logo

మూడో అంతస్తు నుంచి పడి కార్మికుడి మృతి

ఓ భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన నిర్మాణ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఖాజాగూడలో జరిగింది. రాయదుర్గం ఎస్‌ఐ సైదులు కథనం ప్రకారం..

Published : 07 Dec 2021 06:07 IST

 

చిరంజీవి (పాతచిత్రం)

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఓ భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన నిర్మాణ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఖాజాగూడలో జరిగింది. రాయదుర్గం ఎస్‌ఐ సైదులు కథనం ప్రకారం.. నందిగాం మండలంలోని అన్నపురం పెద్దవీధికి చెందిన బర్నాన చిరంజీవి(28) నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధికి తన ఇద్దరు అన్నలతో కలిసి నగరానికి వచ్చాడు. ఖాజాగూడలో ఓ భవనం మూడో అంతస్తులో పని చేస్తున్న చిరంజీవి కాలు జారి కిందకు పడిపోయాడు. తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గచ్చిబౌలిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం ఈ విషయం తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, కార్మికులు ఆసుపత్రికి తరలి వచ్చారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని శవ పరీక్షకు తీసుకెళ్లనిచ్చేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా కార్మికులకు భద్రతా ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తేదారులు జహంగీర్‌, వెంకట్‌రావు, భవనం అసోసియేషన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి అన్న బర్నాల రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని