logo

కేంద్రం సహకారంతో జిల్లా అభివృద్ధి: సీఎం రమేశ్‌

కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఖాయమని, వారిద్దరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 10 May 2024 04:14 IST

నాతవరంలో సీఎం రమేశ్‌, అయ్యన్న, ఒడిశా ఎంపీలను సత్కరిస్తున్న కూటమి నాయకులు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఖాయమని, వారిద్దరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడితో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చెరకు రైతులను ఆదుకునేందుకు ఇథనాల్‌ ప్లాంట్లు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు అవసరాన్ని ప్రధాని మోదీ దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లామన్నారు. శీతల గిడ్డంగులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు భుబనేశ్వర్‌ కలిటా మాట్లాడుతూ.. పేదల పురోభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. సినీ నటుడు పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లో వైకాపాకు రెండు సీట్లు కూడా రావన్నారు. భూయాజమాన్య హక్కు చట్టం వల్ల రైతులు అన్నివిధాలా నష్టపోతారన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం చేపట్టనున్న భారీ ర్యాలీకి సంబంధించి ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.

తాండవ ఆయకట్టుకు నీరందిస్తా

నాతవరం, న్యూస్‌టుడే: తాండవ జలాశయాన్ని ఆధునికీకరించి ఆయకట్టు చివరి భూములకూ నీరందిస్తానని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో కలిసి నాతవరంలో ప్రచార సభకు హాజరయ్యారు. ఇంటి పోరుతో సతమతమవుతున్న బూడి ముత్యాలనాయుడు ప్రజలకు ఏం మంచి చేస్తారన్నారు. నాతవరంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు భుబనేశ్వర్‌ కలిటా ఆంగ్లంలో ప్రసంగించారు. నాతవరానికి చెందిన రామునాయుడు, గ్రామ వాలంటీరు మువ్వల వరహాలు, గొలుగొండపేటకు చెందిన పలువురు తెదేపాలో చేరారు.మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప, నాయకులు సత్యనారాయణ, పి.కొండబాబు, విజయకుమార్‌, మాణిక్యం, సతీష్‌, రాజుబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని