logo

హామీల సంగతేంటి జగనన్నా..?

అంగన్‌వాడీ కార్యకర్తలు సమస్యలతో సతమతమవుతున్నారు. 42 రోజుల పాటు సమ్మె చేసినా ప్రభుత్వం డిమాండ్లను నేటికీ నెరవేర్చలేదు.

Updated : 06 Apr 2024 05:07 IST

అంగన్‌వాడీలపై మరింత పనిభారం
సమస్యలు పట్టించుకోలేదేని ఆవేదన

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన  కుటుంబ సర్వే ఆప్షన్‌

అంగన్‌వాడీ కార్యకర్తలు సమస్యలతో సతమతమవుతున్నారు. 42 రోజుల పాటు సమ్మె చేసినా ప్రభుత్వం డిమాండ్లను నేటికీ నెరవేర్చలేదు. న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఇప్పటికీ పని భారం తగ్గించలేదని.. అదనంగా మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కాలం వేతనాలు సైతం ఇవ్వలేదని చెబుతున్నారు. ఎవరికి మొర పెట్టుకున్నా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.  

న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ చేసింది. కాగిత రహిత పాలనకు చరమగీతం పాడాలని సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసింది. అవి కొంతకాలం పని చేసిన తర్వాత తరచూ మొరాయిస్తుండటంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పోషణ్‌ ట్రాకర్‌, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, తదితర యాప్‌లలో వివిధ వివరాలను పొందుపరుస్తున్నారు. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ సమాచారంతో పాటు చిన్నారుల ఎత్తు, బరువు వంటివి సైతం కొలిచి నమోదు చేస్తున్నారు. కొందరు సొంత చరవాణులను వినియోగిస్తున్నారు. యాప్‌ల భారం తగ్గించాలని చెబుతున్నా పట్టించుకోలేదు. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన తాజాగా వారికి మరో బాధ్యతను అప్పగించారు. కుటుంబ సర్వే చేసి యాప్‌లో పొందుపరచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తమ ఇబ్బందులు పరిగణనలోకి తీసుకుని అధికారులు పని భారం తగ్గించాలని సిబ్బంది కోరుతున్నారు.

వేతనాల మాటేంటి..!

అంగన్‌వాడీలు పనిభారంతో సతమతమవుతుండంతో పాటు సకాలంలో జీతాలందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కార్యకర్తలకు నెలకు రూ.11,500, సహాయకులకు రూ.7 వేలు చొప్పున ప్రభుత్వం వేతనం చెల్లించాలి. అవి రెండు, మూడు నెలలకోసారి జమవుతున్నాయి. ఇదిలా ఉండగా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గతేడాది డిసెంబరు 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు సమ్మె బాట పట్టారు. ఆ రోజులకు సంబంధించి జిల్లాలో సిబ్బందికి సుమారుగా రూ.6 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆ వేతనాలు అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి 15 రోజులు గడిచినా ఇంతవరకు  ఖాతాల్లో నగదు జమ కాలేదు.

భారం తగ్గించాలి

ఇప్పటికే పని భారంతో ఇబ్బందులు పడుతున్నాం. తాజాగా కుటుంబ సర్వే చేయాలని సూచిస్తున్నారు. సమ్మె కాలానికి చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటి వరకు ఖాతాల్లో జమ చేయలేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం.

కె.కల్యాణి, అధ్యక్షురాలు, జిల్లా అంగన్‌ వాడీ కార్యకర్తల సంఘం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని