logo

సైకిలెక్కుతున్న జగనన్న సైన్యం..!

Published : 01 May 2024 06:43 IST

తెదేపా గూటికి గ్రామ వాలంటీర్లు
వైకాపా నేతల వైఖరిపై అసంతృప్తితోనే చేరికలు
న్యూస్‌టుడే, టెక్కలి 

టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన 19 మంది గ్రామ వాలంటీర్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో మంగళవారం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వారంతా రాజీనామా చేసి విధుల నుంచి తప్పుకొన్నారు. వైకాపా నేతల తీరును వీరు తప్పుబట్టారు. తాము ప్రభుత్వ సేవల కోసం విధులు నిర్వహిస్తుంటే వైకాపా నేతల బలవంతపు రాజీనామాతో విభేదించామని, అందుకే తెదేపాలో చేరామని వెల్లడించారు.

న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

  • నరసన్నపేట: జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన ఆరుగురు వాలంటీర్లు ఏప్రిల్‌ 28న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్నారు. జగన్‌ పాలనతో రాష్ట్రానికి, తమకు భవిష్యత్తులేదని, అందుకే చేరుతున్నట్లు చెప్పారు.
  • ఆమదాలవలస: సరుబుజ్జిలి మండలం పాలవలస నుంచి ఓ వాలంటీరు ఏప్రిల్‌ 21న చేరారు.
  • కోటబొమ్మాళి మండలం తులసిపేట నుంచి ఇద్దరు, సంతబొమ్మాళి మండలం ఉమిలాడ, గద్దలపాడు, గోవిందపురం, శ్రీకృష్ణపురం గ్రామాల నుంచి వాలంటీర్లు తెదేపాలో చేరారు. నందిగాం మండలం రాంపురం నుంచి, టెక్కలి మండలం అయోధ్యపురం నుంచి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

జగనన్న సైన్యం.. జగన్‌ కోసం, వైకాపా కోసం తమ విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఎన్నికల్లో పాల్గొంటున్నారంటూ వైకాపా నేతలు ఊదరగొడుతూ వచ్చారు.. అయితే తాము ఎవరికీ కట్టుబానిసలం కాదని పేర్కొంటూ తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు వాలంటీర్లు.. రాజీనామా చేయాల్సిందేనని గ్రామాల్లో నాయకులు బలవంతం చేయడంపై పలువురు అంతర్మథనం చెందారు.. అధికార పార్టీ నేతలు చూపించిన దౌర్జన్యాన్ని ఆమోదించేందుకు సిద్ధపడటం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో  వాలంటీర్లు గ్రూపులుగా ఏర్పడి కూటమి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు..

కూటమి భరోసాతో మార్పు.. 

కూటమి మ్యానిఫెస్టోలో వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెదేపాలో చేరేందుకు సిద్ధమవుతామని మండల స్థాయిలో వాలంటీర్ల ప్రతినిధులు కూటమి నేతలకు సందేశాలు పంపుతున్నారు. గ్రామాల్లో వారి ప్రవర్తన, వారికున్న స్థానిక పరిస్థితులను తెదేపా నేతలు వాకబు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాజీనామాలు చేయనివారు నేరుగా తెదేపా అభ్యర్థులను కలసి సహకారం అందిస్తామని చెప్పి తమ మద్దతు ప్రకటిస్తున్నారు.  

అధికార పార్టీ వెన్నులో వణుకు..

ఇన్నాళ్లూ తమ సైన్యంగా, తమ బలంగా చెప్పుకొనే వాలంటీర్లపై అజమాయిషీ చేసిన వైకాపా నేతల తీరుపై వాలంటీర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో వారితో ఉంటూనే వారి అంతర్గత సమాచారాలు బయటకు ఇస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన మద్యం నిల్వల సమాచారాన్ని వాలంటీరు ద్వారానే బయటకు పొక్కినట్లు అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఇన్నాళ్లూ ఎంత నమ్మకంగా సేవలందించినా తమను మనుషులుగా కాక వస్తువులుగానే చూశారని, వారికి తామేంటో చూపిస్తామని మరికొందరు బయట పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని