logo
Updated : 06 Aug 2022 04:34 IST

వ్యాధుల కాలం.. సేవలు కనం

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే:

జిల్లా వ్యాప్తంగా జ్వర బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వర్షాలతో నీటి నిల్వలు పెరిగి దోమలు, ఈగలు వృద్ధిచెందుతున్నాయి. ప్రజలు జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు, రోగుల ఇబ్బందులపై శుక్రవారం ‘న్యూస్‌టుడే’ పరిశీలించింది. పలు ఆరోగ్య కేంద్రాల్లో మందులు, సిబ్బంది, సౌకర్యాల కొరత  కనిపించింది. ఆసుపత్రులలో జ్వరబాధితులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించి మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది.


అరకొర వైద్యం

టీకా వేస్తున్న ఏఎన్‌ఎం

దంతాలపల్లి: దంతాలపల్లి పీహెచ్‌సీలో వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు వైద్యులకు కేవలం ఒక్కరే ఉన్నారు. మరొకరిని తాత్కాలింగా కేటాయించారు. శుక్రవారం ఇద్దరు వైద్యులు విధులకు హాజరుకాలేదు. స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలే సేవలందించారు. సుమారు 15 మంది రోగులు వచ్చారు. వైద్యురాలిని కేటాయించినట్లయితే గర్భిణులకు అనువుగా ఉంటుందని మహిళలు కోరుతున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు, మందుల కొరత ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. వైద్యాధికారి వేదకిరణ్‌తో మాట్లాడగా జిల్లా కేంద్రంలో సమావేశం ఉన్నందున పీహెచ్‌సీకి రాలేకపోయినట్లు చెప్పారు.


తెరచుకోని ఉపకేంద్రం

పెద్దవంగర: మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాళం వేసి ఉంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తోంది. ప్రహరీ లేకపోవడంతో వీధికుక్కలు, పాములు సంచరిస్తున్నాయని, మూడు రోజులుగా కేంద్రాన్ని తెరవడం లేదని స్థానికులు చెప్పారు. ఏఎన్‌ఎం హరితను వివరణ కోరగా.. డివిజన్‌ కేంద్రంలోని పీహెచ్‌సీలో మీటింగ్‌కు వెళ్లామని, ఇంటింటా జ్వర సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  


సదుపాయాలు లేక ఇబ్బందులు

రోగులకు సూచనలిస్తున్న వైద్యులు

తొర్రూరు టౌన్‌: తొర్రూరులో ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర, మెరుగైన వైద్యంకోసం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం స్థానిక ఆసుపత్రిని పరిశీలించగా వైద్యుల కొరత ప్రధానంగా కన్పించింది. డాక్టర్‌ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి. డాక్టర్‌ మీరజ్‌తో పాటు ఇటీవల పల్లె దవాఖానాకు నియమించిన నలుగురు వైద్యులతో వైద్యం కొనసాగిస్తున్నారు. మందుల కొరత లేదన్నారు.


సమయపాలన  పాటించక నిరీక్షణ

గార్ల: గార్ల సీహెచ్‌సీలో వైద్యాధికారి శుక్రవారం రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. వైద్యాధికారి వచ్చేదాకా స్టాఫ్‌నర్సు వైద్యపరీక్షలు నిర్వహించారు. 66మంది వైద్యం కోసం రాగా 10 మందికి జ్వరాలు, ఆరుగురు విరేచనాలతో బాధపడుతూ చికిత్సపొందారు. ముల్కనూరు పీహెచ్‌సీలో 56 మందికి వైద్యసేవలందించారు. ముగ్గురికి జ్వరాలు, నలుగురు కుక్కకాటుతో వైద్యసహాయం పొందారు.


మందులు అంతంత మాత్రమే..

డోర్నకల్‌: డోర్నకల్‌లోని పీహెచ్‌సీలో ఓపీ 70-90 మధ్య ఉంటుంది. శుక్రవారం మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ లక్షణాలతో కూడిన రోగులెవరూ రాలేదు. యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు లేవు. అరకొర మందులే అందుబాటులో ఉన్నాయి. మూడు నెలల నుంచి బెటాడిన్‌ ఆయింట్‌మెంటు సరఫరా నిలిచింది. బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సిందే. లేకపోతే మహబూబాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పొందేలా సిఫారసు చేస్తున్నారు.


పెరుగుతున్న జ్వరబాధితులు

బయ్యారం: వర్షాలు, దోమ విజృంభణతో పీహెచ్‌సీలకు వచ్చే జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైద్యం అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. బయ్యారం పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్‌నర్స్‌లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. యాంటీబయాటిక్‌ ఇంజెక్షన్లు లేకపోవడంతో కేవలం మందుగోళీలు ఇచ్చి పంపుతున్నారు. నిత్యం 50 నుంచి 80 మంది రోగులు వస్తుంటారు. వైద్యాధికారి కోడిపుంజులతండాలో వైద్యశిభిరం ఏర్పాటుచేయడంతో సబ్‌సెంటర్‌ వైద్యులు ఇక్కడ వైద్యం అందించారు.

మహబూబాబాద్‌ రూరల్‌: మల్యాల పీహెచ్‌సీలో జర్వబాధితుల సంఖ్య పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులతో పాటు పాము, కుక్క కాటు ఔషధాలు కూడా ఉన్నాయని వైద్యుడు విజయ్‌ తెలిపారు.

కొత్తగూడ: మండలంలో కొవిడ్‌ వ్యాప్తి పెరిగింది. వసతిగృహాల్లోని విద్యార్థులకు వైరస్‌ సోకగా చికిత్స పొందుతున్నారు. మలేరియా పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. కొత్తగూడ పీహెచ్‌సీలో ప్రతిరోజు 60 నుంచి 80 మంది రోగులు వస్తున్నారు. ఇక్కడి ఫార్మసిస్టు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో స్టాఫ్‌నర్సులు మందులు పంపిణీ చేస్తున్నారు. యాంటీబాయటిక్‌ మందుల కొరత ఉంది. మండలంలో ఇప్పటి వరకు 49 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యాధికారి సరోజ తెలిపారు.

మరిపెడ: మరిపెడ, చిన్నగూడూరు పీహెచ్‌సీల్లో సీజనల్‌ జ్వరాలు, ఒంటి నొప్పుల బాధితులు అధికంగా వస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. శుక్రవారం మరిపెడ పీహెచ్‌సీ వైద్యాధికారి అరుణాదేవిని సస్పెండ్‌ చేయగా ఉపకేంద్రం వైద్యాధికారి సతీష్‌ రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి రవి సెలవులో ఉండటంతో సిబ్బంది సేవలందించారు. మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts