logo

ఐదేళ్ల నిర్లక్ష్యం.. చుక్కనీరు కనం..

రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు ఇచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వారని గాలికొదిలేసింది. కనీసం సాగునీటి కాలువల నిర్వహణను సైతం పట్టించుకోక పోవడంతో నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

Published : 16 Apr 2024 04:58 IST

చెవ్వాకులపేట వద్ద అధ్వానంగా పురుషోత్తపురం- నైరా ఛానల్‌

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు ఇచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వారని గాలికొదిలేసింది. కనీసం సాగునీటి కాలువల నిర్వహణను సైతం పట్టించుకోక పోవడంతో నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. తెదేపా హయాంలో యరగాం-పురుషోత్తపురం, పురుషోత్తపురం- నైరా ఛానల్‌ను సుమారు 40 కి.మీ. పొడవునా బాగుచేసి రైతులకు పూర్తి స్థాయిలో 20 వేల ఎకరాలకు సాగునీరందేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ నీరు- చెట్టు పనులు ద్వారా రూ.6 కోట్లతో కాలువలో పూర్తిగా పూడికలు తొలగించి మరమ్మతులు చేయించారు. 4 ఏళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటలు పండించుకున్నారు. అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా కనీసం అటువైపు చూడక పోవడంతో పూర్తిగా పనికిరాని మొక్కలు, పూడికలతో ఛానల్‌ నిండిపోయింది. దీంతో సాగునీరందక రైతులు వర్షాధారంగానే పంటలు పండించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఛానల్‌ గట్టు, కల్వర్టులు మరమ్మతులకు గురవడంతో ఏ క్షణంలో కూలిపోతాయో అని రైతులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

అడుగడుగునా గండ్లు

కాలువ 40 కి.మీ. పొడవునా నిర్వహణను పట్టించుకోక పోవడంతో వర్షాలు కురిసినపుడు ఎక్కడికక్కడ గండ్లు పడటంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఛానల్‌ గట్లుపై పనికిరాని మొక్కలు ఏపుగా పెరగడంతో గండ్లు పడే సమయంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఛానల్‌ గురించి పట్టించుకోలేదని పలువురు మండిపడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని చెవ్వాకులపేట, ఆనందపురం, రామచంద్రాపురం, పొన్నాంపేట, పురుషోత్తపురం, పకీర్‌సాహెబ్‌పేట, అమ్మాజీపేట, పాలవలస,యరగాం, మూలసవలపురం, పొన్నాం, కనకముడిపేట గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

వేసవిలో పనులు చేపడతాం.. యరగాం-పురుషోత్తపురం, పురుషోత్తపురం- నైర ఛానల్‌లో పూడికలు పేరుకుపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. వేసవిలో పూర్తిస్థాయిలో పనులు చేపట్టి రైతులకు సాగునీరందే విధంగా కృషి చేస్తాం. - సరస్వతి, జేఈ, నీటి పారుదల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని