logo

జగనా‘సుర’ కుట్రలు

Published : 18 Apr 2024 03:27 IST

మత్తెక్కించేందుకు ముందస్తు వ్యూహాలు
సంపూర్ణ నిషేధమంటూ అప్పట్లో డప్పులు
ఆనక ప్రైవేట్‌ సైన్యం నియామకాలు
నామినేషన్ల ముందు దొరుకుతున్న వైకాపా మద్యం నిల్వలు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే

నమ్మించేందుకు నాటకాలు...: మేం ఎన్నికల్లో గెలిస్తే దశలవారీగా మద్యనిషేధం విధిస్తాం. మద్యాన్ని స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం. మద్య నిసేధం విధించిన తర్వాతే మళ్లీ  ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం..

2019 ఎన్నికలకు ముందు వైకాపా అధినేత జగన్‌ మాటలు

దారి మళ్లిన సగం సరకు...: మద్య నిషేధం సంగతి అటుంచితే ప్రస్తుత ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం పైనే ఆధారపడింది. నూతన విధానంలో భాగంగా అన్ని ప్రభుత్వ దుకాణాల్లో ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యంతో దాదాపు సగానికి పైగా సరకును ఇప్పటికే బ్లాక్‌ చేసిందనే విమర్శలున్నాయి. తాజాగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని మూడు దుకాణాల నుంచే ఏకంగా 240 కేసుల మద్యం పట్టుబడటం, ఇందులో ఆయా దుకాణాల సిబ్బంది ప్రమేయం ఉండటం ఇందుకు నిదర్శనం.

చెప్పినవారినే నియమించుకుని...: జిల్లాలో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఒంగోలు, మార్కాపురం కేంద్రాలుగా రెండు మద్యం డిపోలు ఉన్నాయి. ఒంగోలు డిపో పరిధిలో 77, మార్కాపురం పరిధిలో 101 దుకాణాలున్నాయి. వీటిలో నియమితులైన సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లలో అధికభాగం స్థానిక వైకాపా నాయకుల సిఫారసులు పొందినవారే. వీటి పర్యవేక్షణ బాధ్యత ఎక్సైజ్‌ శాఖకు అప్పగించారు. అప్పటికే సెబ్‌ ఏర్పాటుతో ఎక్సైజ్‌ శాఖలో సిబ్బంది కొరత అధికమైంది. దీంతో ఒక్కొక్క కానిస్టేబుల్‌ పది నుంచి 12 దుకాణాల విక్రయాలను రోజూ పర్యవేక్షించాలి. ఇది వారికి తలకు మించిన భారంగా మారింది.

చోద్యం చూస్తున్న సెబ్‌...: దుకాణాల్లో సిబ్బంది తమ సొంత మనుషులు కావటం, ఎక్సైజ్‌ శాఖ పర్యవేక్షణ కొరవడటంతో పాటు సెబ్‌ సమర్థంగా పనిచేయక పోవడంతో అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దుకాణాల్లో మంచి బ్రాండ్ల మద్యం అక్రమంగా తరలించి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించేవారు. దుకాణాల్లో ఊరూపేరూ తెలియని జే బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే విక్రయించేవారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇష్టారీతిన ప్రభుత్వ దుకాణాల నుంచి అధికార పార్టీ సొంతం చేసుకుంది. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ మరింతగా బరితెగించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కోడ్‌కు ముందే భారీగా మద్యాన్ని పక్కదారి పట్టించింది. అయినా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థ సెబ్‌ చిన్నాచితకా కేసులకే పరిమితమై చోద్యం చూస్తోంది. కొన్నిచోట్ల నెలవారీ మామూళ్లు పొందుతూ తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమైంది.

ముండ్లమూరులో అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం కేసులు

నామినేషన్ల ముందు రోజు పట్టివేత...: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత గతేడాది ఏ తేదీన ఎంత విక్రయించారో అదేస్థాయిలో విక్రయించాలని, మనిషికి ఒక సీసా మాత్రమే అమ్మాలని ఈసీ అదేశాలు జారీ చేసింది. ఇవి అధికార పార్టీకి ఆయాచిత వరంగా మారాయి. ప్రతి దుకాణానికీ రోజుకు 12 నుంచి 15 కేసుల మద్యం కేటాయిస్తున్నా.. ఉదయం 11 గంటలకు తెరిచిన దుకాణాలను తమ విక్రయ పరిమితి దాటిపోయిందంటూ మధ్యాహ్నం ఒంటి గంటలోపే మూసేస్తున్నారు. అదే సమయంలో పెద్దఎత్తున దొడ్డిదారిన తరలిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా దర్శి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నామినేషన్‌కు ఒక్కరోజు ముందు ముండ్లమూరు మండలంలో భారీఎత్తున మద్యం డంప్‌ బయట పడటం, వీటిలో మూడు దుకాణాల సిబ్బంది ప్రమేయం ఉండటం గమనార్హం. పట్టుబడిన మద్యాన్ని పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ సునీల్‌ అక్కడికి వెళ్లారు. అయితే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడాన్ని విస్మరించారు. ఇంత పెద్ద ఎత్తున మద్యాన్ని ఎవరి కోసం కొనుగోలు చేశారనే దిశగా దర్యాప్తు చేయడాన్ని మరిచారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి జిల్లావ్యాప్తంగా గత కొన్నాళ్లుగా మద్యం దుకాణాల బాగోతాలపై లోతుగా విచారణ చేపడితే మరిన్ని మద్యం డంప్‌లు వెలుగుచూస్తాయి.

చీల్చి.. నిర్వీర్యం చేసి

ఎన్నికల తర్వాత ఆబ్కారీ శాఖను రెండుగా చీల్చేశారు. అక్రమ మద్యం, ఇసుక నియంత్రణ పేరిట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌)ను ఏర్పాటు చేశారు. ఎక్సైజ్‌ శాఖను కేవలం మద్యం దుకాణాల నిర్వహణకే పరిమితం చేశారు. అనంతరం సెబ్‌ను పోలీసు శాఖ పర్యవేక్షణలోకి తెచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అందులో సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లుగా తమ ప్రైవేట్‌ సైన్యాన్ని నియమించుకున్నారు.

తనిఖీలంటూ వేధింపులు...

నూతన విధానంలో భాగంగా ఒక వ్యక్తికి కేవలం మూడు సీసాల మద్యం మాత్రమే విక్రయించేలా వైకాపా ప్రభుత్వం చట్టం చేసింది. అంతకుమించి ఒక సీసా దొరికినా అరెస్టు చేసి జైలుకు పంపేలా విధానం రూపొందించింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అర్ధరాత్రీ, అపరాత్రీ అనే తేడా లేకుండా మహిళలను కూడా వదిలి పెట్టకుండా తనిఖీల పేరిట వేధింపులకు గురిచేసింది.

తూట్లు పొడిచి.. అప్పులు చేసి...

మద్య విషేధం విషయంలో తాము పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని నమ్మించిన ప్రభుత్వం.. ఆనక చేతులెత్తేసింది. చివరికి మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు చేసింది. గతంలో రాష్ట్రంలో ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించే మద్యం మూడు సీసాలకు మించి ఉంటే అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వం.. గతేడాది ఏప్రిల్‌లో చట్ట సవరణ చేసింది. తొమ్మిది లీటర్లలోపు మద్యం(సుమారు 50 క్వార్టర్‌ సీసాలు)తో ఎవరైనా పట్టుబడితే స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వొచ్చని పేర్కొంది. ఎన్నికల సమయంలో తమ నియంత్రణలోనే ఉన్న దుకాణాల సిబ్బంది ద్వారా విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు