logo

పట్టాల పేరుతో జగన్మాయ..!

‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు. ఇప్పుడు రూ.వేల కోట్లు ఖర్చు చేసి వారి సొంతింటి కల నెరవేరేస్తున్నాం.

Updated : 12 Apr 2024 06:25 IST

ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలం చూపించని పాలకులు
ఇదేం చోద్యమంటూ లబ్ధిదారుల ఆవేదన
న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం, శ్రీకాకుళం అర్బన్‌, లావేరు, హిరమండలం


‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు. ఇప్పుడు రూ.వేల కోట్లు ఖర్చు చేసి వారి సొంతింటి కల నెరవేరేస్తున్నాం. నిరుపేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ధ్యేయం. కడుతున్నవి  ఇళ్లు కాదు.. ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా’

ఇవీ ముఖ్యమంత్రి జగన్‌ మాటలు..

జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం కేటాయించామంటూ మా చేతుల్లో పట్టాలు పెట్టారు. ఇప్పటి వరకు స్థలాలు కూడా చూపించలేదు. అధికారుల చుట్టూ, పట్టాలిప్పించిన నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. కానీ సమస్య పరిష్కారం కావట్లేదు.

ఇది లబ్ధిదారుల ఆవేదన


టెక్కలి- చెట్లతాండ్ర మార్గంలో చింతలగార వద్ద సర్వే నంబరు 7లో 20 ఎకరాల స్థలాన్ని జగనన్న లేఅవుట్‌ కోసం సిద్ధం చేశారు. ఇక్కడ స్థలం ఇచ్చేందుకు వందలాది మందికి పట్టాలు మంజూరు చేశారు. ఇంతవరకు ఒక్కరికి కూడా స్థలం చూపించలేదు. బన్నువాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఎక్కడో చోట స్థలాలపై  నాయకులకు సమస్య ఎదురవుతూనే ఉంది. ఎన్నికల వేళ ప్రచారానికి వెళ్తుంటే ఇచ్చిన పట్టాలు ఏం చేయాలంటూ వారినే నేరుగా ప్రశ్నిస్తుంటే వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎన్నికల కోడ్‌ రాకముందు ప్రతి ఇంటికి వెళ్లి నీ ఇంటికి ఇంత లబ్ధి జరిగిందంటూ గొప్పలు చెప్పుకొన్న వైకాపా నేతలకు తమకు ఇల్లు మంజూరు కాలేదు.. ఇంటి బిల్లూ రాలేదు.. ఇందులో ఎలా రాశారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు ఊదరగొడుతున్నారు. ఇప్పటికీ ఎన్నికల ప్రచారాల్లోనూ ఎంతో మందికి ఇళ్లు కేటాయించేశాం.. ఊళ్లను నిర్మించేస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో జగనన్న కాలనీల పేరులో ఎన్ని ఊళ్లు కట్టారా అని పరిశీలిస్తే.. ఊళ్ల మాట దేవుడెరుగు.. ఇంటి స్థలం కూడా చూపలేదంటూ ఎంతో మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనువైన చోట అక్రమాలు..

మండల కేంద్రాల్లో కొన్నిచోట్ల విలువైన స్థలాలు మాత్రం పెద్దలకే కేటాయించారు. టెక్కలి పట్టణానికి ఆనుకుని వేసిన శ్యామసుందరపురం జగతిమెట్ట లేఅవుట్‌లో అనర్హులకే పెద్ద ఎత్తున పట్టాలు మంజూరు చేశారు. ఆపై మిగిలినవారు కూడా ఇళ్ల స్థలాలను అమ్ముకున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి 270 మంది పట్టాలు చేతులు మారాయని నివేదిక అందినా.. వాటిని తొక్కిపెట్టమని వైకాపా నాయకులు అధికారులపై ఒత్తిడి పెంచేశారు. జిల్లాలో చాలా చోట్ల ఇలాగే పెద్దఎత్తున జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టాల మంజూరుతో పాటు స్థలాల కేటాయింపులోనూ నేతల చేతివాటం, ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల అయినవారికి రెండు.. మూడు స్థలాలు కేటాయించి వారికి మేలు చేశారు. అర్హులైన పేదలకు అన్యాయం చేశారు.

హిరమండలంలో పేదలకు పంపిణీ చేయని ఇళ్ల స్థలం

కాలనీల్లో సౌకర్యాలేవీ..

జగనన్న కాలనీల్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగా మారిపోయాయి. జిల్లాలో ఎక్కడా పూర్తి స్థాయిలో మౌలికవసతులు కల్పించిన పరిస్థితి లేదు. చాలా కాలనీలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యమూ సక్రమంగా లేదు. విద్యుత్తు సదుపాయం శూన్యం. స్తంభాలు వేయాల్సిన గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో వెనుదిరిగారు. కాలువలు, మంచినీటి కుళాయిల ప్రస్తావనే లేదు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి ఒక్కో కాలనీని ఎంపిక చేశారు. ఆయా చోట్ల కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు సమకూర్చలేకపోయారు.


కొత్తూరు మండలం మదనాపురం గ్రామానికి చెందిన కిల్లారి జ్యోతి, బానాల నాగమణి జగనన్న కాలనీలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిని అర్హులుగా గుర్తించారు. కానీ స్థలం చూపలేదు. అయినప్పటికీ జగనన్న రూ.2 లక్షలు విలువైన స్థలం ఇచ్చారని నాయకులు ప్రచారం చేస్తూ కరపత్రాలు కూడా చేతిలో పెట్టారు.


టెక్కలిలో స్థలాలు కేటాయించకుండానే ఇచ్చిన ఇళ్ల పట్టాలను చూపిస్తున్న మహిళలు

  • టెక్కలి పట్టణం చేరివీధి ప్రాంతంలో లే అవుట్‌ వేశారు. అక్కడ 300 మందికిపైగా పట్టాలిచ్చారు. ఇంతవరకు ఒక్కరికీ స్థలాలు చూపించలేదు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన నాయకులు ఎన్నికల్లోగా స్థల సమస్య పరిష్కరించి ఓట్లడుగుతామని.. లేకుంటే ఓటే అడగమని బీరాలు పలికారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంతవరకు స్థలం చూపించలేకపోయారు.
  • లావేరు మండల కేంద్రంలో సుమారు 160 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. స్థలం దూరం కావడంతో లబ్ధిదారులు అప్పట్లో వ్యతిరేకించారు. మరోచోట స్థలం చూపిస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు.
  • శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడలో ఇటీవల 44 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. లబ్ధిదారులకు స్థలంలో హద్దులు చూపించకపోవడంతో ఎవరు.. ఎక్కడ ఇల్లు నిర్మించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ఇదే ప్రాంతంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా.. ఆ స్థలం లోతట్టు ప్రాంతంలో ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అప్పట్లో రెవెన్యూ అధికారులను ఆదేశించి.. వారికి వేరే చోట్ల స్థలాలు చూపించారు. ఇప్పుడు ఎన్నికల ముందు అదే లోతట్టు ప్రాంతంలో హద్దులు కూడా వేయకుండా వేరే లబ్ధిదారులు  పట్టాలివ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
  • హిరమండలం మండల కేంద్రంలో 65 మందికి, మండలంలోని మరో 33 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. 99 రోజుల్లో స్థలం చూపిస్తామని మాటిచ్చారు. కోరాడ రెవెన్యూ పరిధి హిరమండలం సంతతోట ప్రదేశంలో రెండెకరాల ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదించారు. ఆ స్థలాన్ని బాగు చేసి ఇంతవరకు లబ్ధిదారులకు అప్పగించలేదు.

  • గార మండలం సతివాడ గ్రామ సచివాలయ పరిధిలో 12 మంది లబ్ధిదారులకు హద్దులతో కూడిన స్థలం, ఇంటి నిర్మాణం మంజూరు పత్రాలు అందజేశారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు నిర్మించారు. దీంతో లబ్ధిదారులకు స్థలం లేకుండా పోయింది. ఇప్పటివరకు మళ్లీ అధికారులు స్థలం చూపలేదు.

జగనన్న కాలనీల పరిస్థితి ఇదీ..

  • గుర్తించిన లే అవుట్లు: 742
  • లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లు: 75,840
  • పునాది దశ దాటనివి: దాదాపు 29,000

     

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని