logo

అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!

 ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు.

Updated : 29 Mar 2024 06:03 IST

ఎన్నికల వేళ అనధికార నిర్మాణాల జోరు

మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేరుతో హడావుడి!

జోన్‌-4 29వ వార్డు పరిధిలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న అదనపు అంతస్తులు

 ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్నామంటూ పట్టణ ప్రణాళిక అధికారులు కళ్లు మూసుకున్నారు. కొందరు అధికారులు అక్రమార్కులతో జతకట్టి జేబులు నింపేసుకుంటున్నారు. గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వైకాపా కార్పొరేటర్లు రంగంలోకి దిగుతున్నారు. నిర్మాణాల వద్దకు ఎవరైనా వెళితే అనుచరగణంతో హడలెత్తిస్తున్నారు

బహిరంగంగానే..

.మద్దిలపాలెంకు చెందిన ఓ భవన నిర్మాణదారు (బిల్డర్‌) పరిసర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సిఫారసు చేశారంటూ బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. ప్రణాళిక విభాగంలోని కీలక అధికారికి మధ్యవర్తుల ద్వారా డబ్బులు అందజేసి, యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. 23వ వార్డు చైతన్యనగర్‌ డోర్‌ నెంబరు 53-20-31లో జరుగుతున్న నిర్మాణానికి సింగిల్‌ యూనిటగా ప్లాను పొంది, ఏకంగా నాలుగు ఫ్లోర్లు నిర్మించారు. ఒక్కో ఫ్లోర్‌లో నాలుగు వాణిజ్య, నివాస సముదాయాలుగా విభజించారు. నిర్మాణం జరుగుతున్న సందర్భంగా పోస్ట్‌ వెరిఫికేషన్‌ చేయాల్సిన ప్రణాళికాధికారులు కాసులు తీసుకుని, చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.20లక్షలు వరకు ఈ వ్యవహారంలో చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఇదే ప్రాంతంలో కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లని ప్రాంతాల్లో భారీ భవంతులు నిర్మిస్తున్నారు. శివాజీపాలెంలో ఓ భవనంపై అదనపు అంతస్తుకు బేరం కుదరగా, ఇప్పటి వరకు సగం పైకప్పు పూర్తి చేసిన నిర్మాణదారు, త్వరలో మిగతాది ఎన్నికల వేళ హడావుడిగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మేం బేరం కుదురుస్తాం..: జీవీఎంసీ పట్టణ ప్రణాళికలో వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ నుంచి అన్ని స్థాయిల్లోనూ అవినీతి పెచ్చుమీరింది. అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన కొందరు తమ వాటాలను తీసుకోవడమే కాకుండా, మధ్యవర్తిత్వం వహిస్తుండటం గమనార్హం. గత నెల రోజులుగా నగరంలో అక్రమ నిర్మాణాలపై ఎవరైనా వివరాలు అడిగితే.. వాటిని సీఎం పేషీ నుంచి సిఫారసు చేశారని, మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారంటూ ప్రశ్నించినవారికి, నిర్మాణదారులకు మధ్య బేరం కుదురుస్తుండటం కొసమెరుపు. ‘మీరు ఫలానా బిల్డరును కలవండి’ అంటూ నేరుగా కొందరు ప్రణాళికాధికారులే చెబుతుండటం కమీషన్ల తీవ్రతకు అద్దం పడుతోంది. జీవీఎంసీ కమిషనర్‌ ప్రత్యేకంగా అక్రమ నిర్మాణాలపై చర్యలకు బృందాలను ఏర్పాటు చేయగా, వార్డు కార్పొరేటర్లకు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు డబ్బులు ముట్టజెప్పని వారి భవనాలనే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలున్నాయి.

రెండంతస్తులు..రూ.1.10కోట్ల నష్టం..

నగరంలోని జోన్‌-4 పరిధిలోని 29వ వార్డు సెంచురిక్లబ్‌ సమీపంలోని పాత పల్లవి ఆసుపత్రి రహదారిలో ఓ భారీ భవనం నిర్మిస్తున్నారు. జి+ప్లస్‌-3 తరహా అనుమతులు తీసుకుని రెండు అంతస్తులు అదనంగా నిర్మిస్తున్నారు. పూర్తిగా నిబంధనలను పక్కనపెట్టి, కనీసం సెట్ బ్యాక్‌లను విడిచిపెట్టకుండా చేపట్టిన నిర్మాణం వల్ల జీవీఎంసీకి సుమారు రూ.1.10కోట్లు మేర నష్టం వాటిల్లింది. రెండు అదనపు అంతస్తులకు టీడీఆర్‌ (ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్  రైట్) పత్రాలు కొనుగోలు చేయడానికి వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణానికి వార్డు సచివాలయానికి 100 మీటర్ల దూరంలోపే ఉంది. కళ్ల ముందే అక్రమ నిర్మాణం జరుగుతున్నా, వార్డు ప్లానింగ్‌ కార్యదర్శి పట్టించుకోకపోవడం, నిర్మాణ విషయాన్ని అధికారులకు తెలియజేయకపోవడం గమనార్హం. సంబంధిత భవన నిర్మాణ వివరాలు తెలియజేయాలని వార్డు ప్రణాళిక కార్యదర్శిని కోరగా, వివరాలు అధికారులు గోప్యంగా ఉంచాలని సూచించారని, ఎవరికీ సమాచారం ఇవ్వవద్దని పేర్కొనడం విశేషం. దీనిపై సహాయ ప్రణాళికాధికారిణిని వివరణ కోరగా.. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిర్మాణం వ్యవహారంలో ప్రణాళిక కార్యదర్శి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్లు సమాచారం. ప్లానింగ్‌ కార్యదర్శి నుంచి ఉన్నత స్థాయి వరకు నిధులు వెళ్లినట్లు సమాచారం. భవన నిర్మాణం పూర్తయిన తరువాత పార్కింగ్‌కు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నా నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని