logo

అన్ని చోట్లా.. అగచాట్లే!

సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు.

Published : 25 Apr 2024 04:19 IST

కానరాని కనీస వసతులు
మూడు మండలాల్లో ‘న్యూస్‌టుడే’ పరిశీలన
పాలకుల నిర్లక్ష్యంపై జనం అసహనం
న్యూస్‌టుడే, హరిపురం (మందస), ఇచ్ఛాపురం, పలాస

ఇచ్ఛాపురం: నివాసాల నడుమ మురుగు తిష్ఠ

సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. విప్లవాత్మకమైన మార్పు వస్తుందని ఆశించారు. కానీ ఐదేళ్ల క్రితం గ్రామాలు, కాలనీలు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే కనిపిస్తున్నాయి. అన్న వస్తే ఏదో చేస్తాడని భావించిన జనానికి కోలుకులేని దెబ్బ తగిలినట్లయింది.

పురపాలిక పరిధిలో పట్టణానికి దగ్గరగా మూడో వార్డులో మూడు గ్రామాలు, ఒక కాలనీ ఉంది. పద్మనాభపురం గ్రామంలో మంచినీటి కోనేరుగా ఉండే చెరువు నేడు దుర్గంధంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో పురపాలక సంఘాల్లో చెరువులు, కోనేరు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. పుర పరిధిలో ఉన్న గిరిజన గ్రామం పెంటిభద్రకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా పాలకులు చేయలేకపోయారు. ఇక శివాజీనగర్‌లో రోడ్డు, కాలువలు వెతికినా కనిపించవు. జయరామచంద్రపురంలో మంచినీటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

హరిపురం అవస్థలమయం

మందస మండలంలోని మందస తరువాత పెద్ద గ్రామం హరిపురం. ఐదు వేలకుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో వైకాపా పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన ఉద్దానం ప్రాజెక్టు నీరే గ్రామానికి ప్రధాన ఆధారం. ప్రస్తుతానికి అది తరచూ మరమ్మతులకు గురి కావడంతో తాగునీటి సమస్య నెలకొంది. గున్నయ్యనగర్‌, సాయికాలనీ, పాతరోడ్డు వీధుల్లో ప్రజలు నీటి కోసం ఆపసోపాలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి తోడు అపరిశుభ్రత, స్నానాలకు వినియోగించే రెండు మంచినీటి కోనేర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అపరిశుభ్రంగా తయారయ్యాయి.

శూన్యం తెదేపా పాలనలో మా గ్రామంలో సౌకర్యాలు కల్పించారు. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం. 

పుల్లా వాసుదేవరావు, హరిపురం


ఎటు చూసినా సమస్యలే

పలాస: పద్మనాభ గ్రామంలో నిరుపయోగంగా మారిన కోనేరు

ఇచ్ఛాపురంలోని 5వ వార్డులో తాగునీరు, మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు, కాలువలు, కల్వర్టులు, అభివృద్ధికి నోచుకోని చెరువులు ఉన్నాయి. ఈ వార్డులో అత్యధికులు తెదేపా అభిమానులు కావడంతో ప్రభ్తుత్వం నిర్లక్ష్యం వహించిందని వీధి యువత తెలిపారు. ఇక్కడ 80 శాతం మంది చేపల పెంపకం, వేట, అమ్మకంతో జీవనం సాగిస్తున్నారు. 8 వీధుల్లో ఎక్కడ చూసినా కాలువలు, రోడ్లు అంసపూర్తిగానే ఉన్నాయి. యువత ఏర్పాటుచేసుకున్న గ్రంథాలయానికి తెదేపా హయాంలో భవనం నిర్మించగా, దాని నిర్వహణ పాలకులు గాలికొదిలేశారు.

వ్యాధుల భయం..  పాలకులు తమ కష్టాలను పట్టించుకోలేదు. కాలువలు లేని వీధుల్లో దుర్గంధం.. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అనారోగ్యానికి గరవుతున్నాం.

కమలోబెహర


ఇక్కట్లు పడుతున్నాం

తాగునీటి ఇబ్బందే.. జయరామచంద్రపురంలో రెండు బోర్లలో ఒక్కటే మంచినీరు వస్తోంది. ఈ బోరు సైతం ఇటీవల నెలరోజులుగా సక్రమంగా పనిచేయకపోవటంతో ఇబ్బంది పడుతున్నాం. అధికారులు పట్టించుకోలేదు. చందాలు వేసుకుని మరమ్మతులు చేసుకుంటాం.

పాపమ్మ, జయరామచంద్రపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని