logo

ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!

వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు.

Published : 29 Mar 2024 04:58 IST

మిర్తిబట్టి పనులు గాలికొదిలేసిన పాలకులు

డీసీసీబీ కాలనీలో అసంపూర్తిగా నిలిచిన మిర్తిబట్టి పనులు

వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతో పూర్తి చేసేందుకు గుత్తేదారులు సైతం ఆసక్తి చూపడం లేదు. ఇందుకు జిల్లా కేంద్రంలో చేపట్టిన మిర్తిబట్టి ఆధునికీకరణ పనులే నిదర్శనం.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం: శ్రీకాకుళం నగరంలో కొత్త వంతెన రహదారి నుంచి పొన్నాడ వంతెన వద్ద నాగావళి నది వరకు సుమారు 10 కి.మీ. మేర మిర్తిబట్టి విస్తరించి ఉంది. ఒకప్పుడు విశాలంగా ఉండే ఈ పంట కాలువ చుట్టూ కాలనీలు ఏర్పడటంతో పలుచోట్ల ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. కాలువలో పూడిక, వ్యర్థాలతో పేరుకుపోవటంతో తెదేపా హయాంలో అమృత్‌ పథకంలో భాగంగా రూ.40.20 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఆ మేరకు పనులు ప్రారంభించారు. కాలువ పనులు పూర్తయ్యాక మురుగునీరు నేరుగా నదిలో కలవకుండా పొన్నాడ కొండ వద్ద శుద్ధి కేంద్రానికి అనుసంధానించాలని భావించారు. 2019 ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు పడకేశాయి.

అందని బిల్లులు.. ఆగిన పనులు..

ఇప్పటివరకు గుత్తేదారు రూ.5 కోట్ల మేర పనులు చేపట్టగా.. తెదేపా హయాంలో రూ.2.50 కోట్లు చెల్లించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బకాయిలు సైతం చెల్లించలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. అయిదేళ్ల పాటు మిర్తిబట్టి ఆధునికీకరణను పట్టించుకోకపోవడంతో విశాఖ ఎ, బి కాలనీలు, మహాలక్ష్మీ నగర్‌ కాలనీ, కత్తెరవీధి, వంశధార నగర్‌, కొన్నావీధి, తిలక్‌ నగర్‌, రామలక్ష్మణ కూడలి, పెద్దపాడు రహదారి, రామ్‌నగర్‌, ఫ్రెండ్స్‌ కాలనీ, శ్రీలక్ష్మీనగర్‌, అరసవల్లి మిల్లు కూడలి, డీసీసీబీ కాలనీ, సానా వీధి, శ్రీనివాస నగర్‌, బాకర్‌సాహెబ్‌ పేట, బ్యాంకర్స్‌ కాలనీ వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.

ఎదురైన ఇబ్బందులివీ..

  • ఆధునికీకరణ చేపట్టకపోవడంతో కాలువ వ్యర్థాలతో నిండి నీటి తరలింపు సామర్థ్యం కోల్పోతోంది.
  • వర్షాకాలంలో నీరు నిలిచిపోతుండటంతో మిర్తిబట్టిని ఆనుకుని పలు కాలనీలు ముంపు బారినపడుతున్నాయి. గతంలో తిత్లీ, జల్‌, లైలా తదితర తుపాన్ల సమయంలోనూ ఆ కాలనీలు జలమయమయ్యాయి.
  • నగరపాలక సంస్థ ఏటా రూ.లక్షలు వెచ్చించి పూడికతీత పనులు తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టాల్సి వస్తోంది.
  • అసంపూర్తిగా నిలిచిన సీసీ కాలువలో మురుగునీరు నిల్వ ఉండి స్థానికులు దుర్వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం..

మిర్తిబట్టి ఆధునికీకరణకు సంబంధించి గతంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పనులను పునరుద్ధరించాలని ఉన్నతాధికారులకు పలుమార్లు నివేదికలు పంపించాం. వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

పి.సుగుణాకరరావు, ప్రజారోగ్యశాఖ,శ్రీకాకుళం నగపాలక సంస్థ ఇన్‌ఛార్జి, ఈఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని