logo

యుద్ధం చూస్తారా!

బీచ్‌ రోడ్డులో సీహారియర్‌ యుద్ధ విమాన సందర్శనాలయం పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇందుకు ‘రాజీవ్‌ స్మృతి భవనం’ను ఆధునికీకరిస్తున్నారు. దీన్నే మ్యూజియంగా మార్చనుండటంతో అందుకు అవసరమైన పనులు

Published : 28 Jan 2022 04:51 IST

సిద్ధమవుతున్న ‘సీ హారియర్‌’
భవనం లోపలికి విమానం తరలింపు

బయట నుంచి భవనంలోకి తీసుకువెళ్తూ

ఈనాడు, విశాఖపట్నం: బీచ్‌ రోడ్డులో సీహారియర్‌ యుద్ధ విమాన సందర్శనాలయం పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇందుకు ‘రాజీవ్‌ స్మృతి భవనం’ను ఆధునికీకరిస్తున్నారు. దీన్నే మ్యూజియంగా మార్చనుండటంతో అందుకు అవసరమైన పనులు వీఎంఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ విభాగం చేస్తోంది. ఇప్పటివరకు ఆరుబయట టీయూ-142 యుద్ధ విమాన పక్కన ఉంచిన ఈ యుద్ధ విమానాన్ని తాజాగా అక్కడి నుంచి భవనం లోపలకు చేర్చారు. భారీ క్రేన్ల సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. గాలిలో ఎగురుతున్నట్లు కనిపించేలా అత్యంత జాగ్రత్తగా భవనం లోపల వేలాడదీసే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం క్రేన్లతోనే ఎత్తులో ఉంచి కొత్తగా రంగులద్దుతున్నారు.

ప్రదర్శనకు వీలుగా
ఈ మ్యూజియంలో సీహారియర్‌ యుద్ధ విమాన విడి భాగాలను కూడా ప్రదర్శించనున్నారు. ఇంజిన్‌ పరికరాలు, కాక్‌పిట్ లోపలి భాగాలు, పైలట్‌ గది, బాంబులు వదిలే పరికరాల గురించి అందరూ తెలుసుకునేలా అందుబాటులో ఉంచనున్నారు. వీటిని కేరళలోని కొచ్చిన్‌ నౌకాస్థావరం నుంచి తీసుకురావాల్సి ఉంది. ఇక్కడి నుంచి ప్రత్యేక బృందం త్వరలో బయలుదేరనుంది. ఈ మ్యూజియంలో ‘సిమ్యులేటర్‌’ విభాగం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో నిజంగా యుద్ధవిమానంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. రక్షణ రంగం దీన్ని వీఎంఆర్‌డీఏకు అప్పగించాల్సి ఉంది. కొద్ది రోజుల్లో దీనిపై చర్చించనున్నారు.  

భవనం లోపల ఎగిరేలా కనిపించేందుకు సిద్ధం చేస్తూ..

36 అడుగుల అద్దాలతో
గాలిలో ఎగురుతున్నట్లుండే ‘సీహారియర్‌’ బయటకు కనిపించేందుకు వీలుగా భవనం చుట్టుపక్కల భారీ గాజు గ్లాసులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఒకవైపు ఫ్రేము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానం ఒక భారీ గది కన్నా పెద్దదిగా ఉండడంతో అది కనిపించేందుకు వీలుగా ఒక్కో వైపు 36 అడుగుల ఎత్తు గ్లాసులు అమర్చనున్నారు.

రూ.40 కోట్లతో
సమీకృత తీర ప్రాంత ప్రాజెక్టులో భాగంగా సీహారియర్‌ యుద్ధ విమాన మ్యూజియాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ.40 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. మ్యూజియంతో పాటు ఫుడ్‌కోర్టులు, పార్కింగ్‌ స్థలాలు అభివృద్ధి చేయనున్నారు. గతంలో భూగర్భ పార్కింగ్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించినప్పటికీ వ్యతిరేకత రావడంతో దానిపై వెనక్కి తగ్గారు. కురుసురా జలంతర్గామి, టీయూ-142 యుద్ధ విమానం, సీహారియర్‌ మ్యూజియం..ఈ మూడింటినీ కలిపి ‘సమీకృత ప్రాజెక్టు’గా తీసుకురావాలనేది లక్ష్యం. త్వరలో మ్యూజియం పూర్తవనున్న నేపథ్యంలో దానికో రూపు తేనున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు పర్యాటకశాఖ, జీవీఎంసీ నిధులు సమకూర్చాలి. ప్రాథమికంగా జరిగే పనులకు మాత్రమే వీఎంఆర్‌డీఏ నిధులు ఖర్చు చేయాలి. మిగిలిన శాఖలు ఆసక్తి చూపక పోవడంతో వీఎంఆర్‌డీఏ ప్రస్తుతానికి నిధులు వెచ్చిస్తోంది.

వీక్షకులకు మరపురాని అనుభూతి: సీహారియర్‌ ప్రదర్శనశాల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో యుద్ధ విమానాన్ని పూర్తిస్థాయిలో గాలిలో ఎగిరేలా అమర్చుతాం. దీని నిర్మాణ పనులు వచ్చే నెల పది నాటికి అవుతాయి. ఆ తరువాత మార్చి నెలాఖరు నాటికి విడి భాగాలను ప్రదర్శించే ప్రక్రియ పూర్తిచేస్తాం. దీనికి సంబంధిచిన పనులన్నీ చకచకా జరగుతున్నాయి. ఇది వీక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వనుంది.

- భవానీశంకర్‌, ఎస్‌ఈ, వీఎంఆర్‌డీఏ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని