logo

ముగిసిన వణంగాన్‌ చిత్రీకరణ

బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘వణంగాన్‌’ చిత్రంలో అరుణ్‌ విజయ్‌ నటించారు. సురేశ్‌ కామాట్చి నిర్మాణంలోని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు.

Published : 17 Apr 2024 01:44 IST

చిత్రబృందం

చెన్నై, న్యూస్‌టుడే: బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘వణంగాన్‌’ చిత్రంలో అరుణ్‌ విజయ్‌ నటించారు. సురేశ్‌ కామాట్చి నిర్మాణంలోని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు. చిత్రీకరణ ముగిసినట్లు నిర్మాత తన ఎక్స్‌ పేజీలో ఫొటోలు పోస్టు చేశారు. దర్శకుడు, నటుడు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేవారం టీజర్‌ విడుదల కానుందని సమాచారం.


‘అరబిక్‌ కుత్తు’ని అధిగమించిన ‘విజిల్‌ పోడు’

పాటలోని సన్నివేశం

చెన్నై, న్యూస్‌టుడే: విజయ్‌ నటిస్తున్న ‘గోట్‌’ చిత్రంలోని ‘విజిల్‌ పోడు’ పాట లిరిక్‌ వీడియోను తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా చిత్రబృందం ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. విజయ్‌ పాడిన ఈ పాటలోని భావం ఆయన రాజకీయ ప్రవేశానికి సంబంధించినట్లు ఉందనే అభిప్రాయాలను నెటిజన్లు వినిపించారు. వీడియో విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్‌లో 25.5 మిలియన్‌ వ్యూస్‌లను దాటింది. గతంలో దక్షిణభారత సినిమాల్లో 24 గంటల్లోపు అత్యధిక వీక్షణలు కలిగిన పాటగా విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని ‘అరబిక్‌ కుత్తు’ పాట ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ రికార్డును ‘విజిల్‌ పోడు’ అధిగమించింది.


ఎన్నికల తర్వాత థగ్‌ లైఫ్‌లో కమల్‌

‘థగ్‌ లైఫ్‌’ పోస్టర్‌

చెన్నై, న్యూస్‌టుడే: దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్‌ కాంబోలో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. చిత్రీకరణ జనవరిలో ప్రారంభమైంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటంతో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను కమలహాసన్‌ వాయిదా వేశారు. 19న పోలింగ్‌ తర్వాత ఆయన కెమెరా ముందుకు వెళ్లనున్నారు. సైబీరియాలో క్లైమాక్స్‌ సన్నివేశాలు, దిల్లీ, చెన్నైలో మిగతా సన్నివేశాల చిత్రీకరణ చేపట్టాలని చిత్రబృందం నిర్ణయించింది.


త్వరలో దివ్యాంగులతో సినిమా: లారెన్స్‌

చెన్నై, న్యూస్‌టుడే: దివ్యాంగులతో త్వరలో ఓ సినిమాను తీయనున్నట్లు నటుడు, నృత్యదర్శకుడు రాఘవా లారెన్స్‌ తెలిపారు. తమిళ సంవత్సరాది సందర్భంగా తనకు చెందిన ‘కై కొడుక్కుం కై’ దివ్యాంగుల బృందం తరఫున ‘మల్లర్‌ కంబం’(మల్ల కంబ్‌) విన్యాసాలను ప్రదర్శన నగరంలో నిర్వహించారు. మల్లర్‌ కంబం నేర్చుకున్న దివ్యాంగులకు తనవంతు సాయాన్ని చేస్తానని తెలిపారు. వారితో త్వరలో ఓ చిత్రాన్ని తీయనున్నట్టు, దాని ద్వారా వచ్చే ఆదాయంతో వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని