logo

స్వాతంత్య్రమే లక్ష్యం.. పోరాటంలో మనం

జాతి సంపదను దోచుకుపోతున్న తెల్లోళ్లను తరిమేందుకు.. బానిస సంకెళ్ల నుంచి భావితరాలకు విముక్తి కోసం... స్వరాజ్య సాధనే ధ్యేయంగా... ధన, ప్రాణాలను  క్కచేయక.. బ్రిటిష్‌ దొరల చిత్రహింసలకు అదరక, బెదరక.. జైల్లోనే ఓనమాలు దిద్ది.. పోరాట పాఠాలు నేర్చుకుని... తెల్లవాడి తూటాలకు ఎదురొడ్డారు.. ప్రాణత్యాగాలు చేశారు.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం, స్వేచ్ఛ వెనుక సిక్కోలు ప్రముఖులెందరో ఉన్నారు. ఆజాదీ

Published : 10 Aug 2022 04:08 IST

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

జాతి సంపదను దోచుకుపోతున్న తెల్లోళ్లను తరిమేందుకు..

బానిస సంకెళ్ల నుంచి భావితరాలకు విముక్తి కోసం...

స్వరాజ్య సాధనే ధ్యేయంగా...

ధన, ప్రాణాలను లెక్కచేయక..

బ్రిటిష్‌ దొరల చిత్రహింసలకు అదరక, బెదరక..

జైల్లోనే ఓనమాలు దిద్ది.. పోరాట పాఠాలు నేర్చుకుని...

తెల్లవాడి తూటాలకు ఎదురొడ్డారు..

ప్రాణత్యాగాలు చేశారు..

నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం, స్వేచ్ఛ వెనుక సిక్కోలు ప్రముఖులెందరో ఉన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాన వారందరికీ వందనాలు...

షేర్‌ మహ్మద్‌పురంలో కిసాన్‌ కాంగ్రెస్‌ మహాసభలో పాల్గొన్న నాయకులు

స్వాతంత్య్ర సాధనకు ముందు జిల్లాలో జరిగిన ఉద్యమాన్ని మూడు దశలుగా చరిత్రకారులు అభివర్ణించారు. గాంధీ మహాత్ముడు 1927లో జిల్లాను సందర్శించారు. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకూ పర్యటించి ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి రగిలించారు. అక్కడి నుంచి జాతీయోద్యమం ఊపందుకుంది. 1936-40 మధ్య కాలాన్ని రెండో దశగా పరిగణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 1940-47 మధ్యకాలంలో ముఖ్యంగా 1942 ఆగస్టులో ఉద్యమంలో సామూహిక సత్యాగ్రహంలో జిల్లా వీరయోధులు, దేశభక్తులు వందమందికి పైగా జైళ్లకు వెళ్లారు. కొన్నివేల మంది ఉద్యమాగ్నికి ఆజ్యం పోశారు.

పలాసలో కిసాన్‌ సభలు

ఉద్యమంలో భాగంగా 1940 మార్చి 26 నుంచి 30 వరకు ఆల్‌ ఇండియా కిసాన్‌ మహాసభలు పలాసలో జరిగాయి. దీనికి శ్యామసుందరం అధ్యక్షులు కాగా జనరల్‌ సెక్రటరీ గౌతు లచ్చన్న, జాయింట్ సెక్రటరీ జొన్నలగడ్డ రామలింగయ్య వ్యవహరించారు. పలాస రైల్వేస్టేషన్‌కు అతి దగ్గరలో ఏర్పాటు చేసిన సభకు విద్యుత్తు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. క్షణాల్లో పెట్రోమాక్సు, గ్యాస్‌ లైట్లు వచ్చి పడ్డాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, బిహార్‌, రాజస్థాన్‌, ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన ప్రతినిధులు, రైతులతో పలాస నిండిపోయింది. దాదాపు 1.5 లక్షల మంది హాజరైనట్లు అంచనా.

ఉద్దానంలో ఉదయించిన సర్దార్‌

దేశంలో వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ తర్వాత సర్దార్‌ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న. వి.వి.గిరి, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. తన 21వ ఏట గాంధీజీ పిలుపుతో విద్యకు స్వస్తిపలికి ఉద్యమంలోకి దూకారు. 1930లో ఉప్పు సత్యాగ్రహానికి ప్రభావితుడైన లచ్చన్న బారువ వద్ద ఉప్పు తయారు చేసి ఆ డబ్బుతో ఉద్యమం నడిపారు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులు అగ్నికి ఆహుతి చేశారు. ఈ సమయంలో ఆయన్ను అరెస్టు చేసి టెక్కలి, నరసన్నపేట సబ్‌ జైళ్లలో 40 రోజులు ఉంచారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను బంధించి రాజమహేంద్రవరం జైల్లో ఐదు నెలలు ఉంచారు. బయటకొచ్చి రాజకీయాలు, సంఘ సంస్కరణలకు నడుం బిగించారు. అంటరానితనంపై కత్తి ఝుళిపించారు. ఆయన నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజల్లోకి వెళ్లాయి.  

\శాసన ఉల్లంఘనకు పాల్పడ్డారని సర్దార్‌ గౌతు లచ్చన్నను అరెస్టుచేస్తున్న పోలీసులు

పట్టిస్తే రూ.10 వేల బహుమతి..

స్వాతంత్రోద్యమంలో చివరిదిగా చెప్పుకొనే క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఈ సమయంలో లచ్చన్నను అతి ప్రమాదకరమైన, ప్రభావిత గల వ్యక్తిగా భావించిన నాటి ప్రభుత్వం ఆయన్ను పట్టిస్తే రూ.10 వేలు బహుమతి ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతన్ని బంధించి మూడేళ్లు జైల్లో ఉంచి 1945 అక్టోబరులో విడిచిపెట్టింది. అప్పటి నుంచి ఆంధ్రాలో లచ్చన్న అగ్రనాయకుల్లో ఒకరుగా
నిలిచారు.

పరాయి పెత్తనంపై పుల్లెల గర్జన

అపార సంపదను తృణప్రాయంగా వదులుకుని, తెల్లదొరల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు పోరాడి, చిరుప్రాయంలోనే కన్నుమూసిన మహనీయుడు పుల్లెల శ్యామసుందరరావు. ఈయనిది ఇచ్ఛాపురం. నాడు బ్రిటీష్‌దొరలను గడగడలాడించి ఫైర్‌ ది గ్రేడ్‌ అనిపించుకున్నారు. విద్యార్థి దశలోనే 1921లో మహాత్ముడు నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఉద్యమబాట పట్టారు. ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో రైతు ఉద్యమానికి కళింగసీమ నుంచి నాయకత్వం వహించారు. తొలుత తన భూములనే రైతుపరం చేసి ఆదర్శంగా నిలిచారు. 1930లో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం,  శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు.. పుల్లెల పోరాటస్పూర్తిని మెచ్చుకున్న గాంధీ ఇచ్ఛాపురంలో ఆరుగంటల పాటు గడిపి, స్వాతంత్రోద్యమ ప్రసంగాన్ని చేశారు. ఈ ఘట్టం ప్రస్తుత దాసన్నపేటలో జరిగింది.

నిద్రలేపి మరీ అరెస్టులు..

*  1921లో ఆంధ్ర కాంగ్రెస్‌ మహాసభలు బరంపురంలో గంపలగూడెం జమిందార్‌ అధ్యక్షతన జరిగాయి. తిరుగు ప్రయాణంలో జమిందార్‌ ఉండగా శ్రీకాకుళం-దూసి రైల్వేస్టేషన్ల మధ్య నిద్రలేపి పోలీసులు అరెస్టులు చేశారు.

* 1923లో కళింగపట్నంలో కప్పగంతుల రామయ్యపంతులు అధ్యక్షతన జిల్లా రాజకీయ సభ జరిగింది.

* 1930లో గాంధీ పిలుపు మేరకు  నౌపడాలో నాయకులు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం విజయవంతమైంది. ఇదే సమయంలో గాంధీజీ నౌపడా రైల్వేస్టేషన్‌లో ఉద్యమకారులతో మాట్లాడారు.

జాతీయోద్యమంలో జిల్లా ప్రముఖులు

గాంధీజీ సిక్కోలు పర్యటన తర్వాత విదేశీ వస్త్ర దహనం, ఖద్దరు వినియోగం, కల్లు దుకాణాల పికెటింగ్‌, అంటరానితనానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1920లో బరంపురం, నరసన్నపేట కేంద్రాలుగా రాష్ట్ర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జాతీయోద్యమాలు నిర్వహించారు. నరసన్నపేటలో పొట్నూరు స్వామిబాబు అండతో సమరయోధులు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. నాడు విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించి ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. వారిలో టెక్కలికి చెందిన అట్టాడ కృష్ణమూర్తి, శ్రీకాకుళానికి చెందిన పూడిపెద్ది వెంకటరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు