logo

ఆటలకేది ప్రోత్సాహం..?

ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది.

Published : 29 Mar 2024 04:52 IST

శిక్షణ శిబిరాలు నిర్వహించని వైనం
అంబేడ్కర్‌ వర్సిటీ పరిధిలో క్రీడాకారులకు అన్యాయం

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో వ్యాయామ విద్య విభాగం

ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు
 తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే ఆటలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది.  

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల, శ్రీకాకుళం అర్బన్‌

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విశ్వవిద్యాలయ స్థాయిలో స్పోర్ట్స్‌ బోర్డు మీటింగ్‌ నిర్వహించాలి. ఏయే క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు? సౌత్‌ జోన్‌, అఖిల భారత అంతర్‌ వర్సిటీ క్రీడా పోటీలకు ఎవరిని పంపాలి? వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, శిక్షణ ఎంత ఖర్చు చేయాలనే అంశాలపై చర్చించాలి. ఒక నిర్ణయానికి వచ్చి క్రీడా ప్రణాళిక రూపొందించాలి. ఈ సమాచారం అన్ని కళాశాలలకు తెలియజేసి క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలి. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల నుంచి వర్సిటీ స్థాయిలో స్పోర్ట్స్‌ బోర్డు సమావేశాలు జరగడం లేదని, క్రీడా క్యాలెండర్‌ రూపొందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అనుబంధ కళాశాల విద్యార్థులకు అంతర్‌ కళాశాలల పోటీలు నిర్వహించి ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. వర్సిటీలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సౌత్‌ జోన్‌ పోటీలకు వెళ్లే రెండు మూడు రోజుల ముందు ఎంపికలు నిర్వహించి విద్యార్థులకు పోటీలకు పంపుతున్నారు. ఆయా పోటీల సమాచారం ఆసక్తి గల క్రీడాకారులకు సకాలంలో తెలియక, సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్నారు.  

ఇదీ పరిస్థితి

వర్సిటీ పోటీల్లో ఆడటానికి క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. బెల్గావి వీటీయూ ఆధ్వర్యంలో పీఈఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మాండ్యాలో డిసెంబరు 22 నుంచి 25 వరకు సౌత్‌జోన్‌ వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ముందస్తుగా జట్టు ఎంపికలు చేపట్టకపోవడం, క్రీడాకారులకు వేదిక సమాచారం అందించకపోవడంతో మాండ్యాకు వెళ్లాల్సిన క్రీడాకారులు బెల్గావికి చేరుకున్నారు. తిరిగి వేదిక వద్దకు వచ్చేసరికి వీరి ఆట ముగిసి ప్రత్యర్థులు జట్టుకు క్రాస్‌ చేసి విజేతలుగా ప్రకటించారు. దీంతో క్రీడాకారులు ఆడకుండానే వెనుదిరిగారు.

  • కబడ్డీ, యోగా, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు మహిళలు, పురుషులను బాక్సింగ్‌, హాకీ, క్రికెట్‌ సౌత్‌ జోన్‌ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపిక చేసి పంపారు. బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా చాటి అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపికయ్యారు.
  • ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, చెస్‌, ఫుట్‌బాల్‌, కరాటే, తైక్వాండో, వుషూ, ఖోఖో తదితర క్రీడల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు అత్యధికంగా ఉన్నారు. ఈ ఏడాది అంతర్‌ వర్సిటీ పోటీలకు క్రీడాకారులను పంపే ప్రయత్నం జరగలేదు.
  • తమిళనాడులో అన్నా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 25 వరకు జరిగిన బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేయకపోవడంతో పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయామని అనుబంధ కశాశాలలకు చెందిన క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పోటీల్లో పాల్గొన్నా ధ్రువపత్రాలు కళాశాలలకు పంపుతామని వర్సిటీ అధికారులు, శిక్షకులు చెప్పినా రాలేదని వాపోతున్నారు.

సమస్య తలెత్తకుండా చర్యలు..

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్పోర్ట్స్‌ బోర్డు సమావేశం నిర్వహించి క్యాలెండర్‌ రూపొందిస్తాం. క్రీడల సమాచారం అన్ని అనుబంధ కళాశాలలకు తెలియజేస్తాం. విశ్వవిద్యాలయ స్థాయిలో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలిసేలా పర్యవేక్షిస్తాం. అంతర్‌ వర్సిటీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఇబ్బంది పడుకుండా రూ. 8 లక్షలు విడదల చేశాం.  

యు.కావ్య జోత్స్న, స్పోర్ట్స్‌ డీన్‌, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని