logo

ఉద్దానంలో పడకేసిన వైద్యం

కంచిలి మండలం జె.నారాయణపురం గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవానికి సోంపేట సామాజిక ఆసుపత్రిని సంప్రదించగా సంబంధిత వైద్యులు లేరని చెప్పారు. దీంతో పేదవర్గానికి చెందిన సంబంధిత మహిళ రూ.35 వేలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంది. ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో ఇదిగో ఇలా ప్రసూతిని ఇలా సాధారణ వార్డుగా మార్చేశారు.

Published : 13 Aug 2022 03:32 IST

వైద్యుల కొరతతో నామమాత్ర సేవలు

న్యూస్‌టుడే, సోంపేట

కంచిలి మండలం జె.నారాయణపురం గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవానికి సోంపేట సామాజిక ఆసుపత్రిని సంప్రదించగా సంబంధిత వైద్యులు లేరని చెప్పారు. దీంతో పేదవర్గానికి చెందిన సంబంధిత మహిళ రూ.35 వేలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంది. ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో ఇదిగో ఇలా ప్రసూతిని ఇలా సాధారణ వార్డుగా మార్చేశారు.

ఉద్దానం మండలాల పెద్దాసుపత్రుల్లో పేదలవైద్యం పడకేసింది. ఆరుగురు వైద్యులుండాల్సిన చోట ఒకరిద్దరే ఉండడంతో నామమాత్ర సేవలకే పరిమితమవుతున్నారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర వైద్యానికి శ్రీకాకుళం, బ్రహ్మపుర వెళ్లాల్సిన పరిస్థితితో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ రోగులకు ప్రాథమికవైద్యమూ అందని పరిస్థితి నెలకొంది. వారు శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.

సోంపేటలో ఆరుగురికి ఒక్కరే..

సోంపేట సామాజిక ఆసుపత్రిలో నెలకు సగటున 75 వరకు ప్రసవాలు జరిగేవి. ఇద్దరు గైనకాలజిస్టుల్లో ఒకరు స్వచ్ఛంద విరమణ చేయగా, మరొకరికి బదిలీ అయ్యారు. దీంతో ప్రసవాలు నిలిచిపోయాయి. ఆరుగురు వైద్యులకు చిన్నపిల్లల వైద్యుడు ఒక్కరే మిగిలారు. ఇచ్ఛాపురం నుంచి మందస మండలం మదనాపురం వరకు జాతీయ రహదారిపై ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా ఐదు మండలాల్లో ఎక్కడ పాముకాట్లు సంభవించినా బాధితులు ఇక్కడకే వస్తుంటారు. ప్రస్తుతం ఒక్కరే వైద్యుడు ఉండడంతో రోజువారీ రోగులను చూసేందుకు సమయం చాలకపోగా చిన్న, చిన్న ప్రమాదాలకు సైతం శ్రీకాకుళం పంపించాల్సిన పరిస్థితి ఉంది.

ఇచ్ఛాపురంలో మరో ముగ్గురు అవసరం..:

సుమారు 80 గ్రామాలకు ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రే దిక్కు. రూ.3.50 కోట్లతో ఆధునాతన భవనాన్ని నిర్మించినా.. ఆరుగురు వైద్యులకు ముగ్గురే ఉన్నారు. వీరిలో ఒక్కరే రెగ్యులర్‌. ఆయన చర్మవ్యాధి నిపుణులైనా సాధారణ సేవలూ అందిస్తున్నారు. అర్థోపెడిక్‌, ప్రసూతి వైద్యనిపుణులు ఒప్పంద తరహాలో సేవలందిస్తున్నారు. రోజుకు సుమారు 200 మంది వస్తుంటారు. కనీసం ఒక సర్జన్‌, ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులను తాత్కాలికంగా అయినా నియమించాలి.

హరిపురంలో కిడ్నీ రోగుల ఇక్కట్లు..:

మందస మండలం హరిపురం సామాజిక ఆసుపత్రిలో ఏడుగురు వైద్యులకు ఇద్దరు సెలవులో ఉన్నారు. దంతవైద్యం వారానికి మూడు రోజులకే పరిమితం కాగా సూపరింటెండెంట్‌ ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. ఇక్కడ కిడ్నీరోగులు ఎక్కువగా వస్తుంటారు. వైద్యులు  లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు.

బారువలో సిబ్బందే దిక్కు..

బారువ సామాజిక ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడు, గైనకాలజిస్టు ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరు అందుబాటులో ఉంటారో తెలియదు. ఈ ఆసుపత్రికి హెడ్‌నర్సు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది మాత్రమే దిక్కుగా మారారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందకపోవడంతో బారువ మేజర్‌ పంచాయితీతో పాటు తీరప్రాంత గ్రామాల రోగులు సంచివైద్యులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.


ఇప్పటి వరకు ఒకే డాక్టర్‌తో నడిచిన కవిటి సామాజిక ఆసుపత్రిలో ఇటీవల ముగ్గురు వైద్యులను నియమించారు. అందులో ఒకరు డెప్యుటేషన్‌. ఉద్దానానికి కీలకమైన ఈ ఆసుపత్రి వైద్యుల కొరతతో పీహెచ్‌సీ స్థాయి సేవలు కూడా అందించలేకపోతోంది. ప్రసూతి, చిన్నపిల్లల వైద్యుల పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంలేదు. డయాలసిస్‌కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న కిడ్నీరోగులను చిత్రంలో చూడవచ్చు.


నియామకానికి ప్రయత్నం... సోంపేట సామాజిక ఆసుపత్రితో పాటు ఇతర చోట్ల ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయమై కలెక్టర్‌, వైద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం. కొందరిని నియమించినా వారు విధుల్లో చేరకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తాం.

- పిరియా విజయ, జడ్పీ అధ్యక్షురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని