logo

ఇటుక బట్టీల్లో మగ్గుతున్న బాల్యం

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులు ఇటుక బట్టీల్లో పనిచేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు.

Published : 27 Nov 2022 05:21 IST

ఇటుకను తరలిస్తూ..

అక్ష్యరాభ్యాసం చేయాల్సిన చేతులు.. ఇటుకలు మోస్తున్నాయి. రకరకాల బొమ్మలతో ఆడుకోవాల్సిన వారు..మట్టి, ఇటుకలతో కుస్తీ పడుతున్నారు. చక్కగా బడికెళ్లాల్సిన వయసులో.. వెట్టి చాకిరీ చేస్తున్నారు.


బయ్యారం, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులు ఇటుక బట్టీల్లో పనిచేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, అధికారులు ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. చట్టాల అమలు సక్రమంగా లేకపోవడమో, కుటుంబ పరిస్థితులో ఏమో కానీ.. చాలా మంది చిన్నారులు పసి వయసులోనే పనులు చేస్తున్నారు. బయ్యారం మండలంలో కొత్తపేట, గంధంపల్లి నుంచి నామాలపాడు వరకు మహబూబాబాద్‌, ఇల్లెందు ప్రధాన రహదారిలో పదుల సంఖ్యలో ఇటుక బట్టీలను నిర్వాహకులు అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. ఆయా బట్టీల్లో చాలా మంది చిన్నారులు పనిచేస్తున్నారు. మండలంలో సుమారు 20 నుంచి 30 వరకు ఇటుకబట్టీలు నిర్వహిస్తుండగా ఆయా బట్టీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు వందల సంఖ్యలో పనులు చేస్తున్నారు. ఒక్కో బట్టీలో 5 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలు.. 10 నుంచి 15 మంది ఆ కార్మికులతో పాటు పనులు చేస్తున్నారు. ఇలా మండలంలో సుమారు 200 మందికి పైగా చిన్నారులు చదువుకు దూరమై వెట్టి చాకిరీ చేస్తున్నారు. కొత్తపేట శివారులోని ఓ బట్టీలో శనివారం ఓ బాలుడు ఇటుకను తరలిస్తుండగా మరో బాలిక సైతం పనుల్లో నిమగ్నమై కనిపించారు. అంతేకాదు బట్టీ కార్మికులకు సరైన నివాస సౌకర్యం కల్పించకపోవడంతో ఉన్న గుడిసెల్లో వారు కాలం వెళ్లదీస్తున్నారు.
గతంలో ఈ ప్రాంతంలో ఓ పాఠశాల ఉండేది. అందులో ఇలాంటి పిల్లలకు భోజనం పెట్టి చదివించేవారు. మూడేళ్ల క్రితం అది మూత పడటంతో వీరు.. చదువుకు దూరమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని