logo
Published : 06 Aug 2022 04:06 IST

అక్కడికెళ్తే సహనానికి పరీక్షే..!

టెక్కలి సబ్‌రిజిస్ట్రారు కార్యాలయాన్ని వేధిస్తున్న సమస్యలు

వినియోగదారులకు తప్పని అవస్థలు

న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

సంతబొమ్మాళి మండలం భావనపాడుకు చెందిన ఓ మహిళ నాన్‌జ్యుడీషియల్‌ స్టాంపు కొనుగోలుకు కార్యాలయానికి శుక్రవారం వస్తే నెట్‌వర్క్‌ సమస్యతో స్టాంపు ఇవ్వలేదు. దీంతో రూ.20 విలువైన స్టాంపును బయట మార్కెట్లో రూ.40కు కొనుగోలు చేసినట్లు ఆమె వాపోయారు.

 టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రింటర్‌ ఇంక్‌ అయిపోయిందని ఇటీవల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.

...ఇలా ఒక్కటేమిటి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అక్కడి పనులపై వచ్చేవారికి స్టాంపు నుంచి సర్వరు కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి.  దీంతో విసిగిపోతున్న కొందరు కోటబొమ్మాళి, పలాస కార్యాలయాలకు వెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారు.

స్టాంపుల కోసం వెళితే..

ఏ లావాదేవీకైనా ప్రాథమికంగా నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులతోనే పని ప్రారంభమవుతుంది. అందులోను కనీస ముఖవిలువ రూ.50, రూ.100లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటుంది. అయితే టెక్కలిలో స్టాంపుల కొరత నిరంతరం ఉంటోంది. బహిరంగ మార్కెట్లో బ్లాక్‌ ధరలలో దొరికే స్టాంపులు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయంలో మాత్రం నెలల తరబడి అందుబాటులో ఉండవు. స్టాంపులు అమ్మితే వచ్చే అదనపు ఆదాయమేదీ ఉండకపోవడంతో వాటిపై ద]ృష్టిపెట్టేందుకు సిబ్బంది ఇష్టపడటం లేదన్న  విమర్శలు వినిపిస్తున్నాయి.

అడుగడుగునా అడ్డంకులే..

టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలు వింటే ఎవరైనా విస్తుపోతారు. విద్యుత్తు కోతతో కార్యాలయంలో పనులు నిలిచిపోతాయి. ఏమని అడిగితే తహసీల్దార్‌ కార్యాలయానికి, తమ కార్యాలయానికి కలిపి ఇన్‌వర్టర్‌ ఉన్నందున విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని చెబుతారు. రెండోది సర్వర్‌ సమస్య. ఇది రోజులో ఏ సమయంలో పని చేస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఒక్కో రిజిస్ట్రేషన్‌ కోసం రెండు, మూడురోజులు తిరగాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమిస్తే చివరికి ప్రింటర్‌, స్కానర్‌లలో ఏదో ఒకటి పనిచేయని సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ప్రింటర్‌ సమస్యతో వారం రోజులు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చిన్న, చిన్న సమస్యలకు సేవలు నిలిచిపోతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పని ముగించుకు వెళ్లిపోదామనుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి..

స్థానికంగా ఉన్న సమస్యలను జిల్లా రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఇక్కడ కొద్ది రోజులుగా రూ.50, రూ.100 స్టాంపుల్లేవు. బయట మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించాం. నెట్‌వర్క్‌ సమస్యతో పనుల్లో ఆలస్యం జరుగుతోంది. సమస్యలన్నీ అధిగమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

- బాలామణి, ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌, టెక్కలి

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని