంపిణీ చేయగా, వైకాపా ప్రభుత్వం వచ్చాక దాని ధర రూ.6.50కు పెంచింది.
పెరిగిన పశుగ్రాసం ధరలు...: వేసవి సీజన్‌ రావడంతో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొల్లాల్లో ఎక్కడా పచ్చిగడ్డి అందుబాటులో లేకపోవడంతో పశువులు విలవిల్లాడుతున్నాయి. ప్రభుత్వం రాయితీపై పాతర గడ్డి ఇవ్వని కారణంగా పల్లెల్లో పశు పోషకులు వరిగడ్డే దిక్కైంది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గరిష్ఠంగా ట్రాక్టర్‌ ట్రక్కు రూ.20 వేలు వరకు పలుకుతోంది. ఎండాకాలం పాల దిగుబడి తగ్గడం ద్వారా ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితుల్లో పశుగ్రాసం కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది. మళ్లీ వర్షాకాలం సీజన్‌ వచ్చే వరకు ఆగస్టు, సెప్టెంబర్‌ నెల దాకా గడ్డికి డిమాండ్‌ ఉంటుంది. అయిదేళ్లగా ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు వలన పశు పోషకులకు మరింత భారంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని