logo

అనాలోచిత నిర్ణయాలతోనేవిద్యుత్తు నష్టాలు!

విద్యుత్తు సంస్థలు, ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, లోపాయికారీ ఒప్పందాలే విద్యుత్తు రంగంలో నష్టాలకు కారణమని, వాటిని ప్రజలపై రుద్దడం ఎంతవరకు సమంజసమని తిరుపతికి చెందిన సీపీఎం

Published : 26 Jan 2022 04:10 IST

ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణలో పలువురి విమర్శలు

ప్రజాభిప్రాయ సేకరణ వేదికపై జస్టిస్‌ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్‌సీ సభ్యులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విద్యుత్తు సంస్థలు, ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, లోపాయికారీ ఒప్పందాలే విద్యుత్తు రంగంలో నష్టాలకు కారణమని, వాటిని ప్రజలపై రుద్దడం ఎంతవరకు సమంజసమని తిరుపతికి చెందిన సీపీఎం కార్యదర్శి సభ్యుడు కందరపు మురళీ ప్రశ్నించారు. విశాఖ ఈపీడీసీఎల్‌ కార్యాలయంలో విద్యుత్తు టారిఫ్‌పై జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పీపీఏలను సమీక్షించి తక్కువ ఛార్జీలకే విద్యుత్తు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి ఆ విధంగా ఎందుకు చేయలేకపోయిందో ప్రజలకు చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు తలూపి విద్యుత్తు సంస్కరణలు అమలు చేయడమే ప్రజలపై భారం పడటానికి కారణమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించారు. ఏ రాష్ట్రంలోను ఏర్పాటు చేయనిది అక్కడే ఎందుకు చేస్తున్నారు, వాటికి పెట్టిన ఖర్చు ఎవరిపై వేస్తారని ప్రశ్నించారు. కొవిడ్‌ పరిస్థితుల్లో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది.. కానీ డిస్కంలు ఎక్కువ విద్యుత్తు అవసరం అని అంచనాలు వేసి వ్యయాలు ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీఎస్‌ఈబీ ఏఈ అసోసియేషన్‌ సాంకేతిక కార్యదర్శి ప్రతాప్‌ మాట్లాడుతూ కేవలం బొగ్గు నిల్వల నిర్వహణలో ముందుచూపు లేకపోవడంతో 2021-22లో రూ. 1400 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పరిశ్రమలకు టైమ్‌ ఆఫ్‌ డే (టీఓడీ) పద్ధతిలో ఛార్జీలు వసూలు చేయడంలో నిర్దేశిత ప్రమాణాలను పాటించడం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యుత్తు పంపిణీ సంస్థలు ఆర్థికంగా బలహీన పడకుండా, వినియోగదారులపై భారం పడకుండా టారిఫ్‌ రూపొందిస్తాయని చెప్పారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని లోతుగా విచారించిన తరవాతే టారిఫ్‌ ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపారు. ఈఆర్‌సీ సభ్యులు రాజగోపాల్‌, ఠాకూర్‌ రామ్‌సింగ్‌, ఈపీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌ సీఎండీలు కె.సంతోషరావు, హెచ్‌.హరనాథరావు, పద్మ జనార్దనరెడ్డి, ఏపీఈర్‌సీ కార్యదర్శి రామకృష్ణ, డిస్కంల డైరెక్టర్లు కె.రాజబాపయ్య, బి.రమేష్‌ప్రసాద్‌, డి.చంద్రం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని