logo

సిక్కోలు కుర్రోడి సత్తా..!

మారుమూల పల్లెటూరు.. రైతు కుటుంబంలో జన్మించిన యువకుడు సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటాడు. పట్టుదలతో చదివి సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. ఉన్నత చదువులు పూర్తి కాగానే కొంత కాలం ఉద్యోగం చేశాడు.

Published : 17 Apr 2024 04:59 IST

సివిల్స్‌లో 467వ ర్యాంకు సాధించిన అల్లాడపేట వాసి
న్యూస్‌టుడే, జలుమూరు

మారుమూల పల్లెటూరు.. రైతు కుటుంబంలో జన్మించిన యువకుడు సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటాడు. పట్టుదలతో చదివి సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. ఉన్నత చదువులు పూర్తి కాగానే కొంత కాలం ఉద్యోగం చేశాడు. అనంతరం సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగి.. రెండో ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించాడు.

జలుమూరు మండలంలోని అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్‌  సివిల్స్‌లో 467 ర్యాంకు కైవసం చేసుకున్నారు. తండ్రి చంద్రరావు రైతు.. తల్లి రోహిణి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి సంతానం వెంకటేష్‌, రెండో సంతానం వంశీ. వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదాయం తక్కువగానే ఉన్నప్పటికీ కష్టాలను దిగమింగి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వెంకటేష్‌ 1 నుంచి 3వ తరగతి వరకు స్వగ్రామంలో చదువుకున్నాడు. 4 నుంచి 9 వరకు మునసబుపేటలోని ప్రైవేటు పాఠశాలలో, పదో తరగతి ప్రైవేటు పాఠశాలలోను చదువుకున్నారు. ఇంటర్మీడియట్‌ విశాఖపట్నంలో పూర్తి చేశారు. తిరుచానూరులోని ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా పొందారు.. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఓ ప్రైవేటు సంస్థలో పని చేశాడు. అనంతరం సివిల్స్‌ శిక్షణ తీసుకొని రెండో ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించాడు. రెండో కుమారుడు బాన్న వంశీ ప్రస్తుతం శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ను జడ్పీటీసీ సభ్యురాలు మెండ విజయశాంతి, మెండ రాంబాబు, బంధువులు అభినందించారు.


ఉద్యోగం చేసినా సంతృప్తి లేక..

- వెంకటేష్‌

ఎన్‌ఐటీలో చదివేందుకు మొదట్లో ఇబ్బందులు పడ్డాను. నిరంతరం చదువుపై దృష్టి పెట్టడంతో పాటు ఇంజినీరింగ్‌ చివరి ఏడాదిలో ప్రాంగణ ఎంపికల్లో ఓ ప్రైవేటు సంస్థకు ఎంపికయ్యాను. రెండేళ్లు ఉద్యోగం చేసినా సంతృప్తి అనిపించలేదు. ఐఏఎస్‌ అధికారిగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాను. శిక్షణ తీసుకుని ఈ ర్యాంకు సాధించాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని