logo

తవ్వేసి తరలించేసి!

అక్రమార్కులు ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని కొండలను తవ్వేసి కంకరను యథేచ్ఛగా తరలిస్తున్నారు.

Published : 28 Nov 2022 04:10 IST

కరిగిపోతున్న కొండలు
పట్టని అధికారులు

గాజులకొల్లివలసలోని ఈ కొండ నుంచే కంకర తవ్వేస్తున్నారు..

ఆమదాలవలస గ్రామీణం, సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: అక్రమార్కులు ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని కొండలను తవ్వేసి కంకరను యథేచ్ఛగా తరలిస్తున్నారు.. అయినా రెవెన్యూ, పంచాయతీ, సచివాలయాల అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.. పెద్దఎత్తున కంకర నిత్యం తరలిపోతున్నా.. ప్రభుత్వాదాయానికి గండి పడుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక నాయకుల అండదండలతోనే ఈ అక్రమార్కుల దందా కొనసాగుతోంది.

దొరికితే వదలరు..:

ఆమదాలవలస మండలం సైలాడ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్‌ 183లో సంగమేశ్వరస్వామి కొండ 230 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ కొండ సైలాడ, దివంజిపేట, జగ్గుశాస్త్రులపేట, గాజులకొల్లివలస, చిట్టివలస ప్రాంతాల వరకూ ఉంది. జగ్గుశాస్త్రులపేట, చిట్టివలస వద్ద ఎర్ర కంకరను గుత్తేదారులు అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ కొండ గాజులకొల్లివలస జగనన్న కాలనీ వెనుక భాగంలో ఉండటం, కాలనీకి నేరుగా సీసీరోడ్డును అధికారులు నిర్మించడంతో నేరుగా కొండ వద్దకు జేసీబీలతో వెళ్లి తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దపాలెం పంచాయతీలోని దంతవరపుకోట కొండ సరుబుజ్జిలి పంచాయతీ నందికొండ కాలనీ పరిధి రిజర్వు ఫారెస్టులో ఉంది. అటవీశాఖ అధికారుల అనుమతులు లేకుండా ఇక్కడి నుంచి కూడా పెద్దఎత్తున కంకరను గుత్తేదారులు ఇష్టానుసారంగా తొలిచేసి ట్రాక్టర్లతో తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.


చిట్టివలస ఎర్రకొండ నుంచి కంకర తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్‌

మంచి గిరాకీ: ప్రస్తుతం రహదారులు, జగనన్న ఇళ్లు, ఇతరుల సొంత ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఈ కంకరకు మంచి గిరాకీ ఉంది. దీంతో గుత్తేదారులు ఇదే అదనుగా ఈ కొండలను తొలిచేసి రోజూ సుమారు 60 నుంచి 80 ట్రాక్టర్ల వరకూ తరలిస్తున్నారు. తరలించే దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ లోడు విలువ రూ.1,500 నుంచి రూ.2,000 వరకూ పలుకుతోంది. దీంతో కొందరు అక్రమార్కులు కొండలను తొలిచి కంకరని తరలిస్తున్నారు. తవ్వకాలను నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు.

చర్యలు చేపడతాం: కొండలను తవ్వి ఎర్రకంకరను తరలిస్తున్న వారిపై చర్యలు చేపడతాం. వీటి తవ్వకాలకు ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు. అక్రమంగా కొండలను తవ్వేస్తున్న ప్రాంతాల్లో పరిశీలిస్తాం. ట్రాక్టర్లను పట్టుకొని సీజ్‌ చేస్తాం.

వై.వి.పద్మావతి, బి.రమేష్‌కుమార్‌, ఆమదాలవలస, సరుబుజ్జిలి తహసీల్దార్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని