logo

జగనన్నా.. చెబుతాం వినుకో!

ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా సీఎంకి తెలిపేలా జగనన్నకు చెబుదాం.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  1902 టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రచారం చేస్తున్నారు.

Published : 03 Jun 2023 03:27 IST

జిల్లా కేంద్రంలో సమస్యలపై విన్నపాలు

తాగునీటిని పట్టుకుంటున్న మహిళలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే : ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా సీఎంకి తెలిపేలా జగనన్నకు చెబుదాం.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  1902 టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రచారం చేస్తున్నారు. పింఛన్‌ అందలేదనో.. ఇల్లు మంజూరు కాలేదనో వంటి వ్యక్తిగత సమస్యలు సరే.. మరి సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాన్ని వేధిస్తున్న పలు అంశాలు జగనన్నకు చెబుదాంతోనైనా పరిష్కారం అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్లకు రక్షిత తాగునీటిని కుళాయిల ద్వారా అందిస్తున్నారు. అనకాపల్లి మున్సిపాలిటీని 2012లో జీవీఎంసీలో విలీనం చేశారు. స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని పట్టణవాసులు ఎదురుచూశారు. 2019లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటనలో భాగంగా అగనంపూడి నుంచి అనకాపల్లికి పైప్‌లైన్‌ ఏర్పాటు వేసిశుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు రూ. 32 కోట్లతో శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లవుతున్నా పైప్‌లైన్‌ పనులు సగం కూడా పూర్తికాలేదు. ఎప్పటిలాగానే నలకలతో కూడిన తాగునీటిని అనకాపల్లి వాసులు తాగాల్సి వస్తోంది. పైప్‌లైన్ల పనుల్లో జాప్యం స్థానికులకు శాపంగా మారింది.

సాగునీటి  కాలువలు శుభ్రం చేయక ఇబ్బందులు

అనకాపల్లి మండల సాగునీటి అవసరాలు తీర్చే నాగులాపల్లి, చెర్లోపల, ఎల్లయ్య కాలువలపై నిర్లక్ష్యం అలముకుంది. శారదానది నుంచి రైతులకు సాగునీరు అందించేలా కాలువ పూడికతీత పనులను పట్టించుకోవడం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా సాగునీటి కాలువలో పూడికతీత చేపట్టలేదు. జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న కాలువ అనకాపల్లి పట్టణ ప్రాంతం మీదుగా చెర్లోపల ఖండంలోకి చేరుతుంది. పట్టణ పరిధిలో ప్రవహిస్తున్న సాగునీటి కాలువకు పక్కగా నిర్మాణాలు చేపట్టారు. కాలువలను శుభ్రం చేయాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉంది. గతంలో వేసవి కాలంలోనే కాలువ పూడికతీత పనులు చేపట్టారు. కరోనా అనంతరం ఈ పనులు నిలిచిపోయాయి. దీంతో రైతులకు సాగునీరు అందకపోగా పట్టణ వాసులకు దోమల బెడద పెరిగింది.

మూలకు చేరి నాలుగేళ్లు..

ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కానింగ్‌ పరికరం మూలకు చేరింది. గత నాలుగేళ్లగా ఇదే పరిస్థితి నెలకొంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ పరికరాన్ని బాగుచేయించలేదు. దీనికి చెందిన సామాన్లు దొరకడం లేదని దీంతో బాగుచేయించలేక పోతున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్‌ పరికరాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెబుతూ వచ్చారు. నేటికీ ఇది ఆచరణలోకి రాలేదు. దీంతో స్కానింగ్‌ చేయించుకోవాల్సిన రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అనకాపల్లిలో కంపు కంపు..

ఎక్కడైనా డంపింగ్‌ యార్డు ఊరికి చివర ఉంటుంది. అనకాపల్లిలో పట్టణ నడిబొడ్డున అదీ జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం ఆవరణలో చెత్తను నిల్వ చేస్తున్నారు. ఊరంతా తిరిగి సేకరించిన చెత్తను ఇక్కడి నుంచి కాపులుప్పాడ తరలిస్తున్నారు. దీనికి ఏడాదికి సుమారు రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. చెత్తను ఒక్కోసారి రెండు నుంచి మూడు రోజులు ఇక్కడే నిల్వ చేయడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా డంపింగ్‌ యార్డుకు జనావాసాలకు దూరంగా మారుస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు.

జీవీఎంసీ కార్యాలయంలోనే డంపింగ్‌ యార్డు

పేద రోగులకు ఇబ్బందులు

జిల్లా ఆసుపత్రిలో స్కానింగ్‌ పరికరం గత నాలుగేళ్లుగా పనిచేయడం లేదని ‘జగనన్నకు చెబుదాం’కు కాల్‌ చేసి చెప్పాం. సరైన స్పందన లేదు. స్కానింగ్‌ పరికరం అందుబాటులో లేక పేద రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టోల్‌ ఫ్రీ నంబరు 1902కి ఫోన్‌ చేస్తే వివరాలు ఇంకా చెప్పండి అంటున్నారు. నాలుగేళ్లుగా పరికరం పనిచేయడం లేదని, ప్రైవేటుగా స్కానింగ్‌కి డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోందని చెప్పాం. సమస్య పరిష్కారం అవుతుందని అన్నా ఇంకా కాలేదు.

ఎస్‌.చినబాబు, తుమ్మపాల

పరిష్కరించామని మాటలే చెబుతున్నారు.

అనకాపల్లి పట్టణం నుంచి ప్రవహిస్తున్న ఎల్లయ్యకాలువలో పూడిక తొలగించక పడుతున్న ఇబ్బందులను ‘జగనన్నకు చెబుదాం’కి కాల్‌ చేసి చెప్పాం. వివరాలన్నీ అడిగారు. ఈ కాలువ జీవీఎంసీ పరిధిలో ఉందని వారే  చేయాలని జలవనరుల శాఖ ఏఈ నుంచి సమాధానం వచ్చింది. సమాధానం సంతృప్తిగా లేదని జగనన్నకు చెబుదాంలో దృష్టికి తీసుకువస్తే తిరిగి ఫిర్యాదు చేయమన్నారు. ఈ సమస్యపై మళ్లీ ఫిర్యాదు చేశాం. నేటికీ పరిష్కారం కాలేదు.

భీశెట్టి కృష్ణ అప్పారావు, అనకాపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని