logo

కలెక్టర్‌ చెప్పినా... కాలేదు జమ!

నిర్వాసితులకు, పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీ అందిన ప్రతి ఒక్కరికీ అదనపు పరిహారం జమవుతుంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు రాతపూర్వకంగా తెలియజేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. రూ.216 కోట్లకు రూ.144 కోట్లు చెల్లింపులు జరిగాయి. సొమ్ము జమకాకుంటే తహసీల్దారు కార్యాలయంలో వినతులు అందజేయవచ్చు. రెండు వారాల్లో అదనపు పరిహారం చెల్లింపులు దాదాపు పూర్తి చేస్తాం.

Updated : 01 Aug 2022 04:36 IST

రూ.216 కోట్ల చెల్లింపుల్లో గందరగోళం
ఆందోళనలో వంశధార నిర్వాసితులు


తహసీల్దారు కార్యాలయానికి వచ్చిన నిర్వాసితులు

నిర్వాసితులకు, పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీ అందిన ప్రతి ఒక్కరికీ అదనపు పరిహారం జమవుతుంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు రాతపూర్వకంగా తెలియజేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. రూ.216 కోట్లకు రూ.144 కోట్లు చెల్లింపులు జరిగాయి. సొమ్ము జమకాకుంటే తహసీల్దారు కార్యాలయంలో వినతులు అందజేయవచ్చు. రెండు వారాల్లో అదనపు పరిహారం చెల్లింపులు దాదాపు పూర్తి చేస్తాం.

-కలెక్టరు శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ (జులై 19న హిరమండలంలో నిర్వాసితులతో జరిగిన సమావేశంలో)

జూన్‌ 22 నుంచి అదనపు పరిహారం చెల్లింపుల ప్రక్రియ మొదలైంది. ఎవరెవరికి జమవుతుందో, జమకాని వారికి ఎందుకు కావడంలేదో స్పష్టమైన సమాచారం ఇచ్చేవారే లేరు. జమకాలేదని తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తున్నా పరిష్కారం కావడంలేదు.

- వంశధార నిర్వాసితులు.

- న్యూస్‌టుడే, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట

వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లింపుల్లో గందరగోళం నెలకొంటోంది. ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో నిర్వాసితుల ఖాతాలకు రూ.లక్ష చొప్పున జమ చేస్తుండడంతో స్పష్టమైన సమాచారం తెలియక వారు గందరగోళానికి గురవుతున్నారు. హిరమండలం తహసీల్దారు కార్యాలయంలో తహాసీల్దారు బి.మురళీమోహనరావుతో పాటు కార్యాలయ ఉద్యోగులు, వీఆర్వోలు పది రోజులుగా నిరంతరం సేకరించిన వివరాలు పరిశీలించి కంప్యూటర్లలో నమోదు చేసి కలెక్టరు కార్యాలయానికి నివేదిస్తూనే ఉన్నారు. అయినా నిర్వాసితుల ఖాతాలకు పరిహారం జమ కావడం లేదు. కలెక్టరు స్థాయిలో సమావేశాలు నిర్వహించినా ఫలితం కన్పించడం లేదు.

వరద కాలువ నిర్వాసితులదీ..: వరద కాలువల నిర్మాణంలో సేకరించిన భూముల రైతులదీ ఇదే పరిస్థితి. మొదట ఒక ఆధార్‌ ఒక చెల్లింపు విధానంలో సాఫ్ట్‌వేర్‌ రూపొందించడంతో పీడీఎఫ్‌ ప్యాకేజీ పడిన లబ్ధిదారు రైతుకు సాంకేతికంగా ఇబ్బంది ఎదురైంది. మరికొంతమందికి ఇవ్వాల్సిన సొమ్ముకుంటే అదనంగా పరిహారం చెల్లించేశారు. ఇప్పుడు అవన్నీ సరిచేసే పనిలో యూనిట్‌ కార్యాలయాలు, రెవెన్యూ సిబ్బంది తలమునకలై ఉన్నారు.

ఉద్యోగులు అర్హులైనప్పటికీ: గతంలో పరిహారం పొందిన ప్రతి ఒక్కరూ అదనపు పరిహారం పొందేందుకు అర్హులని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకూ కొంతమందికి జమ చేశారు. తాజాగా మీ దరఖాస్తులు చివరిలో చూస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులవి పక్కన పెట్టేస్తున్నారు. దీంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతవరకు లేదు..: ఈ నెల 21న సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో చెల్లించేందుకు కలెక్టరు కార్యాలయం నుంచి పంపిన బిల్లులు పీడీఎఫ్‌ ప్యాకేజీలు రూ.5.88 కోట్లు, భూములకు చెందిన రూ.15.88 కోట్లు బిల్లులు. ఈ నెల 19న రూ.25 కోట్లు, 20న రూ.5 కోట్లు నిర్వాసితుల ఖాతాలకు జమ చేస్తామని కలెక్టరు తెలిపారు. అయినా ఇంతవరకు కాలేదు.

ఇవీ వివరాలు
అర్హులైన నిర్వాసితులు: 27,662 మంది.

జమైంది: 14,634 మంది ఖాతాలకు రూ.144 కోట్లు

చెల్లించాల్సింది: 13,028 మంది ఖాతాలకు రూ.72.18 కోట్లు


దరఖాస్తులు ఏమవుతున్నాయో..

గత నెల 22న అదనపు పరిహారం మంజూరుకు గ్రామానికి వచ్చిన అధికారులకు నేను దరఖాస్తు అందజేశాను. ఆ తర్వాత కూడా మరో రెండుసార్లు దరఖాస్తులు ఇచ్చాను. గార్లపాడు గ్రామంలో పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీలతో పాటు భూములు నష్టపోయిన దాదాపు 600 మందికి ఇంకా అదనపు పరిహారం అందలేదు. ఇచ్చిన దరఖాస్తులు ఏమవుతున్నాయో తెలియడం లేదు.

- బూరి వెంకటేష్‌, గార్లపాడు, వంశధార నిర్వాసితుడు


అభ్యంతరాలు తెలియజేస్తున్నాం...

పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీలకు సంబంధించి వీఆర్వోల ద్వారా సేకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేశాం. భూముల పరిహారం భూసేకరణ కార్యాలయ ఉద్యోగులు చూస్తున్నారు. అక్విటెన్స్‌లో పేరు ఉన్నవారికి తప్పనిసరిగా పరిహారం అందుతుంది. కలెక్టరు కార్యాలయం నుంచి అందిన రిమార్కుల జాబితాలు వీఆర్వోల ద్వారా అందజేసి సరిచేస్తున్నాం. ఉద్యోగులు, సగం ప్యాకేజీ వారి సమస్య కలెక్టరు దృష్టిలో ఉంది. 

- బి.మురళీమోహనరావు, తహసీల్దారు, హిరమండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు