logo

ఆశలు జలసమాధి..!

జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నీటమునిగి ఇద్దరు మృతి చెందగా.. ఓ బాలుడు గల్లంతయ్యాడు. బలవన్మరణానికి పాల్పడి ఒకరు ప్రాణాలు విడించారు.

Published : 30 Sep 2022 06:32 IST

జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నీటమునిగి ఇద్దరు మృతి చెందగా.. ఓ బాలుడు గల్లంతయ్యాడు. బలవన్మరణానికి పాల్పడి ఒకరు ప్రాణాలు విడించారు. వారిపై కుటుంబసభ్యులను పెట్టుకున్న ఆశలను జలసమాధి చేశారు.


ఒకే పంచాయతీలో ఇద్దరి మృత్యువాత

పొందూరు, న్యూస్‌టుడే: పొందూరు మేజరు పంచాయతీ పరిధిలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు పంచాయతీ లక్ష్మీపేట గ్రామానికి చెందిన మొకర సాయి(34) ఆటోపై పాత ఇనుప సామాన్లు సేకరించే వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి అతడు కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. గురువారం ఉదయం గ్రామానికి సమీపంలోని చెరువులో ఆయన మృతదేహాన్ని వారు గుర్తించారు. సాయికి¨ భార్య సిమ్మన్న, కుమారుడు శ్యామలరావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బహిర్భూమికి చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోవడంతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
చెత్త వేసేందుకు వెళ్లి.. మేజరు పంచాయతీ విజయభారతి కాలనీకి చెందిన అనకాపల్లి రాము (36) ఇంటికి సమీపంలోని బావిలో కాలుజారి పడి మృతి చెందాడు. బావిలో చెత్త వేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయినట్లు కాలనీ వాసులు తెలిపారు. గురువారం మృతదేహాన్ని బయటకు తీశారు. భవన నిర్మాణ కార్మికుడైన రామకు భార్య భాగ్యం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్సై ఎన్‌.లక్ష్మణరావు సిబ్బందితో వెళ్లి శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టానికి శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు.


వంశధార నదిలో విద్యార్థి గల్లంతు

గార, న్యూస్‌టుడే: దసరా సెలవులకు తాతగారింటికి వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తూ వంశధార నదిలో పడి గల్లంతైన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గార మండల కేంద్రానికి సమీపంలో వంశధార నదిలో విశాఖపట్నం కొత్త గాజువాక హైస్కూలు రోడ్డు ప్రాంతానికి చెందిన టోకూరు కార్తీక్‌ (9) గురువారం గల్లంతైయ్యాడు. తల్లి లక్ష్మి, అక్క లోకితతో కలిసి గార మండలం తూలుగు పంచాయతీ కొయ్యానపేటలోని తాతగారింటింకి రెండు రోజుల కిందట వచ్చారు. భవానీ దీక్షలో ఉన్న చిన్నాన్న దేవరాజ్‌ వ్యాను శుభ్రం చేసుకునేందుకు గురువారం నది వద్దకు వెళ్తుండగా కార్తిక్‌, లోకిత, దేవరాజ్‌ ఇద్దరు పిల్లలు వెళ్లారు. దేవరాజ్‌ వాహనం కడుగుతుండగా కార్తీక్‌ నదిలోకి దిగాడు. ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులు, గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు. సాయంత్రం వరకు కార్తీక్‌ ఆచూకీ లభ్యం కాలేదు. కార్తీక్‌ తండ్రి లారీ క్లీనరుగా పనిచేస్తున్నారు. ఆయన చరవాణి స్పందించకపోవడం సాయంత్రం వరకు ఈ విషయం ఆయనకు చేరలేదు. ఎస్‌ఐ మధుసూదనరావు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం

లావేరు, న్యూస్‌టుడే: ఆర్థిక బాధలు తాళలేక పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే మందు ద్రావణం తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లావేరు మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుడుమూరు పంచాయతీ బొంతువలసకి చెందిన బాస జగదీశ్వరరావు(32) స్థానికంగా ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతమేర అప్పులు చేశారు. తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌ తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతిచెందాడు. ఇతనికి భార్య, ఐదేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మేరకు లావేరు ఏఎస్‌ఐ కె.భుజంగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని