logo

పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!

ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి.

Updated : 24 Apr 2024 06:17 IST

ప్రజాగళం సభలతో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, ఆమదాలవలస పట్టణం, గ్రామీణం, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు:  ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలతో అందరిలో భరోసా పెరిగింది. అధినేత ప్రసంగం ఎన్నికల ముంగిట ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు పెద్దఎత్తున తరలిరావడంతో రెండు ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.

ఆమదాలవలసలో ర్యాలీగా తరలివస్తున్న కూటమి శ్రేణులు

మేము అధికారంలోకి రాగానే..

పాతపట్నంలో సూపర్‌- 6 ప్రతులను ప్రదర్శిస్తున్న మహిళలు

  • ‘పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ నెలకొల్పుతాం.
  • ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం.
  • విద్య, ఉపాధి అవకాశాలను పెంచే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పుతాం.
  • రహదారులు అభివృద్ధి చేస్తాం.
  • చెత్త పన్ను ఎత్తి వేస్తాం.
  • విద్యుత్తు ఛార్జీలు పెంచం.
  • గంజాయి రహిత రాష్ట్రాన్ని తీసుకువస్తాం.
  • ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెనల నిర్మాణం పూర్తి చేస్తాం.
  • నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు కొలిక్కి తీసుకొస్తాం.
  • ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు పనులు పూర్తి చేస్తాం.
  • నియోజకవర్గానికి ఇంజినీరింగ్‌ కళాశాల తీసుకువస్తాను.
  • వంశధార ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మోదీ చిత్రంతో భాజపా కార్యకర్త, పాతపట్నం సభకు హాజరైన జనసందోహం

 గెలిపించండి.. చరిత్ర సృష్టిద్దాం..

చంద్రబాబు ప్రసంగిస్తూ..‘రామ్మోహన్‌నాయుడు లాంటి యువ నాయకుడు పార్లమెంటులో ఉండాలి. మూడోసారి మరింత మెజార్టీతో గెలిపించాలి. ఆమదాలవలస బుల్లెట్టు కూన రవికుమార్‌ను గెలిపించండి. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తెదేపా తీసుకుంటుంది. గోవిందరావు సామాన్యుడు. మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా పాతపట్నం నుంచి అవకాశం కల్పించాం. ఆదరించండి. గోవిందరావు ద్వారా పాతపట్నంలో కొత్త చరిత్రను సృష్టిద్దాం. ఇక్కడి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల వద్ద పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. రక్షణ గోడ కట్టాలన్నా కమిషన్‌ ఇచ్చుకోవాల్సిందే. ఇసుక ఒడిశాకు తరలించి అక్రమంగా సంపాదిస్తున్నారు.’ అని అన్నారు.  

 నేడు మహిళలతో చంద్రబాబు సమావేశం

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సుమారు 5 వేల మంది మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. మంగళవారం రాత్రి నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానానికి చేరుకుంటారు. దీనికి సంబంధించి ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. సమావేశం అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గంలో నెల్లిమర్ల వెళ్తారని సమన్వయాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

 చంద్రబాబును కలిసిన కలమట

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పాతపట్నం ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన కలమట వెంకటరమణ కొన్ని రోజులుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలకు తెరపడింది. మంగళవారం పాతపట్నం, ఆమదాలవలస ప్రజాగళం బహిరంగ సభ అనంతరం శ్రీకాకుళం చేరుకున్న చంద్రబాబును కలమట వెంకటరమణ కలిశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం కలమటకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడంతో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో పాతపట్నం తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.

ఐటీడీఏ లేకుండా చేసిన జగన్‌..

జిల్లాల పునర్విభజనలో ముఖ్యమంత్రి జగన్‌ ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. గిరిజనులను నిలువునా మోసం చేశారు. వారికి ఐటీడీఏ లేకుండా చేశారు. వంశధార నిర్వాసితులకు పంగ నామాలు పెట్టారు. గడిచిన 20 ఏళ్లలో తెదేపా అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలుపొందారు. అందుకే పాతపట్నం వెనుకబడి ఉంది. ఈసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసే బాధ్యత మాది.

కె.రామ్మోహన్‌నాయుడు, పార్లమెంటు సభ్యుడు, శ్రీకాకుళం 

తమ్మినేనే అభివృద్ధి చెందారు...

2019లో అసత్యాలు చెప్పి ఓట్లు దండుకున్న తమ్మినేని సీతారాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. ఆయన మాత్రమే అభివృద్ధి చెందారు. ఉద్యోగులు బదిలీలకు సొమ్ములు, గుత్తేదారుల వద్ద కమీషన్లు తీసుకొని వృద్ధిలోకి వచ్చారు. 10 కిలోమీటర్ల ఆమదాలవలస-శ్రీకాకుళం రహదారి వేయలేకపోయారు. గతంలో నేను ప్రారంభించిన ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రజలంతా ఈ విషయం గమనించాలి.

కూన రవికుమార్‌, తెదేపా ఆమదాలవలస అభ్యర్థి 

మీలో ఒక్కడిగా ఉంటాను...

సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడం చంద్రబాబు దార్శినికతకు నిదర్శనం. తెదేపా హయాంలోనే కొత్తూరుకు ఆసుపత్రి మంజూరు చేస్తే దాన్ని రెడ్డి శాంతి ఆమె కన్నవారి ఊరు పాలకొండకు తరలించుకుపోయారు. పాతపట్నంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చాను. మీలో ఒక్కడిగా ఉంటాను. ఆదరించండి.

మామిడి గోవిందరావు, తెదేపా పాతపట్నం అభ్యర్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని